ఆ డొక్కు సైకిల్‌పైనే.. వైజాగ్‌ మొత్తం తిరిగేవాడు!

ABN , First Publish Date - 2020-08-09T19:34:01+05:30 IST

ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గురించి తెలియని వారుండరు.

ఆ డొక్కు సైకిల్‌పైనే.. వైజాగ్‌ మొత్తం తిరిగేవాడు!

ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గురించి తెలియని వారుండరు. అయితే ఆయన సాధారణ జీవితపు లోతుల గురించి చాలామందికి తెలియదు. వంగపండుతో సన్నిహితంగా మెలిగిన మిత్రులకే తెలుస్తుంది. ఆయనతో కలిసి నాటకాలు ప్రదర్శించిన పార్వతీపురం మిత్రుడు, రిటైర్డు ఉపాధ్యాయుడైన రౌతు వాసుదేవరావు.. ఆ జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు..   


1973లో పార్వతీపురంలో జరిగిన సభకు శ్రీశ్రీ హాజరైతే వెళ్లాను. అప్పుడు పరిచయమైన వంగపండు.. ఆయన చనిపోయేవరకు మా స్నేహం కొనసాగింది. ఆయనతో కలిసి ఎన్నో నాటకాలను ప్రదర్శించాను. కొన్నింటిలో నటించాను కూడా.  ఆ సభ నాకిప్పటికీ గుర్తు - పాటలు రాసుకున్న రెండు కాగితాలను పట్టుకుని వచ్చాడు వంగపండు. అప్పటి కైతే అంత గుర్తింపు లేదు. వేదికపైన శ్రీశ్రీతోపాటు విప్లవ రచయిత భూషణం, డా.సీవీ రామకృష్ణారావు వంటి పెద్దలు ఉన్నారు. వేదిక మీదికి పిలవడం అంత సులభం కాదు. కానీ, వంగపండుకు పాడే అవకాశం వచ్చింది. రెండు పాటలు పాడాడు. ఆ పాటలు విన్నాక మైకు అందుకున్న శ్రీశ్రీ.. ‘నేను కవులకు కవిని, ఇతను మీ కవి, ప్రజాకవి..’ అన్నాడు.  


పార్వతీపురం లాడ్జిలో బస చేసిన శ్రీశ్రీ నుంచి వంగపండుకు పిలుపు వచ్చింది. వంగపండుతో పాటు నేను కూడా వెళ్లాను. గద్దర్‌ కూడా అక్కడే ఉన్నాడు. వేదికపై పాడిన పాటను మళ్లీ పాడమని వంగపండుకు చెప్పాడు శ్రీశ్రీ. ‘వత్తన్నాడొత్తన్నాడు భూములున్న భుగతోడు’ అని పాట ఎత్తుకున్నాడు. ఆ పాట మొత్తం విన్న శ్రీశ్రీ చిన్న సవరణ చేశాడు. పట్టండిర గొడ్డళ్లు, నక్కులున్న నాగళ్లు, కక్కులున్న కొడవళ్లు, తిరగల్లు రోకళ్లు తిప్పితిప్పి కొట్టండి.. సిత్తీ బిత్తిగ నరికి సికాకేదీ నేకుండా.. అని వంగపండు పాడాడు. అప్పుడు శ్రీశ్రీ జోక్యం చేసుకుని.. సికాకేదీ లేకుండా వద్దు, సిరునామా నేకుండా అని మార్చు బావుంటుంది అన్నాడు. భూస్వామ్య వ్యవస్థను అడ్రస్‌ లేకుండా చేయాలన్నది మహాకవి అంతరార్థం కాబోలు. 


వంగపండు సామాన్యుల్లో అసామాన్యుడు. నిరాడంబరమైన ప్రజాకవి. అయితే ఆయన్ని టోపీ లేకుండా ఊహించలేం. నేను చాలాసార్లు అదే అడిగాను.. నువ్వెందుకు ఎప్పుడూ ఆ టోపీ తీయవు అని. అసలు నాకు టోపీ లేకపోతే మహా చికాగ్గా ఉంటుంది.. ఎందుకో నాకూ తెలీదు అనేవాడు. గెరిల్లా పోరాటయోధులు టోపీలు పెట్టుకుంటారు.. ఆయనదీ అదే భావజాలం కదా. ఆ వేషధారణ స్ఫూర్తి అయ్యుండొచ్చేమో! సుమారు ముప్పయి ఏళ్ల నుంచీ టోపీ పెట్టుకోవడం అలవాటైంది ఆయనకు.


ఆయన ఎనిమిదో తరగతి చదివాక.. ఐటీఐలో ఫిట్టర్‌ పూర్తి చేశాడు. వైజాగ్‌లోని షిప్‌యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగం వచ్చింది. విచిత్రం ఏంటంటే - ఉద్యోగంలో చేరినప్పుడు ఎక్కడ ఉన్నాడో రిటైర్‌ అయ్యాక కూడా అదే స్థాయికి పరిమితం అయ్యాడు. ఎందుకంటే ఆయనకు ప్రజాజీవితమే మొదటి ప్రాధాన్యం. ఉద్యోగం అప్రాధాన్యం. పాటలు పాడుకుంటూ ఊళ్లు తిరిగేవాడు. నెలకు ఇరవై రోజులు ఉద్యోగానికి పోయేవాడే కాదు. జీతం మొత్తం కట్‌ అయ్యేది. ఒక్కోసారి నెలకు నెల జీతం కూడా వచ్చేది కాదు. ఆయనకంటే వెనక వచ్చినోళ్లకు ప్రమోషన్‌ వచ్చింది.. అలాంటి జూనియర్ల కిందే ఈయన పనిచేయాల్సి వచ్చేది. ఆఫీసుల్లో మెప్పుపొంది, పైకి ఎదగాలన్న కాంక్ష లేదు. అసలు జీతం గురించిన ఆలోచనే ఉండేది కాదు. 


వంగపండుకు ఒక పాత డొక్కు సైకిల్‌ ఉండేది. వైజాగ్‌లో ఉన్నప్పుడు ఇంటినుంచి (కొన్నాళ్లు రామ్‌నగర్‌లో ఉండేవాడు) సుమారు ఆరేడు కిలోమీటర్లున్న షిప్‌యార్డుకు ఆ సైకిల్‌ మీద వెళ్లొచ్చేవాడు. వైజాగ్‌ మొత్తం ఆ సైకిల్‌ మీదే తిరిగేవాడు. తను అంత పెద్ద కవి అనే భావనే ఉండేది కాదు. ఒకసారి నేను వెళితే నన్ను కూడా వెనక కూర్చోబెట్టుకుని షిప్‌యార్డు వరకు తీసుకెళ్లాడు. సుమారు ఇరవై ఏళ్లు సైకిల్‌ మీదే ప్రయాణం. పార్వతీపురం వచ్చాక కూడా అదే సైకిల్‌ మీద తిరిగాడు. ఆయనకు విలాసవంతమైన జీవితం ఇష్టముండేది కాదు. కార్లు కూడా ఎక్కేవాడు కాదు. ఎంత దూరమైనా సరే, వయసును కూడా లెక్క చేయకుండా.. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవాడు. 


ఇప్పటికీ ఆయనకు సొంతిల్లు లేదు. అప్పట్లో ఏదో సర్కారు ఇచ్చిన చిన్న ఇల్లు ఒకటి పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో ఉంది. అది ఒక గది ఇల్లు. అందులోనే ఉండేవాడు. చివరికి అక్కడే చనిపోయాడు. ఇక పిల్లల్లో ఒక కుర్రాడు కష్టపడి టీచర్‌ అయ్యాడు, కూతురు ఉష కూడా ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ల కుటుంబం మొత్తం ప్రజాజీవితానికే అంకితం అయ్యింది. తండ్రి ఏమీ వెనకేయలేదని పిల్లలూ... పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేదని తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడలేదు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఆయన ప్రజాభిమానాన్ని మాత్రమే సంపాదించాడు.  


