ఓటీఎస్‌పై ఉన్నతాధికారుల విస్తృత తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-18T03:53:14+05:30 IST

కలెక్టర్‌ ఆదేశాలతో ఓటీఎస్‌ మెగా డ్రైవ్‌లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వి. సాంబశివారెడ్డి, ఆసరా జాయింట్‌ కలెక్టర్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కే. రోజ్‌మాండ్‌ సోమవారం మండలంలోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఓటీఎస్‌పై ఉన్నతాధికారుల విస్తృత తనిఖీలు
మనుబోలులో ఓటీఎస్‌ నమోదును పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి జేసీ రోజ్‌మాండ్‌

మనుబోలు, జనవరి 17: కలెక్టర్‌ ఆదేశాలతో ఓటీఎస్‌ మెగా డ్రైవ్‌లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వి. సాంబశివారెడ్డి, ఆసరా జాయింట్‌ కలెక్టర్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కే. రోజ్‌మాండ్‌ సోమవారం మండలంలోని పలు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మనుబోలు సచివాలయాన్ని  డీఆర్‌డీఏ పీడీ  తనిఖీ చేసి అంతర్జాలంలో ఓటీఎస్‌ నమోదు, రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణం తీసుకున్న రుణం, వడ్డీని కలిపి ప్రభుత్వం ఓటీఎస్‌ ద్వారా మాఫీ చేస్తుందన్నారు. ఉచితంగా పేదవాడి ఆస్తికి రిజిస్ట్రేషన్లు చేయిస్తుందన్నారు. ఆ రిజిస్ట్రేషన్ల పత్రాలపై బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చునన్నారు. పొదుపు సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరిం చాలన్నారు. బ్యాంకులు ఇబ్బందులు పెడితే పొదుపుఖాతాలను మరో బ్యాంకులకు మార్చివేయాలన్నారు. రుణాలకు సహకరించిన బ్యాంకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు. మండలంలో ఓటీఎస్‌ లబ్దిదారులు 3,420మంది ఉన్నారన్నారు.  రూ.10 వేలు 1150మందిలో ఇప్పటివరకు 800మందికి రిజిస్ట్రేషన్లు సిద్ధం చేశామన్నారు. డబ్బులు చెల్లించిన వారికి జాప్యం చేయకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసరా జేసీ రోజ్‌మాండ్‌ మనుబోలు, చెర్లోపల్లి, మడమనూరు, అక్కంపేట, వీరంపల్లి సచివాలయాలను సందర్శించి ఓటీఎస్‌ ప్రగతి తెలుసుకుని అవగాహన కల్పించారు. అలాగే వెంకన్నపాళెం, బద్దెవోలు, కట్టువపల్లి సచివాలయాలను మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారి ప్రదీప్‌కుమార్‌ తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ డీవో జి. వెంకటేశ్వర్లు, ఏపిఎం శైలజ, సీసీలు పాల్గొన్నారు.

వెంకటాచలం : గ్రామ వలంటీర్లు, వీవోఏలు సమన్వయంతో పని చేసి ఓటీఎస్‌ను విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ( ఆసరా ), హౌసింగ్‌ ప్రత్యేకాధికారిణి రోజ్‌మాండ్‌ సూచించారు. మండలంలోని తిక్కవరప్పాడు గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ పథకం గురించి అర్థమయ్యేలా వివరించాలన్నారు. నగదు చెల్లించలేని లబ్ధిదారులు పొదుపు ద్వారా రుణాలు పొంది నగదు చెల్లించే అవకాశం గురించి తెలిపాలన్నారు. నగదు చెల్లించిన లబ్ధిదారుల వివరాలను ఎప్పటి కప్పుడు అన్‌లైన్‌లో నమోదు చేయాలని  ఆమె వెంట గ్రామ కార్య దర్శి ప్రసాద్‌, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదిత రులున్నారు. 

ముత్తుకూరు : ఓటీఎస్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ సోమయ్య  తెలిపారు. ముత్తుకూరు సచివాలయంలో సోమవారం ఆయన అధికారులు, వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లబ్ధిదారులు ఓటీఎస్‌ కట్టేందుకు ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని వెలుగు సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంపీడీవో ప్రత్యూషతో కలసి పిడతాపోలూరులో ఓటీఎస్‌పై అవగాహన కల్పించారు. హౌసింగ్‌ ప్రత్యేకాధికారి లక్ష్మణ్‌కుమార్‌ చొరవతో పిడతాపోలూరు పరిధిలో సోమవారం ఒక్కరోజే 27 మంది లబ్దిదారులచే ఓటీఎస్‌ కట్టించారు. కార్యక్రమంలో పొదుపు ఏపీఎం విజయలక్ష్మి, సీసీ సునీత, పంచాయతీ కార్యదర్శి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T03:53:14+05:30 IST