Jun 14 2021 @ 21:13PM

గ్లామర్‌ ఒక్కటే సరిపోదు: వాణీ భోజన్‌

‘దైవమగన్‌’ సీరియల్‌ ద్వారా మంచి పాపులర్‌ అయిన నటి వాణీ భోజన్‌. బుల్లితెరపై నయనతారగా గుర్తింపు పొందింది. కేవలం సీరియళ్ళలో నటించిన ఈమె... వెండితెర హీరోయిన్లకు ధీటుగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె... ‘ఓ మై కడవుళే’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపుగా అర డజను చిత్రాలు ఉన్నాయి. అదేసమయంలో తనకు దొరికే ఖాళీ సమయాల్లో సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది.


ఈ క్రమంలో బుల్లితెర నుంచి వెండితెరకు రావడానికి కారణం ఏంటి అంటూ ఓ వీరాభిమాని ఆమెను ప్రశ్నించాడు. దీనికి వాణి భోజన్‌ సమాధానమిస్తూ.. అనేక టీవీ సీరియల్స్‌లో నటించినప్పటికీ... ఒకే తరహా పాత్రలు లభిస్తాయని, అదే సినిమాల్లో మాత్రం విభిన్నమైన పాత్రలు లభిస్తాయని.. అందుకే, సినిమాల్లోకి అడుగుపెట్టినట్టు తెలిపింది. అయితే, సినిమాల్లో సక్సెస్‌ సాధించేందుకు, మంచి పాపులారిటీ సంపాదించుకునేందుకు గ్లామర్‌, టాలెంట్‌ వీటిలో ఏది ముఖ్యం అంటూ మరో అభిమాని అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. గ్లామర్‌ అవసరమైనప్పటికీ... మనలో టాలెంట్‌ ఉంటేనే సక్సెస్‌ సాధించగలమని చెప్పింది. కేవలం గ్లామర్‌తోనే చిత్రసీమలో రాణించడం కష్టమని వాణీ భోజన్‌ వివరించింది.