వసంత్‌ మతిస్థిమితం కోల్పోయారు

ABN , First Publish Date - 2020-02-14T10:05:45+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. డాక్టర్‌ వసంత్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, వైద్యవృత్తికే ఆయన

వసంత్‌ మతిస్థిమితం కోల్పోయారు

గాంధీలో ఎలాంటి అక్రమాలూ జరగలేదు

వసంత్‌పై కేసెందుకు పెట్టలేదో అర్థం కాలేదు 

అసోసియేషన్‌ పేరిట అక్రమాలకు పాల్పడ్డారు

వృత్తికే చెడ్డపేరు తెచ్చారు.. మళ్లీ చేర్చుకోలేం

రోగులకు మాదీ భరోసా: సూపరింటెండెంట్‌ 

అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. డాక్టర్‌ వసంత్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, వైద్యవృత్తికే ఆయన చెడ్డపేరు తీసుకొచ్చారని అన్నారు. ఆయనకు సైకియాట్రి్‌స్టతో చికిత్స అవసరమన్నారు. గాంధీలో హౌస్‌ సర్జన్లు, శానిటేషన్‌, సెక్యూరిటీ విభాగంలో అక్రమాలు జరిగాయంటూ డాక్టర్‌ వసంత్‌ ఆరోపించిన నేపథ్యంలో సూపరింటెండెంట్‌ గురువారం హెచ్‌వోడీలతో సమావేశమయ్యారు. వసంత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ వసంత్‌ అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వైద్యులపై ఆరోపణలు చేసిన వ్యక్తే దొంగ అని తేలిపోయిందని, ఆడియో, వీడియోల ద్వారా బయటపెట్టామని తెలిపారు. కరోనా వైర్‌సపై ఆస్పత్రిలో తన చాంబర్‌లో చర్చిస్తున్న సమయంలో డాక్టర్‌ వసంత్‌ ఇష్టం వచ్చినట్లుగా వైద్యులను దూషించారని, దానిని ప్రశ్నించినందుకు తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలిపారు.


ఇలాంటి వ్యక్తిని మళ్లీ విధుల్లోకి తీసుకోలేమని, తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉందని అన్నారు. ఆస్పత్రిలో 1100 మంచాల సామర్థ్యం ఉండగా 2200 మంది రోగులు ఆస్పత్రిలో అడ్మిట్‌ అవుతున్నారని, ఇంత మందికి వైద్యసేవలు అందించేందుకు వైద్యులు 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపారు. సర్కారు ఆస్పత్రిగా పేరున్న గాంధీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి ప్రోత్సాహంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వైద్యుడిపై కేసు ఎందుకు పెట్టలేదో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. కాగా ఆస్పత్రిలో ఉన్న మూడు మెడికల్‌ షాపుల నుంచి ఏడాదికి రూ.లక్షల్లో మామూళ్లు కావాలని డాక్టర్‌ వసంత్‌ బెదిరించారని, తాము ఇవ్వలేమని చెప్పడంతో తమపై కక్ష కట్టారని మెడికల్‌ షాపు యజమాని మోహిత్‌ ఆరోపించారు. ఆస్పత్రిలో శానిటేషన్‌బాగాలేదంటూ బెదిరించేవారని ఏజిల్‌ ఔట్‌సోర్స్‌ ఇన్‌చార్జి సాయి, క్యాంటీన్‌నుంచీ ప్రతి నెలా డబ్బు ఇవ్వాలని బెదిరించేవారని క్యాంటీన్‌ యజమాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.


హౌస్‌ సర్జన్ల ఫోర్జరీ 2018 బ్యాచ్‌ సమయంలో..

గాంధీ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ హౌస్‌సర్జన్ల ఫోర్జరీలు జరిగింది ఇప్పుడు కాదని, 2018 బ్యాచ్‌ సమయంలోనని ఈ అంశంపై నియామకమైన త్రిసభ్య కమిటీ సభ్యులు డాక్టర్‌ రాజారావు, డాక్టర్‌ విమలా థామస్‌, డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఫోర్జరీలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఈ కమిటీని వేసిందని, అప్పటినుంచి అన్నీ పరిశీలించిన తర్వాతే ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు ఇతర ప్రొఫెసర్లతోపాటు అన్ని విభాగాలకు బయోమెట్రిక్‌ విధానం నడుస్తోందన్నారు.

Updated Date - 2020-02-14T10:05:45+05:30 IST