దుర్మార్గం

ABN , First Publish Date - 2022-01-08T06:17:18+05:30 IST

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు బాగోతం ప్రకంపనలు సృష్టిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈనెల 3వ తేదీన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం....

దుర్మార్గం

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు బాగోతం ప్రకంపనలు సృష్టిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈనెల 3వ తేదీన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు రాఘవ కారకుడు. ‘నీ ఆస్తితగాదా తీరుస్తా, నీ భార్యను నా దగ్గరకు పంపు’ అని రాఘవ ఒత్తిడితేవడంతోనే తాను చావడంతోపాటు, భార్యాబిడ్డలనూ చంపుకుంటున్నానని బాధితుడు మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ప్రకటించాడు. ‘డబ్బు అడిగితే ఇచ్చేవాడిని, కానీ నా భార్యను అడిగాడు. వాడి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. నేను పోయినా ఆ దుర్మార్గుడు నా భార్యను వదలడు’ అంటూ రాఘవ అరాచకాలను వెలుగులోకి తెచ్చిన ఈ ఘటన అందరి మనసులనూ కలచివేస్తున్నది.


పక్కవారిమీద, సాటివారిమీద పెత్తనానికి ఆస్కారం ఇచ్చే ఏ అధికారమైనా తప్పే. తాను బలవంతుడిననో, గొప్పవాడిననో, పాలకుడిననో ఇతరులమీద దౌర్జన్యం చేయడం ఒకనాటి, గతకాలపు అవగుణాలు. కానీ, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలనుంచి వస్తుంది. వారిమీద సవారీ చేయడానికి దిగడం అన్నింటికంటే దుర్మార్గమైన విషయం. పెత్తనం అత్యంత దుర్మార్గమైన స్థాయికి వెళితే ఎలా ఉంటుందన్నది పాల్వంచ శాసనసభ్యుడి కుమారుడి ఉదంతం తెలియచేస్తుంది. ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, సహాయం చేయమని అడిగినందుకు ఆ బాధితుడి భార్యను తనవద్దకు పంపమని అడిగిన వనమా రాఘవకు స్వతహాగా ఏ అధికారమూ లేదు.


అతడు ప్రజాప్రతినిధి కాదు, అధికారీ కాదు. అతడు ఓ ప్రజాప్రతినిధి కుమారుడు మాత్రమే. సుదీర్ఘకాలం ఒక ప్రాంతంలో ప్రజలద్వారా ఎన్నికవుతున్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడు. రాఘవ అనే ఈ వ్యక్తికి ఉచ్చం నీచం తెలియనంత అహంకారం, కండకావరం ఉన్నాయంటే అందుకు కారణం తండ్రి అధికారమే. కొడుకు తప్పు చేస్తే తండ్రిది ఎంతవరకూ బాధ్యత అని చర్చిస్తున్నవారినీ చర్చించనీయండి. కానీ, తాను ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా చట్టం కానీ, ప్రభుత్వం కానీ తనను ఏమీ చేయదు, చేయలేదన్న ధీమాను కలిగించింది మాత్రం అతడు రాజకీయ కుటుంబానికి చెంది ఉండటమే.


రాఘవను పార్టీనుంచి సస్పెండ్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. విచారణ పూర్తయ్యేదాకా తండ్రితో కూడా పార్టీ తాత్కాలికంగానైనా తెగదెంపులు చేసుకోవాలి. ఇంతకాలం తనకు ఓటువేసి, గెలిపించి, ప్రజాప్రతినిధిని చేసినందుకు కృతజ్ఞతగానైనా నిందితుడి తండ్రి ప్రజలను క్షమాపణ కోరవచ్చు, మరింత గౌరవాన్ని పొందదల్చుకుంటే పదవికి రాజీనామా చేయవచ్చు. తండ్రి అధికారంతో కొడుకులు ఎంత తెగిస్తారో ఉత్తర్ ప్రదేశ్‌లో కళ్ళారా చూశాం. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులమీదకు ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని నడిపి అనేకమంది మరణానికి కారకుడైన కేంద్రమంత్రి కుమారుడికి ఎంతో నిరసన తరువాత కానీ అరదండాలు పడలేదు. తండ్రి ఇంకా కేంద్రపదవిలో భద్రంగా ఉన్నారు. అధికారంలో ఉన్నవారు కానీ, వారి సంబంధీకులు కానీ తప్పు చేస్తే దానిమీద జరిగే నేరవిచారణ, న్యాయప్రక్రియల్లో పలుకుబడి ప్రభావం ఏమాత్రం లేకుండా చూడాలి. కేసులనూ సాక్షులనూ ప్రభావితం చేస్తారనే పేరుతో వివిధ ఉద్యమాల కార్యకర్తలను ఏళ్ళతరబడి బెయిల్ లేకుండా జైళ్ళలో మగ్గబెడుతున్న వ్యవస్థే అధికారపీఠాల్లో ఉన్నవారు తమ సంబంధీకుల కేసులను ప్రభావితం చేయరని ఎలా అనుకుంటుందో అర్థంకాదు. 


ఇది టీఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ్యుడి కుమారుడి ఘనకార్యంగా మాత్రమే చూస్తే పొరపాటే. అన్ని రాజకీయపార్టీల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. కొత్తగా రూపొందిన పార్టీలు కూడా కొంతకాలం అధికారంలో కొనసాగిన తరువాత దుష్టసంస్కృతిలోకి దిగజారిపోతున్నాయి. ప్రజలను మాయచేసి, మభ్యపెట్టి, ఎంతకాలమైనా అధికారంలో కొనసాగగలమనీ, ఎటువంటి నైతికవర్తన, విలువలు, ఆదర్శాలు అక్కరలేదని రాజకీయపార్టీలన్నీ విశ్వసించడంలోనే అసలు సమస్య ఉంది. గతంలో ఎటువంటి న్యాయప్రక్రియకూ తావివ్వకుండా కొందరిని ఎన్‌కౌంటర్ చేసి ‘తక్షణ న్యాయం’ చేకూర్చిన వ్యవస్థ, ఇప్పుడు కనీసం నిందితుడి సత్వర అరెస్టుకు కూడా ఎందుకు చొరవ చూపడం లేదన్న ప్రశ్న సరైనది. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు, సమాజంలో వెలువడుతున్న ఆగ్రహం విస్మరించరానివి.

Updated Date - 2022-01-08T06:17:18+05:30 IST