Abn logo
Jun 4 2020 @ 20:33PM

వరవరరావు, సాయిబాబాను విడుదల చేయాలి: పీకేఎం జాన్

హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ప్రజాకళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ డిమాండ్ చేశారు. వరవరరావు, సాయిబాబా, భీమా కోరేగావ్ కేసులో ఉన్న నిందితులందరినీ, తెలంగాణలో యూఏపీఏ కింద అరెస్టు చేసిన ప్రతి ఒక్కరినీ విడుదల చేయాలని కోరుతూ నిర్బంధ వ్యతిరేక వేదిక ఆందోళనల‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 3వ తేదీ నుండి 9 వతేదీ వరకు అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. ఇందులోభాగంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాల విడుదల కోసం, అలాగే వివిధ కేసుల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీల విడుదల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కవులు, మేధావులు, ప్రజాసంఘాల కార్యకర్తలను కాపాడుకోడానికి మరింత గట్టిగా పనిచేయాలన్నారు. 


వివిధ రాష్ట్రాల్లో ఎందరో రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు జైళ్లలో ఉన్నారని జాన్ తెలిపారు. కరోనా వైరస్ జైళ్లలో కూడా వ్యాపిస్తోందన్న వార్తలు వస్తున్నాయని, కాబట్టి జైలు నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నేతలకు నిషేధించిన విప్లవ పార్టీలతో  సంబంధాలు అంటగట్టడం, నేరారోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని భావప్రకటనా స్వేచ్ఛకు కూడా వ్యతిరేకమని చెప్పారు. విప్లవ రాజకీయాలపట్ల విశ్వాసం ఉండటం నేరం కాదని న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో చెప్పాయని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వాలు ఇలాంటి నేరారోపణలు చేస్తూనే ఉన్నాయని, అణచివేత ప్రయోగిస్తూనే ఉన్నాయని జాన్ తప్పుబట్టారు. 

Advertisement
Advertisement
Advertisement