Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయ్యో అన్నమయ్య

 • నామరూపాల్లేకుండా పోయిన ప్రాజెక్టు.. ఈ పాపం ఎవరిది?
 • ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపముందా?
 • నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యముందా?
 • మట్టి కట్ట ఎందుకు కొట్టుకుపోయింది?
 • గ్రామాలు ఛిద్రం..39 మంది మృత్యువాత
 • కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలెన్నో!
 • మూడు గ్రామాలకు కోలుకోని నష్టం
 • ముప్పును పసిగట్టిన రిటైర్డ్‌ లష్కర్‌ రామయ్య
 • ఇంజనీర్లు ఎందుకు అంచనా వేయలేదు? 
 • నిపుణుల కమిటీ పరిశీలనలో ఏం తేలింది? 
 • ఏడాదిగా మరమ్మతులకు నోచని 5వ గేటు
 • సకాలంలో రూ.4 కోట్లు ఇవ్వని ప్రభుత్వం
 • రేపు కడప జిల్లాకు సీఎం జగన్‌

 • (కడప-ఆంధ్రజ్యోతి)

చెయ్యేరు నదికి వరద పోటెత్తి అన్నమయ్య ప్రాజెక్టు మట్టి ఆనకట్ట కొట్టుకుపోవడంతో 39 మంది మృత్యువాత పడ్టారు. ఇళ్లు, పంటపొలాలు, నగదు నట్రా, గొడ్డు గోదా.. ఇలా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వీధినపడ్డ కుటుంబాలెన్నో ఉన్నాయి. పులపత్తూరు, తోగూరుపేట, మందపల్లె సహా పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఇంతటి ఘోరాన్ని చూడలేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మరి ఈ పాపం ఎవరిది? ఊహించని వరద ఒక్కసారిగా పోటెత్తడమా? రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన నెట్‌వర్క్‌, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా వరదను అంచనా వేసి దిగువ గ్రామాలను అప్రమత్తం చేయడంలో విఫలమైన జిల్లా యంత్రాంగానిదా? ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపమా? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ..


యంత్రాంగం నివేదికలో ఏముంది?

చెయ్యేరుకు అంచనాలకు మించి వరద రావడం వల్లనే అన్నమయ్య ప్రాజెక్టు మట్టి ఆనకట్ట కొట్టుకుపోయింది. ఇదీ జిల్లా యంత్రాంగం నివేదిక. ఇందులో నిజం లేకపోలేదు. అయితే వరదను అంచనా వేయడంలో ఇంజనీరింగ్‌ నిపుణులు విఫలమయ్యారా? ముందే దిగువ గ్రామాలను అప్రమత్తం చేస్తే.. ఇంత నష్టం జరిగేది కాదుకదా! ఉప్పెనై ముంచేసిన చెయ్యేరు వరదకు చితికిన పల్లెల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి.  ‘ఎన్నో వరదలు చూశాం. చెయ్యేరు ఏనాడు అన్యాయం చేయలేదు. మట్టికట్ట కొట్టుకుపోవడం ఇంతటి ఘోరానికి కారణమైంది’ అని ముంపు గ్రామాల్లోని ప్రజలు వాపోతున్నారు. 


ఐదారేళ్లు సర్వేలు చేసి ప్రాజెక్టుకు డిజైన్‌..

అన్నమయ్య ప్రాజెక్టు ఎగువన చెయ్యేరు నదిలో బాహుదా, మాండవ్య నదులు సహా పలు పెద్ద వంకలు కలుస్తున్నాయి. 1981లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అప్పటికే ఐదారేళ్లు ఇంజనీర్లు పలు సర్వేలు చేసి సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో సీఈ)కు డీపీఆర్‌, ప్రాజెక్టు డిజైన్‌ పంపి అప్రూవల్‌ వచ్చాకే పనులు మొదలు పెట్టారని ఓ ఇంజనీరు తెలిపారు. 


200 ఏళ్ల గరిష్ఠ వరద ప్రాతిపదిక

ఏ ప్రాజెక్టు అయినా నిర్మాణానికి ముందు వందేళ్లు, 200 ఏళ్లలో అత్యధికంగా వచ్చిన వరద(ఓఎంఎ్‌ఫడీ) లెక్కలు పరిశీలిస్తారు. ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో నిపుణులు పర్యటించి ఆ పల్లెల్లో వృద్ధులు, ఎన్నో వరదలు చూసిన వాళ్లతో మాట్లాడి.. ఏ సంవత్సరంలో అత్యధిక వరద వచ్చింది? ఆ సమయంలో ఏ స్థాయిలో నది ప్రవహించిందో తెలుసుకొని  ఓఎంఎ్‌ఫడీ(అబ్జర్వ్‌డ్‌ మ్యాగ్జిమమ్‌ ఫ్లడ్‌ డిశ్చార్జి)ని అంచనా వేస్తారు. ఓఎంఎ్‌ఫడీకి ఒకటిన్నర రెట్ల వరదను తట్టుకునేలా స్పిల్‌వే గేట్లు ఏర్పాటు చేయాలని, అప్పుడే పూర్తి భద్రంగా ఉంటాయని రాయలసీమకు చెందిన ఇంజనీరింగ్‌ నిపుణుడు వివరించారు. 


200 ఏళ్లలో రానంత వరద..

అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వందేళ్లలో 2.40 లక్షల క్యూసెక్కులు, రెండొందల ఏళ్లలో 2.85 లక్షల క్యూసెక్కులు అత్యధికంగా వరద వచ్చినట్లు గుర్తించారు. దానికి ఒకటిన్నర రెట్లు అంటే దాదాపు 3.60 లక్షల క్యూసెక్కుల విడుదలను తట్టుకునేలా స్పిల్‌వే గేట్లు ఏర్పాటు చేసి ఉండాలని ఆ ఇంజనీరింగ్‌ నిపుణుడు వివరించారు. అయితే.. ఇక్కడ 2.40 లక్షల క్యూసెక్కుల విడుదలకు తగ్గట్టు స్పిల్‌వే గేట్లు ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మట్టికట్ట తెగిపోడానికి ముందు రాత్రి 2.65-3.25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఇంజనీర్ల అంచనా. 


ఐదో గేటు తెరచుకోకే...

గతేడాది నివర్‌ తుఫాన్‌ వరదకు మూడు గేట్లు చెడిపోతే, వాటిలో రెండింటికే మరమ్మతులు చేశారు. 5వ గేటు పూర్తిగా పాడైపోయి తెరుచుకోకపోవడంతో నాలుగు గేట్లనే తెరిచారు. రాత్రే పింఛా రింగ్‌ బండ్‌ తెగిపోయి వరద 1.25 లక్షల క్యూసెక్కులు సహా బాహుదా, మాండవ్య నదులు, స్థానిక వంకల ద్వారా అన్నమయ్య ప్రాజెక్టుకు 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఐదో గేటు తెరుచుకోలేదు. నాలుగు గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులకు మించి విడుదల చేసే పరిస్థితి లేదు. అంటే.. డిశ్చార్జి కంటే లక్షకు పైగా క్యూసెక్కుల వరద ఎక్కువ ఉన్నప్పుడు మట్టి ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉన్నట్టే.


గ్రామాలను ఎందుకు ఖాళీ చేయించలేదు?

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వరద పెరుగుతోందని ఇంజనీర్లే తెలిపారు. అలాంటప్పుడు ప్రాజెక్టు దిగువ గ్రామాలను ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? రిటైర్డ్‌ లష్కరు పర్నా రామయ్య వరద తీవ్రతను అంచనా వేసి తనకు తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేసి ఆనకట్ట ఎప్పుడైనా తెగిపోవచ్చు.. గుట్టపైకి వెళ్లిపోండని తోగూరుపేట, పులపత్తూరు వాసులను అప్రమత్తం చేయడంతో వందల మంది సురక్షిత ప్రాంతాలకు చేరుకోగలిగారు. ఇంజనీరింగ్‌ నిపుణులు, జిల్లా యంత్రాంగం ముందే అంచనా వేసుంటే.. ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదని ముంపు బాధితులు వాపోతున్నారు. 


అంతా గంటలోపే

అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయి పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు, పాటూరు, నందలూరు సహా పలు గ్రామాలను వరద ముంచేసింది. ఆ గ్రామాల్లో బాధితులను పలకరిస్తే గంట లోపలే సర్వం వరద ఊడ్చుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీర్ల లెక్క ప్రకారం కట్ట తెగిపోక ముందు 2.65-3.25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. అప్పటికే డ్యాంలో 2.24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఒక టీఎంసీ నీటిని గంట వ్యవధిలో ఖాళీ చేయాలంటే 2.80 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేయాలని ఓ ఇంజనీరు పేర్కొన్నారు. ఈ లెక్కన డ్యాంలో నిల్వ ఉన్న 2.24 టీఎంసీలు ఖాళీ చేయాలంటే. 6.27 లక్షల క్యూసెక్కులు వదలాల్సి ఉంటుంది. డ్యాం తెగిపోయి గంటలోపే ఊళ్లను ముంచేసిందని స్థానికులు అంటున్నారు. అంటే.. డ్యాంలో నిల్వ ఉన్న నీరు కలిపి సరాసరి 9.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రెండు కొండల మధ్యలో అతి వేగంతో దిగువ గ్రామాలను ముంచేసింది. అంతేకాదు.. నది ప్రవాహ సామర్థ్యానికి రెండు మూడు రెట్లకు ఎక్కువ వరద రావడంతో దిశ మార్చుకొని నదికి దూరంగా ఉన్న గ్రామాలను కూడా ముంచేసింది. 


రూ.60.44 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం..

1996-97 ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.60.44 కోట్లు ఖర్చు చేశారు. జలాశయం సామర్థ్యం 2.38 టీఎంసీలు. ఖరీ్‌ఫలో 13 వేల ఎకరాలు, రబీలో 6,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యం. ఆనకట్ట పొడవు 426.25 మీటర్లు ఉంటే.. అందులో మట్టికట్ట పొడవు 336 మీటర్లు, స్పిల్‌వే పొడవు 90.25 మీటర్లు. ఒక్కో గేటు 13.70 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల ఎత్తు, 48 వేల క్యూసెక్కుల వరద డిశ్చార్జి సామర్థ్యంతో ఐదు స్పిల్‌వే గేట్లు ఏర్పాటు చేశారు. 2.40 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా గేట్లు డిజైన్‌ చేశారని ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి రాజంపేట, దాని చుట్టుపక్కల 140 గ్రామాలకు తాగునీటి కోసం 190 ఎంసీఎ్‌ఫటీల నీటిని కేటాయిస్తూ 2003 జూలై 31న జీవో నంబరు 905 జారీ చేశారు. 


ఎందుకు అంచనా వేయలేకపోయారు?

ఐదు స్పీల్‌వే గేట్ల డిశ్చార్జ్‌ సామర్థ్యం 2.40 లక్షల క్యూసెక్కులు కాగా.. 19వ తేదీకి ముందు రాత్రి 2.65-3.25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతోనే ఒత్తిడి పెరిగి మట్టికట్ట కొట్టుకుపోయిందని ఇంజనీర్లు, జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొనట్లు తెలిసింది. అయితే, ఆ వరదను ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారనేది అందరి మదిలో వేధిస్తున్న ప్రశ్న.


గేటు మరమ్మతులకు సకాలంలో నిధులివ్వకే..

