నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2020-07-23T17:12:17+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు లేఖ రాశారు.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి దళితులపై, బీసీలపై, మహిళలపై, అట్టడుగు వర్గాల వారిపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా యదేచ్చగా కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు. దళిత యువకుడైన వరప్రసాద్ పై దాడి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. స్థానిక వైసీపీ నాయకుడు, జక్కంపూడి రాజా అనుచరుడు కావల కృష్ణమూర్తి  40 మందితో కలిసి వరప్రసాద్ పై దాడికి తెగబడి..కులం పేరుతో దూషించాడని పేర్కొన్నారు.


సీతానగరం పోలీసులు బాధితుడికి రక్షణ కల్పించకుండా వరప్రసాద్‌కు సహాయంగా వచ్చినా అతని స్నేహితులు అనిల్ అఖిల్ సందీప్‌లను లాఠీలతో క్రూరంగా చితకబాదారని చెప్పారు. వరప్రసాద్‌ను కులం పేరుతో దూషించి గుండు గీయటమే కాకుండా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతని తల్లిని కూడా దూషించారని లేఖలో పేర్కొన్నారు. ఇది అంతటికీ కారణమైన పోలీసులపై వైసీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను వర్ల రామయ్య కోరారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులను వేకెన్సీ రిజర్వులో పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీనితో ఆ ప్రభుత్వ అధికారులు 50% జీతాలు కోల్పోతున్నారని తెలిపారు. 


ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే తమను కూడా వేకెన్సీ రిజర్వులో పెడతారేమో అని అధికారులు బాధితులకు న్యాయం చేయడానికి భయపడుతున్నారన్నారు. 2019 జూన్ నుండి ఈ విధమైన మానవ హక్కుల ఉల్లంఘన రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై కమిషన్ స్పందించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-07-23T17:12:17+05:30 IST