Abn logo
Aug 7 2021 @ 16:30PM

మహిళా హోంమంత్రి వల్ల ఏం ఉపయోగం?: అనిత

అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే ముందొస్తాడన్న జగన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. మంగళగిరిలో మహిళపై ఆటోడ్రైవర్ దాష్టీకానికి ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమన్నారు. సీతానగరం గ్యాంగ్ రేప్ జరిగి రెండు నెలలు కావొస్తున్నా నిందితుణ్ణి పట్టుకోలేకపోయారని చెప్పారు. ప్రభుత్వ చర్యలు నిందితులకు సహకరించేలా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై 500కు పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. బయటకు రావాలంటేనే ఆడబిడ్డలు భయపడుతున్నారని చెప్పారు. మహిళా హోంమంత్రి వల్ల ఏం ఉపయోగం? అన్నారు. దిశా చట్టం వల్ల ఒరిగిందేమిటి?, దిశా యాప్ వల్ల ఎంతమంది ఆడవారికి రక్షణ లభించంది? అని ప్రశ్నించారు. సాక్షి పత్రికలో ప్రకటనలపైనే తప్పించి మహిళా రక్షణపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు.