Chennai: గండం గడిచింది

ABN , First Publish Date - 2021-11-20T13:56:33+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నగరానికి పుదుచ్చేరికి మధ్య శుక్రవారం వేకువ జామున నాలుగు గంటలకు తీరం దాటింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో వర్షబీభత్సాన్ని సృష్టిస్తుందని

Chennai: గండం గడిచింది

- తీరం దాటిన వాయుగుండం 

- ఊరట చెందిన నగర వాసులు

- జలదిగ్బంధంలో పుదుచ్చేరి


చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నగరానికి పుదుచ్చేరికి మధ్య శుక్రవారం వేకువ జామున నాలుగు గంటలకు తీరం దాటింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో వర్షబీభత్సాన్ని సృష్టిస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారుల అంచనాలను భిన్నంగా ఈ వాయుగుండం అదృష్టవ శాత్తు తేలిగ్గా తేలిపోయింది. అక్కడక్కడా ఓ మోస్తరుగా వర్షం కురవటంతో నాలుగు జిల్లాల ప్రజలు ఊరట చెందారు. ప్రస్తుతం ఈశాన్యరుతుపవ నాలు తీవ్రరూపం దాల్చటం, తీరం దాటి బలహీనపడిన వాయుగుండం ప్రభావం వల్ల మరికొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ తెలిపారు. వాయుగుండం వర్షబీభత్సం సృష్టించకుండా నెమ్మదిగా తీరం దాటి బలహీనపడిందని, ఊహించినట్లు భారీ వర్షాలు కురవలేదన్నారు. తీరం వైపు వాయుగుండం వేగం తగ్గుముఖం పట్టడంతో 12 జిల్లాలకు జారీ చేసిన ‘రెడ్‌ అలెర్ట్‌’ను సైతం గురువారం రాత్రి ఉపసంహరించు కున్నట్లు తెలిపారు. అయితే ఈ వాయుగుండం పుదుచ్చేరిని వర్షాలతో ముంచెత్తిందని తెలిపారు. ఈరోడ్‌, సేలం, వేలూరు, తిరువణ్ణామలై, రాణిపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయని వివరించారు. చెన్నైలో గురువారం రాత్రి అరగంటసేపు పెనుగాలులతో వర్షం కురిసిందని, ఆ తర్వాత శుక్రవారం వేకువజాము వరకూ చిరుజల్లులు మాత్రమే పడ్డాయన్నారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పలు చోట్ల భారీగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయని చెప్పారు.


చెన్నైలో... : నగరంలో శుక్రవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకూ అక్కడ క్కడా ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం రాత్రి అరగంటపాటు కురిసిన భారీ వర్షానికి రాయపురం, వాషర్‌మెన్‌పేట, పెరంబూరు, మధురవాయల్‌, అడయార్‌, మైలాపూరు, ట్రిప్లికేన్‌, పూందమల్లి, టి.నగర్‌, కోడంబాక్కం, వడపళని, పోరూరు, అయ్యప్పన్‌తాంగాల్‌, రామాపురం, ఆళ్వార్‌పేట, తిరువేర్కాడు, కోయంబేడు, అమింజిగరై, చూళేమేడు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేళచ్చేరి, కొట్టూరుపురం, పెరంబూరు తదితర ప్రాంతాల్లోని జననివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో జలాశయాలు, చెరువులు, వాగులు వాననీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.


నీటమునిగిన రహదారి వంతెన... : తిరువళ్లూరు సమీపంలో కుశస్థలివాగులో వర్షపునీరంతా వరదలా ప్రవహిస్తుండటంతో నారాయణపురం వద్దనున్న రోడ్డు వంతెన నీట ముని గింది. దీంతో చెన్నై, పూందమల్లి, తిరువళ్లూరు ప్రాంతాల నుంచి కనకమ్మసత్రం, తిరుత్తణి, నగరి, పుత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నారు. ఇదే విధంగా కేశవరం ఆనకట్ట నుంచి అదనపు జలాలు ప్రవహించడంతో పట్టరై పెరుమందూరు రోడ్డు వంతెన కూడా నీట మునగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.


61 శాతం అధికవర్షపాతం.... : ఈ యేడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సాధారణ స్థాయి కంటే 61 శాతం అధికంగా కురిశాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్టోబరు 25 ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించాయి. కొద్ది రోజులకే రుతుపవనాలు తీవ్రరూపం దాల్చటంతో ఈ నెల మొదటివారం చెన్నై పరిసర జిల్లాల్లో వర్షబీభత్సాన్ని సృష్టించింది. అక్టోబరు ఒకటి నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలించగా సాధారణ స్థాయికి మించి 61 శాతం అధికంగా  వర్షాలు కురిసాయని పేర్కొన్నారు.


పుదువైలో కుండపోత... : ఈశాన్యరుతుపవనాలు, వాయుగుండం కారణంగా పుదుచ్చేరిలో కుండ పోతగా వర్షాలు కురవటంతో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. దీంతో ఆ రాష్ట్రంలో జలాశయాలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. వర్షాలకు పావానర్‌ నగర్‌, రెయిన్‌బో నగర్‌, ఎళిల్‌ నగర్‌, వెంకటానగర్‌, కృష్ణానగర్‌లోని జననివాస ప్రాంతాలన్నీ వాననీటిలో ముని గాయి. ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు, బుస్సీ వీధి, ఇందిరాగాంధీ విగ్రహం కూడలి, రాజీవ్‌గాంధీ విగ్రహం కూడలి, మరైమలర్‌ అడిగళ్‌ రోడ్డు, పుదుచ్చేరి - కడలూరు రహదారి తదితర ప్రధాన రహదారుల్లో రెండడుగుల మేర వర్షపునీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ 62 గుడిసెలు, 27 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. మలట్టారు వరదల్లో చిక్కుకుని ఓ యువకుడు మృతిచెందారు.


కడలూరు జిల్లాలో... : కడలూరు జిల్లాల్లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాం తాలన్నీ జలమయమయ్యాయి. రహదారులలో వరద దృశ్యాలు నెలకొన్నాయి. కడలూరు, బన్రూట్ట్టి, నైవేలి, విరుదాచలం, చిదంబరం తదితర నగరాలలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వేకువజాము వరకూ భారీగా వర్షాలు కురిశాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్నవారిని అగ్ని మాపక దళం సభ్యులు, విపత్తుల నివారణ బృందం సభ్యులు, పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వర్షాలకు జిల్లాలోని జలాశయాలలో నీటిమట్టం పూర్తి స్థాయిని దాటడంతో అదనపు జలాలను విడుదల చేస్తున్నారు.



Updated Date - 2021-11-20T13:56:33+05:30 IST