వసూల్‌ రాజా!

ABN , First Publish Date - 2021-06-21T05:56:47+05:30 IST

ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరుతారు.

వసూల్‌ రాజా!

  1. ఆ స్టేషన్‌కు వెళితే జేబులు ఖాళీ 
  2. ప్రతి పనికీ రేటు కడుతున్న ఎస్‌ఐ
  3. అడిగింది ఇవ్వకపోతే అక్రమ కేసులు 
  4. డబ్బులు ఇస్తేనే.. స్టేషన్‌ బెయిల్‌


ఆత్మకూరు, జూన్‌ 20: ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరుతారు. కానీ అక్కడ స్టేషన్‌కు వెళితే ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. ఇందుకు కారణం ఆ స్టేషన్‌ ఎస్‌ఐ. ఆయన వసూళ్ల వ్యవహారం జిల్లా అధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. మండలంలోని ప్రతి గ్రామంలో ఆ ఎస్‌ఐ కోటరీని తయారు చేసుకున్నాడు. నేరుగా డబ్బును తీసుకోకుండా మధ్యవర్తులు, తన బంధువుల ఖాతాల్లో జమ చేయిస్తాడని సమాచారం. పేకాట, మద్యం కేసులు వచ్చాయంటే పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. కేసును తీవ్రంగా చూపించి నిందితులను భయపెడతాడు. చివర్లో ఓ రేట్‌ నిర్ణయించి వసూలు చేస్తాడు. స్టేషన్‌ బెయిల్‌ వచ్చిందంటే ఆయనకు పండుగే. రూ.లక్షలు డిమాండ్‌ చేసి.. వేలల్లో గుంజుతాడు. ఈ వ్యవహారాల గురించి ఓ అధికారి జిల్లా అధికారులకు తెలియజేసినా చర్యలు లేవని సమాచారం. 


ఆయన దందాల్లో కొన్ని..

తన పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్లు ప్రేమించుకుని ఊరు విడిచి వెళ్లిపోయి తిరిగి వచ్చారు. ఈ కేసులో బాలుడి కుటుంబీకుల నుంచి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. ఈ విషయం తెలిసిన ఓ అధికారి.. బాధితులను పిలిపించి విచారించారు. ఆ తరువాత ఎస్‌ఐని మందలించినట్లు సమాచారం. 


తెలంగాణ మద్యం కేసులో పట్టుడిన ఓ నిందితుడి మొబైల్‌ ఫోన్‌ పరిశీలించాడు. నిందితుడికి ఫోన్‌ పే ద్వారా రూ.4 వేలు పంపించాడన్న కారణంగా కేసులో ఇరికిస్తానని భయపెట్టి కొంత మొత్తం వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. 


సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌ కర్ఫ్యూ సమయంలో ఓ గ్రామంలో అర్ధరాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌ నిర్వహించేందుకు అనుమతించాడు. ఇందుకు సంబంధించి కొంతమొత్తం ఆయన వసూలు చేశాడని తెలుసుకున్న ఓ అధికారి.. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎస్‌ఐపై వేటు పడాల్సి ఉన్నా ఓ అధికారపార్టీ నాయకుడి ఆశీస్సులతో బయటపడ్డాడని తెలిసింది. 


ఓ గ్రామానికి చెందిన దళితులు ఓ వివాదంపై స్టేషన్‌కు వెళ్లగా, అవతలి వ్యక్తులపై బలవంతంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ఈ కేసులో బాధితుల నుంచే వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాధితులను విచారించిన ఓ అధికారి.. అది తప్పుడు కేసు అని గుర్తించినట్లు సమాచారం. ఎస్‌ఐ ప్రోత్సాహంతోనే తాము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టామని బాధితులు ఆ అధికారికి వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం కూడా జిల్లా అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. 


గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఓ గ్రామంలో ఆ ఎస్‌ఐ పర్యటించినప్పుడు కొందరు మద్యం తాగుతూ కనిపించారు. వారి వద్ద ఒక తెలంగాణ క్వార్టర్‌ దొరికింది. వారి నుంచి కొంత మొత్తం తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నిబంధనల ప్రకారం మూడు సీసాల వరకూ తెలంగాణ మద్యానికి అనుమతి ఉంది. 


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాయకుల నుంచి అందినకాడికి దండుకున్నట్లు సమాచారం. 


ఎస్‌ఐ ఆగడాలను సహించలేని ఓ దళిత హక్కుల నేత ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 


ఇటీవల ఓ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్‌ వరకూ వెళ్లింది. ఓ వర్గంపై ఎస్‌ఐ చిన్నపాటి కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే అవకాశం ఉన్నా, ఆరు రోజుల పాటు నిందితులను స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంచి ఇబ్బంది పెట్టాడని, చివరకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు కూడా వసూలు చేశాడని తెలిసింది. 


మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామంలో ఎక్సైజ్‌, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్‌ శాఖవారు నిందితుడిని, పట్టుబడిన మద్యాన్ని, బైక్‌ని పోలీసులకే అప్పగించారు. కానీ ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా మూడునెలలు జాప్యం చేశాడని, నిందితుడి నుంచి డబ్బు వసూలు చేశాడని తెలిసింది. ఈ వ్యవహారం కూడా పై అధికారి దృష్టికి వెళ్లినట్లు సమాచారం.


చర్యలు తీసుకుంటాం..


డివిజన్‌ పరిధిలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. పోలీసులు అక్రమ కేసులు బనాయించినా, వేధించినా, లంచాలు డిమాండ్‌ చేసినా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. 

 - శృతి, ఆత్మకూరు డీఎస్పీ 

Updated Date - 2021-06-21T05:56:47+05:30 IST