గతేడాది 3, 4, 5వ నంబరు గేట్లు దెబ్బతిన్నాయి. స్వల్పంగా దెబ్బతిన్న 3వ, 4వ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేశారు. 5వ గేటు పూర్తిగా దెబ్బతినడంతో పైకి ఎత్తేందుకు వీలు లేకుండా మూసుకుపోయింది. ఈ గేటు మరమ్మతుల కోసం రూ.4 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సకాలంలో నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేసి ఉంటే, ఆ గేటు ద్వారా 48 వేల క్యూసెక్కులు దిగువకు వెళ్లేవి.. ఆనకట్టపై ఒత్తిడి తగ్గేదని నిపుణులు అంటున్నారు.


ప్రాజెక్టు నిర్మాణానికి 20 ఏళ్లు

చెయ్యేరుపై సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రభుత్వంలో బీజం పడింది. సర్వే చేసి మూడు ప్రాంతాల్లో ఆనకట్ట కట్టడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రాజంపేటకు 25 కి.మీల దూరంలో రెండు కొండల మధ్య 426.25 మీటర్ల పొడవు మట్టికట్ట, స్పిల్‌వే నిర్మించేలా డిజైన్‌, డీపీఆర్‌ తయారు చేశారు. 1981లో టి.అంజయ్య ప్రభుత్వంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 20 ఏళ్ల తరువాత దీని నిర్మాణం పూర్తి చేసి 2001లో నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అంకితం చేసింది. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకకు సమీపంలోనే నిర్మించినందున ఈ ప్రాజెక్టుకు అన్నమయ్య పేరు పెట్టారని స్థానికులు తెలిపారు.గేట్ల నిర్వహణలో లోపం?

స్పిల్‌వే గేట్ల నిర్వహణలో ప్రాజెక్టు ఇంజనీర్ల అవగాహన లోపం కూడా శాపంగా మారిందా? రాష్ట్ర నిపుణుల కమిటీ పరిశీలనలో వెలుగు చూసిన అంశాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. నవంబరు 24న రిటైర్డ్‌ సీఈ - సీడీవో, ఈఎన్‌సీ గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్‌ సీఈ రౌతు సత్యనారాయణ, రిటైర్డ్‌ సీఈ-సీడీవో శ్రీనివానులుతో కూడిన రాష్ట్ర ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ వరదకు తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులను పరిశీలించింది. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే గేట్ల నిర్వహణ రికార్డులను పరిశీలించింది. 19న రాత్రి గేట్లు 9.7 మీటర్లు ఎత్తినట్లు రికార్డులో నమోదు చేసినట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. వాస్తవంగా గేట్ల ఎత్తు 14 మీటర్లు. పూర్తిగా గేట్లు ఎత్తితేనే ఒక్కో గేటు నుంచి 48 వేల క్యూసెక్కులు బయటకు వెళ్తుంది.


9.7 మీటర్లే ఎత్తినట్లు రికార్డుల్లో నమోదు చేసిన విషయాన్ని నిపుణుల కమిటీ ప్రశ్నిస్తే ప్రాజెక్టు ఇంజనీర్లు సరైన సమాధానం ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. గేట్ల ఆపరేషన్‌లో సరైన అవగాహన లేక పూర్తిగా ఎత్తలేదని తెలుస్తోంది. అయితే, గేట్లు పూర్తిగా ఎత్తినా.. సరైన అంచనా వేయలేక రికార్డుల్లో 9.7 మీటర్లు ఎత్తినట్లు చూపించామని అదేరోజు సాయంత్రం ఇరిగేషన్‌ అధికారులు నిపుణుల కమిటీకి వివరించినట్లు సమాచారం. 18వ తేదీ ఉదయం నుంచి క్రమంగా వరద పెరుగుతున్నా గేట్లు పూర్తిగా ఎందుకు ఎత్తలేదని నిపుణుల కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement