వనితా... ఇది నీ ఘనత

ABN , First Publish Date - 2020-12-31T05:45:03+05:30 IST

సాహసంతో సహవాసం... సవాళ్లకు ఎదురెళ్లే నైజం... రంగం ఏదైనా అడుగుపెట్టిన చోట ఆకాశమే హద్దు

వనితా...  ఇది నీ ఘనత

సాహసంతో సహవాసం... 

సవాళ్లకు ఎదురెళ్లే నైజం... 

రంగం ఏదైనా అడుగుపెట్టిన చోట ఆకాశమే హద్దుగా ఎదిగిన వనితలు వీరు. 

ముళ్ల బాటను పూదోటగా మార్చుకుని ఒకరు... వారసత్వానికి సరికొత్త నిర్వచనం ఇచ్చినవారు మరొకరు... 

విశ్వమానవ కల్యాణానికి అహర్నిశలు శ్రమిస్తున్నవారు ఇంకొకరు... కరోనా నామ సంవత్సరంలోనూ దీక్షతో 

జయకేతనం ఎగరేసిన తిరుగులేని మహిళలు వీరు... 





రైజింగ్‌ స్టార్‌


కైలీ జెన్నర్‌

వయసు: 23

ప్రత్యేకత: అత్యధిక పారితోషికం తీసుకొంటున్న నటి.

ఇరవై మూడేళ్ల వయసులోనే భిన్న రంగాల్లో కాలుమోపి విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు అమెరికా రియాలిటీ టీవీ స్టార్‌ కైలీ జెన్నర్‌. మీడియా పర్సనాలిటీగా, సోషలైట్‌గా, మోడల్‌గా, పారిశ్రామికవేత్తగా... చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. 2007లో ‘కీపింగ్‌ అప్‌ విత్‌ ద కర్దాషియన్స్‌’ రియాలిటీ షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఏటికేడు పైపైకి దూసుకుపోతోంది. ‘కైలీ కాస్మొటిక్స్‌’ పేరిట సొంత కాస్మొటిక్స్‌ కంపెనీ ప్రారంభించి వ్యాపారవేత్తగానూ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆమె సంపద విలువ 700 మిలియన్‌ డాలర్లు.


‘ఫోర్బ్స్‌’ 2020 జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న తారగా రికార్డులకెక్కి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. ‘కైలీ కాస్మొటిక్స్‌’ ఒక్క 2019లోనే 200 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రముఖ రియాలిటీ షో స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ ఆమె సోదరి. జెన్నర్‌ క్రియేటివ్‌ ఆలోచనలు, మార్కెటింగ్‌ నైపుణ్యమే ‘కైలీ కాస్మొటిక్స్‌’కు ప్రధాన పెట్టుబడి.




కొవిడ్‌పై టీకాస్త్రం

సారా గిల్బర్ట్‌

వయసు: 58

ప్రత్యేకత: కొవిడ్‌ వ్యాక్సిన్‌ డెవలపర్‌

కరోనా వ్యాక్సిన్‌పై దేశదేశాల్లో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నా అందరి చూపూ బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ’ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పైనే. ఫార్మా దిగ్గజం ‘ఆస్ట్రాజెనెకా’తో కలిసి ఆ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ బృందానికి నేతృత్వం వహించింది ఒక మహిళ. ఆమే సారా గిల్బర్ట్‌. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌ అయిన సారా... 300 మంది పరిశోధకుల బృందంతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరుగులు పెట్టించారు. ‘ఐదేళ్లు పట్టే దశలను నాలుగు నెలల్లోనే దాటేశాం’ అంటూ అప్పట్లో ఆమె గర్వంగా ప్రకటించారు. కరోనా వైరస్‌తో పోరాడగలిగే యాంటీబాడీలు, టీ-కణాలను ఈ టీకా ఉత్పత్తి చేయగలుగుతోందని రుజువైంది.


విశ్వకల్యాణం కోసం రాత్రింబవళ్లూ శ్రమిస్తున్న సారా ఎప్పుడూ కెమెరా కళ్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చిన్ననాటి నుంచే వైద్య పరిశోధకురాలు కావాలనుకున్న సారా కలలకు... బయోలజీ డిగ్రీలో చేరడంతో తొలి అడుగు పడింది. తరువాత బయోకెమిస్ర్టీలో పీహెచ్‌డీ చేసిన ఆమె... బయోటెక్నాలజీ ఇండస్ర్టీలో పరిశోధనలు చేశారు. ఆ సమయంలోనే ఔషధాల తయారీ గురించి తెలుసుకున్నారు. 1994లో ఆక్స్‌ఫర్డ్‌లో ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టిన సారా జెనెటిక్స్‌, హోస్ట్‌-పారాసైట్స్‌, మలేరియాపై పరిశోధనలు జరిపారు. ‘వ్యాక్సిటెక్‌’ సహవ్యవస్థాపకురాలు కూడా అయిన ఆమె ఇన్‌ఫ్లుయంజా, వైరల్‌ వ్యాధికారక క్రిములపై పోరాడే వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.




