సంప్రదాయబద్ధంగా అప్పన్న వార్షిక తిరుకల్యాణం

ABN , First Publish Date - 2020-04-05T09:39:16+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో శనివారం రాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా అప్పన్న వార్షిక తిరుకల్యాణం

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించని ప్రభుత్వం


సింహాచలం, ఏప్రిల్‌ 5: వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో శనివారం రాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులతోపాటు ట్రస్టీలు, ప్రముఖులు, దేవస్థానం సిబ్బంది, మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలుచేస్తూ వార్షిక ఉత్సవాన్ని పూర్తి చేశారు. దీంతో వైదికులతోపాటు అతితక్కువ మంది మాత్రమే ఉత్సవానికి హాజరయ్యారు. అయితే  సంప్రదాయంగా వస్తున్న ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ కూడా ఈ ఏడాది లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్సవంలో భాగంగా దేవాలయ స్థానాచార్యులు డాక్టర్‌ టి.పి.రాజగోపాల్‌, ఉపప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు సారధ్యంలో తొలుత కొట్నాల ఉత్సవంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో గురుడ గద్యలు పాడుతూ దివిలోని దేవతలను కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రావాల్సిందిగా భువికి ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం కావించారు.


ఆలయ బేడా మండపంలోనే ఎదురు సన్నాహోత్సవాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ‘లోకకల్యాణార్థం’ అనే సంకల్పంతో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంలో స్వామివారి వార్షిక తిరుకల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీతధారణ, జీలకర్రా బెల్లం, మాంగల్యధారణలను శాస్త్ర విధానంలో జరిపించారు. అక్షితారోపణం (తలంబ్రాలు) కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా వివిధ రకాల ఫలాలను ప్రత్యేక నైవేద్యాలుగా సమర్పించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో దేవాలయ సహాయ కార్యనిర్వాహణాధికారి పులి రామారావు, ప్రజాసంబంధాల అధికారి తులా రాముడు తదితరులు పర్యవేక్షించారు. 

Updated Date - 2020-04-05T09:39:16+05:30 IST