ప్రగతి పథంలో వనపర్తి

ABN , First Publish Date - 2022-06-03T04:48:05+05:30 IST

జిల్లాను ప్రణాళికాబద్ధంగా ప్రగతిపథంలో అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రగతి పథంలో వనపర్తి
నూతన కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేస్తున్న మంత్రి, కలెక్టర్‌ తదితరులు

-  ప్రతి ఇంటికి స్వరాష్ట్ర ఫలాలు 

-  మన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం 

-  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి   

-  వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

-  అమరవీరులకు ఘన నివాళి

 

వనపర్తి అర్బన్‌, జూన్‌ 2: జిల్లాను ప్రణాళికాబద్ధంగా ప్రగతిపథంలో అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. మంత్రి మాట్లాడుతూ గతం సృష్టించిన సమస్యల వలయంలో నుంచి బయటపడడమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. వనపర్తి పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతోందని, కళాశాల ఏర్పాటు కోసం నాగవరం శివారులో 45 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా పరిధిలో 14 పీహెచ్‌సీలు, 104 ఆరోగ్య ఉప కేంద్రాలు, నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో బస్తీ దవాఖాన త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ కింద, రాజీవ్‌ బీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కింద వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగిందన్నారు. గణపురం బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం పనులు పురోగతులు ఉన్నాయన్నారు. మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.124 కోట్ల 40 లక్షలతో 944 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద వీరాంజనేయ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి 4830 ఎకరాల భూసేకరణ చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం కింద జిల్లాలో 260 కోట్ల 50లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టామన్నారు. రైతులందరికీ సంఘటిత శక్తిగా మార్చే ఉద్ధేశంతో రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 71 రైతువేదికలు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా యాసంగి 2022 సీజన్‌లో పంట పెట్టుబడి కోసం నిధులు జమ చేశామన్నారు. చిట్యాల గ్రామ శివారులో మార్కెట్‌ యార్డు ప్రారంభం, ఆయిల్‌పామ్‌ తోటల విస్తీర్ణానికి 845 మంది రైతులను కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. 118 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో చేపపిల్లల పెంపకం, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ కోసం జిల్లాలో పది 33/11 కేవీ ఉప కేంద్రాల నిర్మాణం, హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత వానాకాలంలో 16లక్షల 72వేల మొక్కలు నాటుటకు లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు తెలిపారు. దళితబంధు పథకం కింద జిల్లాలో 199 యూనిట్లకు రూ.19 కోట్ల 90 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి దశలో 183 పాఠశాలలో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల పథకం కింద జిల్లాలో మొదటి దశలో 3725 గృహాలు మంజూరు అయి ఇప్పటి వరకు ఒక వెయ్యి 158 గృహాలు పూర్తిచేసి 344 గృహాలు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ స్వరాజ్‌ యోజన బ్యాచ్‌ 1,2 కింద 11 రోడ్డు పనులు, 50.75 కిలో మీటర్ల పొడవైన రోడ్డు పనులు 30 కోట్ల 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టి ఇప్పటి వరకు 16 కిలో మీటర్ల పొడవైన రోడ్డు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. వనపర్తి పట్టణంలో వివిధ పథకాల ద్వారా సీసీ రోడ్లు, మరుగు కాలువలు, బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో 2021-22 సంవత్సరానికి రూ.2కోట్ల 38 లక్షలు పన్ను లక్ష్యానికి గాను వందశాతం పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. ఎస్పీ కార్యాలయం భవన సముదాయం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, ఆశిష్‌సంగ్వాన్‌, అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.     

 అలరించిన కవి సమ్మేళనం 

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమం అలరిం చింది. ఈ సందర్భంగా పలువురు కవులు తాము రాసుకుని తెచ్చుకున్న కవిత లను వినిపించి ఆద్యంతం అలరించారు. పలువురు చిన్నారులు ఆటపాటలతో నాట్యాలతో ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కళాకారులను సన్మానించి, అవార్డులను అందజేశారు. గాయకుడు సాయిచంద్‌ తన పాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌, అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, కళాకారులు, కవులు పాల్గొన్నారు.  





Updated Date - 2022-06-03T04:48:05+05:30 IST