Oct 21 2021 @ 21:54PM

‘వరుడు కావలెను’ ట్రైలర్: గుడ్ గుడ్ గుడ్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ కథానాయకుడు నాగశౌర్య, రీతువర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ట్రైలర్ విషయానికి వస్తే..

‘పెళ్లిచూపులు’ సినిమాతో పేరు తెచ్చుకున్న రీతూ వర్మకి.. పెళ్లిచూపుల కాన్సెఫ్టే నచ్చదు అంటూ తన కూతురు గురించి నదియా చెబుతున్న డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తరహాలోనే మ్యారేజ్ కాన్సెఫ్ట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే.. ప్రతి సీజన్‌లో ఆవిడే విన్నర్ తెలుసా? వంటి పంచులే కాకుండా.. నా పేరు ఆకాశ్.. భూమికి అన్నివైపులా నేను ఉంటాను అని హీరో అంటే... భూమి, ఆకాశం ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవ్.. అని హీరోయిన్ చెప్పే డైలాగ్, అలాగే ట్రైలర్ చివరిలో వచ్చే ఒకసారి చదివిన పుస్తకాన్ని మళ్లీ చదివితే కథ మారుతుందా?.. డైలాగ్ సినిమాలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే ఓ మంచి ప్రేమకథతో నిండిన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది.