సాగుజోరు

ABN , First Publish Date - 2020-08-11T08:47:06+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో జోరుగా పంటలు సాగవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ వానాకాలం సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.

సాగుజోరు

 లక్ష్యానికి మించి పంటల సాగు 

 సకాలంలో కరుణించిన వరుణుడు 

 ఉత్సాహంగా పంటలు సాగు చేసిన రైతులు 

 మొక్కజొన్నపై తగ్గని మమకారం 


 వికారాబాద్‌ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం : 4,25,399.32 ఎకరాలు


 అంచనా సాగు విస్తీర్ణం : 4,76,283.00 ఎకరాలు


 సాగైన పంటల విస్తీర్ణం : 5,50,106.21 ఎకరాలు


వికారాబాద్‌ జిల్లాలో జోరుగా పంటలు సాగవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ వానాకాలం సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాధారణ అంచనా  కంటే అదనంగా సాగు చేశారు. సమయానుకూలంగా వర్షాలు కురవడంతో ఉత్సాహంగా పంటలు వేశారు. ఎప్పటిలాగే వరి, పత్తి పంటలను మిగతావాటి కంటే ఎక్కువగా సాగు చేశారు.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) :  వికారాబాద్‌ జిల్లాలో లక్ష్యం మించి ప్రధాన పంటలు సాగవుతున్నాయి. సమయానుకూలంగా కురుస్తున్న వర్షాలతో పంటల సాగు పెరుగుతోంది. వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జూన్‌ నెలలో చాలావరకు రైతులు పంటలు సాగు చేసుకోగా, జూలై నెలలో మిగిలిన రైతులు పంటలు వేశారు. జూన్‌లో 76 శాతం మేర పంటలు సాగు చేయగా, జూలైలో అంచనాకు మించి పంటలు సాగు చేయడం విశేషం.

 

జిల్లాలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 4,25,399.32 ఎకరాలు ఉండగా, ఈసారి 4,76,283 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే అధికారుల అంచనాలను అధిగమించి రైతులు పంటలు సాగు చేశారు. అంచనా సాగు విస్తీర్ణం కంటే 73,823 ఎకరాలు రైతులు ఎక్కువ సాగు చేశారు. పత్తి, వరి, పెసర, మినుము, సోయా తదితర పంటలు సాగు చేయగా, కంది పంట దాదాపు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో పత్తి అంచనా సాగు విస్తీర్ణం 2,13,192 ఎకరాలు ఉండగా రైతులు 2,53,017.32 ఎకరాల్లో సాగు చేశారు.


వరి 30వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా, రైతులు ఏకంగా 68,297.33 ఎకరాల్లో సాగు చేయడం విశేషం. కంది పంట 1,75,900 ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, 1,70,627.26 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంట అంచనా సాగుకు 5వేల ఎకరాలు మాత్రమే తక్కువ సాగైంది. పెసర పంట అంచనా సాగు లక్ష్యం 20,800 ఎకరాలు ఉండగా,  22,733.30 ఎకరాల్లో సాగు చేశారు. మినుము పంట 9,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా, 10,252 ఎకరాల్లో సాగైంది. సోయా పంట 2,047 ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, 2061.03 ఎకరాల్లో సాగు చేశారు.


రాగి పంట 217 ఎకరాల్లో సాగు చేయవచ్చని భావించగా, అంచనాను మించి 353.12 ఎకరాల్లో సాగు చేశారు. ఇదిలా ఉంటే, ఈ వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినా రైతులకు మొక్కజొన్న పంటపై ఆసక్తి తగ్గలేదు. మొక్కజొన్న పంటను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయబోమని చెప్పినా జిల్లాలో 4,762 మంది రైతులు 7,525 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి ఆ పంట పట్ల తమ మమకారం చాటుకున్నారు. 


అంచనా కంటే తక్కువ విస్తీర్ణం

ఎప్పటి మాదిరిగానే రైతులు జొన్న, నూనె గింజల పంటలను అంచనా సాగు కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జొన్న పంట 15 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా, రైతులు 8,821.03 ఎకరాల్లోనే సాగు చేశారు. ఆముదం 761 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, 93 ఎకరాల్లోనే సాగు చేశారు. 6,508 ఎకరాల్లో చెరుకు సాగు చేయవచ్చని అంచనా వేయగా, 3,093.29 ఎకరాల్లో వేశారు.


వేరుశనగ 1300 ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోగా, 606.11 ఎకరాల్లో సాగు చేశారు. మంచి నువ్వులు 335.36 ఎకరాలు, ఉలవలు 71.35ఎకరాల్లో సాగు చేయగా, కొర్రలు 111.01ఎకరాల్లో సాగుచేశారు. గోధుమ 12.11 ఎకరాలు, స్వీట్‌కార్న్‌ 225.51 ఎకరాలు, ఎర్ర జొన్న 78.14 ఎకరాలు,  పొద్దుతిరుగుడు 5.37 ఎకరాలు, కౌపియా 1434.14 ఎకరాలు, ఉలవలు 57.09 ఎకరాలు, గడ్డినువ్వులు 17.33 ఎకరాలు, కుసుమ 23.02 ఎకరాల్లో సాగు చేశారు. 


పెరిగిన సాగు విస్తీర్ణం

గతంతో పోలిస్తే ఈసారి జిల్లాలో వానాకాలం సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాధారణ అంచనా సాగు విస్తీర్ణం కంటే 15 శాతం అదనంగా సాగు చేశారు.

 

వానాకాలం అంచనా సాగు విస్తీర్ణం 4,76,283 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 5,50,106.21 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఒక్క పెద్దేముల్‌ మం డలం మినహా మిగతా అన్ని మండలాల్లో అంచనా సాగు విస్తీర్ణం కంటే ఎక్కువ సాగు చేశారు. బంట్వారం మండలం అంచనా సాగు విస్తీర్ణం 14,208 ఎకరాలు ఉండగా, 18,431.23 ఎకరాల్లో పంటలు సాగు చేసి లక్ష్యాన్ని అధిగమించారు. పూడూరు మండలంలో అంచనా సాగు 26,331 ఎకరాలు ఉండగా, 27,063.17 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.


కోట్‌పల్లి మండలంలో 16,731 ఎకరాలు అంచనా సాగు విస్తీర్ణం ఉండగా, 18,734.02 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మోమిన్‌పేట్‌ మండలంలో 22,598 ఎకరాలకు 26,145.04 ఎకరాలు సాగైంది. నవాబుపేట మండలంలో 21,399 ఎకరాలకు 25,107.39 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ధారూరు మండలంలో 20,015 ఎకరాలకు 24,269.25 ఎకరాలు, మర్పల్లి మండలంలో 29,433 ఎకరాలకు 30,932 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పెద్దేముల్‌ మండలంలో 35,312 ఎకరాల్లో 31,811.13 ఎకరాలు సాగు చేయగా, బొంరా్‌సపేట్‌ మండలంలో 30,045 ఎకరాలకు 38,758.16 ఎకరాల్లో సాగు చేశారు.కొడంగల్‌ మండలంలో 45,623 ఎకరాలు అంచనా సాగు  విస్తీర్ణం ఉండగా 46,597.01 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వికారాబాద్‌ మండలంలో 23,816 ఎకరాలకు 26,144.39 ఎకరాలు సాగు చేశారు.


దౌల్తాబాద్‌ మండలంలో 34,048 ఎకరాలకు 43,022.17 ఎకరాల్లో సాగైంది. బషీరాబాద్‌ మండలంలో 34,373 ఎకరాలకు 34,860.03 ఎకరాల్లో సాగు చేయగా, కులకచర్ల మండలంలో  14,626 ఎకరాలకు 23,849.13 ఎకరాల్లో సాగు చేశారు. యాలాల్‌ మండలంలో 29,668 ఎకరాలకు 31,005.20 ఎకరాల్లో సాగు చేయగా, పరిగి మండలంలో 33,206 ఎకరాలకు 35,249.02 ఎకరాలు సాగు చేశారు. తాండూరు మండలంలో 31,510 ఎకరాలకు 42,066 ఎకరాల్లో సాగు చేయగా, దోమ మండలంలో 13,341 ఎకరాలకు 26,058.15 ఎకరాలు సాగు చేశారు.

 

తాండూరులో.. 36.4 మి.మీ. వర్షం  

వికారాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి అత్యధికంగా తాండూరు మండలంలో 36.4 మి.మీ. వర్షం కురిసింది. పెద్దేముల్‌ మండలంలో 22.0 మి.మీ. వర్షం కురియగా, యాలాల్‌ మండలంలో 21.5 మి.మీ., కులకచర్ల మండలంలో 16.0 మి.మీ., మోమిన్‌పేట్‌ మండలంలో 15.8 మి.మీ., దోమ మండలంలో 14.0 మి.మీ., కొడంగల్‌ మండలంలో 12.4 మి.మీ., నవాబుపేట మండలంలో 10.6 మి.మీ. వర్షం కురిసింది.


వికారాబాద్‌ మండలంలో 10.4 మి.మీ., మర్పల్లి మండలంలో 8.8 మి.మీ., పూడూరు మండలంలో 8.2 మి.మీ., బంట్వారం మండలంలో 8.2 మి.మీ., దౌల్తాబాద్‌ మండలంలో 8.0 మి.మీ., బొంరాస్‌పేట్‌ మండలంలో 8.0 మి.మీ., ధారూరు మండలంలో 7.6 మి.మీ., బషీరాబాద్‌ మండలంలో 5.6 మి.మీ., పరిగి మండలంలో 3.6 మి.మీ. వర్షం కురిసింది. సోమవారం జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. 

Updated Date - 2020-08-11T08:47:06+05:30 IST