బహుముఖ దృక్పథం


అలైస్‌ వాల్టన్‌

వయసు: 71

ప్రత్యేకత: ప్రపంచంలోకెల్లా సంపన్న మహిళ ప్రపం

చంలోనే అతిపెద్ద రీటైల్‌ సంస్థ ‘వాల్‌మార్ట్‌’ అధిపతుల్లో ఒకరు అలైస్‌ వాల్టన్‌. తండ్రి శామ్‌ వాల్టన్‌ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ సామ్రాజ్యాన్ని మాత్రమే ఆమె అంటిపెట్టుకుని కూర్చోలేదు. తన సహోదరులతో కలిసి ‘వాల్‌మార్ట్‌’లో భాగస్వామిగా ఉన్నా... వారికి భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని తపించారు. తల్లి హెలెన్‌తో కలిసి చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌లు వేసేవారు. ఈ కళపై ఉన్న మక్కువతో 2011లో ‘క్రిస్టల్‌ బ్రిడ్జెస్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఆర్ట్‌’ను నెలకొల్పారు. దాని ద్వారా అమెరికా ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్స్‌ను కొనుగోలు చేసి భద్రపరుస్తున్నారు. ఇది ఆమెలోని ఒక కోణం మాత్రమే.


విశేషమేమంటే 1971 ‘ట్రినిటి విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన అలైస్‌... తొలుత మాతృ సంస్థ ‘వాల్‌మార్ట్‌’లో పిల్లల దుస్తుల బయ్యర్‌గా పనిచేశారు. తరువాత ఈక్విటీ ఎనలిస్ట్‌గా, మనీ మేనేజర్‌గా ‘ఫస్ట్‌ కామర్స్‌ కార్పొరేషన్‌’లో విధులు నిర్వర్తించారు. తరువాత ‘ఆర్వెస్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌’ను నడిపించారు. 1988లో ‘లామా కంపెనీ’ పేరిట బ్యాంక్‌ను స్థాపించారు. దానికి  చైర్‌పర్సన్‌గా, ప్రెసిడెంట్‌గా వ్యవహించారు.


‘నార్త్‌వెస్ట్‌ అర్కన్సాస్‌ కౌన్సిల్‌’ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా అక్కడి విమానాశ్రయం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దానికి 15 మిలియన్‌ డాలర్లు సాయం అందించారు. అతి పెద్ద కంపెనీకి అధిపతిగానే కాకుండా... మానవత్వం ఉన్న మనిషిగా, తిరుగులేని మహిళగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ‘ఫోర్బ్స్‌’ పత్రిక 2020 జాబితాలో 70.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోకెల్లా సంపన్నురాలైన మహిళగా నిలిచారు. ప్రస్తుతం గాడి తప్పిన అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. 




ఎల్లలు దాటిన ఆదరణ


ఏంజెలా మోర్కెల్‌

వయసు: 66

ప్రత్యకత: యూరప్‌లో అతి శక్తిమంతమైన నాయకురాలు.

ఏంజెలాది పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి వలస వచ్చిన ఒక కుటుంబం. క్వాంటమ్‌ కెమిస్ట్రీలో డాక్టరేట్‌ చేసి, పరిశోధకురాలుగా వృత్తి జీవితం కొసాగించిన ఆమె 1989లో రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. అనేక పదవులు చేపట్టారు. 2005లో జర్మనీకి తొలి మహిళా ఛాన్సెలర్‌గా ఆమె ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పదవిని నాలుగో విడత నిర్వహిస్తున్నారు. మరోవైపు యూరప్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా ఆమె ఆవిర్భవించారు. ఆర్థిక సంక్షోభం నుంచి జర్మనీని గట్టెక్కించి, యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దారు. పదిహేనేళ్ళపాటు పదవిలో ఉన్నప్పటికీ ఆమెకు ప్రజాదరణ చెక్కుచెదరలేదు.


అంతేకాదు, తమ దేశాల నాయకులకన్నా ఏంజెలానే ఎక్కువగా విశ్వసిస్తామని 14 యూరోపియన్‌ దేశాల్లో... 2020 అక్టోబర్‌లో నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో సుమారు 75 శాతం మంది స్పష్టం చేశారు. అయితే వచ్చే ఏడాది తన పదవీకాలం పూర్తయ్యాక మళ్ళీ రాజకీయ పదవుల పోటీలో ఉండనని ఏంజెలా ఇప్పటికే ప్రకటించారు. ‘ఫోర్బ్స్‌’ సంస్థ ‘2020లో ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితా’లో మొదటి స్థానాన్ని ఏంజెలాకు కట్టబెట్టింది. మన దేశం నుంచి ఇందిరాగాంధీ శాంతి బహుమతితో సహా అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఆమెకు లభించాయి.




ఔదార్యంలో గ్రేట్‌!


మిలిందా గేట్స్‌

వయసు: 56

ప్రత్యేకత: దాతృత్వంలో ప్రపంచ ప్రఖ్యాతి

అమెరికాలోని డల్లాస్‌లో పుట్టిన మిలిందాకు చిన్న వయసు నుంచీ టెక్నాలజీ అంటే ఆసక్తి. కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీతోపాటు ఎంబిఎ కూడా చేసిన ఆమె కొన్నాళ్ళు పిల్లలకు లెక్కలు, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ బోధించారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వివాహం చేసుకున్నారు. మిలిందా, ఆమె భర్త 2000 సంవత్సరంలో స్థాపించిన ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్‌ ఛారిటబుల్‌ సంస్థ.


కరోనాపై పోరాటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ ఫౌండేషన్‌ 250 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ప్రజలు ఆరోగ్యమైన, ఉత్పాదకమైన జీవితాలను సాగించడానికి దోహదపడడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్‌ పని చేస్తోంది. దాతృత్వంలో... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా కొన్నేళ్ళ నుంచి ‘ఫోర్బ్స్‌’ జాబితాలో మిలిందా కొనసాగుతున్నారు. పని ప్రదేశాలను మహిళలకు మరింత అనుకూలంగా మార్చడం, మహిళలు మరింత సాధికారత సాధించడానికి దోహదపడడం తన లక్ష్యాలని చెబుతారామె. ఆమె రాసిన ‘ది మూమెంట్‌ ఆఫ్‌ లిఫ్ట్‌: ఎంపవరింగ్‌ ఉమెన్‌ ఛేంజెస్‌ ది వరల్డ్‌’ పుస్తకం 2019లో విడుదలైంది.




ఉక్కు మహిళ


జెసిండా ఆండ్రేన్‌

వయసు: 40

ప్రత్యేకత: న్యూజిలాండ్‌కు ప్రధానిగా రెండోసారి విజయం

న్యూజిలాండ్‌ దేశానికి అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగానే కాదు, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనే నేతగా కూడా జెసిండా ఆండ్రేన్‌ గుర్తింపు పొందారు. 2019లో, ఆ దేశంలో ఒక ఉగ్రవాది మారణహోమం సృష్టించినప్పుడు జెసిండా స్పందించిన తీరు ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే పేరు సంపాదించిపెట్టింది. అలాగే న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి ఆమె చేపట్టిన చర్యలు సైతం ప్రశంసాపాత్రమయ్యాయి.


అందుకే 2020 అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆమెకు మళ్ళీ పట్టం కట్టారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జెసిండా పదిహేడేళ్ళ వయసులోనే లేబర్‌ పార్టీ యువజన విభాగంలో సభ్యురాలయ్యారు. 2017లో తొలిసారి న్యూజిలాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవే ఆమె పార్టీకి తాజా ఎన్నికల్లో డెబ్భయ్యేళ్ళలో ఎన్నడూ లేనన్ని ఓట్లను సాధించి పెట్టాయి. వివిధ సంస్థలు ఆమెను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన మహిళల్లో ఒకరిగా ఎంపిక చేయడానికి దోహదం చేశాయి.



కమల వికాసం


కమలా హారిస్‌

వయసు: 56

ప్రత్యేకత: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు

ఈ మధ్య అమెరికాలో జరిగిన ఎన్నికలపై భారతీయులు ఎనలేని ఆసక్తి చూపించడానికి కారణాల్లో కమలా హారిస్‌ ఒకరు. భారతీయ మూలాలు కలిగిన ఒక వ్యక్తి అగ్రరాజ్యంలో రెండవ అత్యున్నత స్థానానికి పోటీ పడడమే కాదు, ఘన విజయం సాధించడం ఒక చరిత్ర. కమల తల్లి శ్యామల తమిళనాడుకు చెందినవారు. తండ్రి హారిస్‌ది జమైకా. పౌర హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లి ప్రభావంతో చిన్ననాటి కమలపై ఉంది. ఆమె న్యాయవాదిగా డ్రగ్స్‌ ముఠాలు, సెక్స్‌ ట్రాఫికింగ్‌పై పోరాడారు. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా పని చేశారు.


అంతేకాదు, కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌, తొలి దక్షిణాసియా-అమెరికన్‌గా గుర్తింపు సాధించారు. 2017లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ట్రంప్‌ తెచ్చిన ఇమ్మిగ్రేషన్‌ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవిని పోటీ చేసి విజయం సాధించారు. ఆ పదవిని చేపట్టే మొదటి మహిళగా నిలవబోతున్నారు. ‘ఫోర్బ్స్‌’తో సహా అనేక సంస్థలు ఆమెను ‘2020లో అత్యంత ప్రభావశీలమైన మహిళ’ల్లో ఒకరుగా గుర్తించాయి. 


Updated Date - 2020-12-31T05:45:03+05:30 IST