యోగి సర్కార్‌పై వరుణ్‌గాంధీ ఫైర్..

ABN , First Publish Date - 2021-12-28T02:18:12+05:30 IST

బీజేపీ పాలిత ప్రభుత్వాలపై తరచు విమర్శలు గుప్పిస్తున్న ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సోమవారంనాడు కూడా వాటిని..

యోగి సర్కార్‌పై వరుణ్‌గాంధీ ఫైర్..

న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ప్రభుత్వాలపై తరచు విమర్శలు గుప్పిస్తున్న ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సోమవారంనాడు కూడా వాటిని కొనసాగించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న కారణంగా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తూ, పగటి పూట ర్యాలీలను కట్టడి చేయకపోవడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మొదట తమ ప్రాథమ్యాలు ఏమిటో గుర్తించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూను విధిస్తున్నట్టు యూపీ సర్కార్ గత శనివారం ప్రకటించడంపై వరుణ్ గాంధీ తాజాగా ఒక ట్వీట్‌లో స్పందించారు.


''రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. పగటి పూట లక్షలాది మంది ప్రజలను ర్యాలీల పేరుతో పిలుస్తున్నారు. ఇక సాధారణ ప్రజానీకం భయాందోళనలకు విలువ ఎక్కడుంది?'' అని వరుణ్‌గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని పరిమితమైన హెల్త్ కేర్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఒమైక్రాన్ వ్యాప్తి జరక్కుండా చూడటానికి ప్రాధాన్యం ఇద్దామా, ఎన్నికల సత్తా చూపడానికే పరిమితమవుదామా అనేది ప్రజలే నిజాయితీగా నిర్ణయించుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తి పరంగా చూసినప్పుడు రాత్రి పూట జనాలు పెద్దగా రోడ్లపై ఉండని సమయాల్లో కర్ఫ్యూల (నైట్ కర్ఫ్యూ) వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా పగటి వేళల్లోనే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-28T02:18:12+05:30 IST