ఖమ్మం జిల్లా జైలుకు వనమా రాఘవ

ABN , First Publish Date - 2022-01-12T01:12:42+05:30 IST

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా..

ఖమ్మం జిల్లా జైలుకు వనమా రాఘవ

ఖమ్మం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు వనమా రాఘవను జిల్లా జైలుకు తరలించారు. భద్రాచలం ప్రత్యేక సబ్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాఘవను. భద్రతా కారణాల రీత్యా కోర్టు ఆదేశాల మేరకు ఖమ్మం తరలించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాఘవ తరలింపును గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


కాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రాఘవను రిమాండ్ విధించింది. అయితే వనమా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వనమా రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన తండ్రి అధికారం మాటున షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడ్డారనికొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో రాఘవ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సెటిల్‌మెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన మాట వినని వారిపై రాఘవ దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. 


మూడు నెలల క్రితం పాల్వంచకు చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. తాను వనమా రాఘవ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నాడు. వెంకటేశ్వరరావు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందులో ప్రధాన నిందితుడుగా వనమా రాఘవను చేర్చారు. ఇక రామకృష్ణ అనే వ్యక్తి కూడా.. తాను, తన కుటుంబం రాఘవ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నామని లేఖ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నారు. ఈ కేసులోనూ రాఘవ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. పాల్వంచ పోలీసులు 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఇలా వరుస ఘటనలు, కేసులు రాఘవ వేధింపులు, అరాచకాలకు అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 

Updated Date - 2022-01-12T01:12:42+05:30 IST