ఆరోగ్యరీత్యా కొంత భయస్తుడు. ఏది పెడితే అది తినేవాడు. బాగుందా బాలేదా.. ఇవేవీ ఆలోచించడు. తిండి కేవలం బతకడానికే కానీ.. తినడానికి కాదు అనే సిద్ధాంతం.  ఎంత రుచిగా ఉన్నా మితిమీరి తినేవాడు కాదు. అప్పుడప్పుడు జిలకర నీళ్లు తాగేవాడు. పాలు తాగడం ఇష్టం. మాంసాహారాన్ని మాత్రం ఇష్టపడతాడు. అది కూడా రెండు మూడు ముక్కలు తినేవాడంతే. 

పబస్సులు, ఆటోల్లో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు తెల్లకాగితం అందుబాటులో ఉండేది కాదు. పాట తట్టినప్పుడు సిగరెట్‌ పెట్టెను చీల్చి.. లోపలివైపున్న తెల్ల అట్టపై పాటల్ని రాసుకునేవాడు. ఒక సినిమా పాటను అలాగే రాసుకున్నట్లు నాతో చెప్పాడు. మొదట్లో సిగరెట్లు తాగే అలవాటుండేది, మళ్లీ మానేశాడు. ఎప్పుడూ నాతో అనేవాడు.. ‘సినిమా పాటలు రాసేందుకు వెళ్లినప్పుడు ఏసీ గదుల్లో కూర్చోబెట్టి రాయమనేవారు. నన్ను వదిలేయండి, ఒక గదిలో కూర్చుంటే నాకు ఊపిరాడదు, ఆలోచనలు రావు. ఏ బస్టాండుకో వెళ్లి, చెట్ల కింద కూర్చుంటేనే పాటలు తడతాయి..’ అని చెప్పేవాడట.  


సముద్రగాలిని ప్రేమించేవాడు వంగపండు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ నివసించిన ఒక పాత క్వార్టర్‌గదిని వంగపండుకు ఇచ్చారు. పైకప్పు పడిపోకుండా కర్ర దూలం, పైన రేకులు ఉండేవి. అందులో కొన్నాళ్లు ఉండేవాడు. ఇది ఎలాగున్నా ఫరవాలేదు, బీచ్‌కు దగ్గరుంది. నాకు బీచుగాలి తగిలితే హాయిగా ఉంటుంది అనేవాడు. ఆయన రాసిన ఒక పాటలో కూడా బీచుగాలి అని రాశాడు కూడా. అతిథి అధ్యాపకునిగా యూనివర్శిటీలో పనిచేశాడు. 


రేపటికి రూపాయి ఉండేది కాదు. జేబులో ఎప్పుడూ డబ్బులు ఉండవు. ఎవరైనా పాటలు పాడమని పిలిస్తే వెళ్లేవాడు. వాళ్లిచ్చిన దారి ఖర్చులు, బస్సు ఛార్జీలతోనే సరిపెట్టుకునేవాడు. ఈ రోజు ఎలా అనే ఆలోచనే లేనప్పుడు, రేపు ఏంటి అనే ఆలోచన ఎలా వస్తుంది? ఆయనలా బతికేవాడు నూటికో కోటికో ఒక్కడే ఉంటాడు. ఇప్పుడున్నది డబ్బు ప్రపంచం.. వార్ధక్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే.. డబ్బులేకపోతే ఎలా అనే భయం కానీ, దిగులు కానీ ఏకోశాన ఉండేవి కావు. జీవితాన్ని ఎప్పుడూ పండగలా భావించేవాడు. 


ఎరువుల భాగోతం అని నృత్యనాటకం రాశాడు. ఒక గంట నిడివి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రాశాడాయన. ఆ నాటకానికి నేను దర్శకత్వం వహించాను. గుంటూరు, విశాఖలతో పాటు పలు నగరాల్లో ప్రదర్శించాం. ఈ నాటకాన్ని తీసుకుని అమృతభూమి అనే సినిమాను కూడా తీసింది వ్యవసాయశాఖ. జట్టు అనే సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ కరోనా లేకపోతే ఈ సమయానికే విడుదల అయ్యేది. ఆ నాటకం రాసినందుకు జట్టు సంస్థ వంగపండుకు కొంత ఆర్థిక సహాయం చేసింది.  


 - సండే డెస్క్‌

Updated Date - 2020-08-09T19:34:01+05:30 IST