కోవిడ్-19 వ్యాప్తిపై సీఎస్ఐఆర్ పదర్శన తిలకించిన ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-03-30T21:28:09+05:30 IST

మురుగు నీటి నిఘా.. కోవిడ్ సోకిన వారి సంఖ్య యొక్క గుణాత్మక, పరిమాణాత్మక అంచనాను అందిస్తుందని, అలాగే వ్యక్తుల భారీ స్థాయిలో పరీక్షలు సాధ్యం కానప్పటికీ, కోవిడ్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని

కోవిడ్-19 వ్యాప్తిపై సీఎస్ఐఆర్ పదర్శన తిలకించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తిని తెలుసుకునేందుకు భారత పార్లమెంట్‌లో సీఎస్ఐఆర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మురుగునీటి, వాయు నిఘా వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ రోజు హైదరాబాద్‌లో తిలకించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) డైరక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఈ అంశాలను వివరించారు. ఇందులో భాగంగా సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు చేపట్టిన వివిధ కార్యకలాపాల గురించి ఉపరాష్ట్రపతికి డాక్టర్ మాండే వివరించారు.


మురుగు నీటి నిఘా.. కోవిడ్ సోకిన వారి సంఖ్య యొక్క గుణాత్మక, పరిమాణాత్మక అంచనాను అందిస్తుందని, అలాగే వ్యక్తుల భారీ స్థాయిలో పరీక్షలు సాధ్యం కానప్పటికీ, కోవిడ్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతికి సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ వివరించారు. సమాజంలో వివిధ ప్రదేశాల్లో వ్యాధి యొక్క ప్రాబల్యాన్ని సరైన సమయంలో సమగ్రంగా పర్యవేక్షించేందుకు ఇది ఓ కొలమానంగా ఉపయోగపడుతుందని అన్నారు. అదే విధంగా రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులతో పాటు, రోగ లక్షణాలు లేని వ్యక్తుల విసర్జితాల్లో వైరస్ ఉంటే తెలుసుకునే అవకాశం ఉందని, దీని ద్వారా వైరస్ గురించి సంపూర్ణ అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందని వెంకయ్యకి తెలియజేశారు.


హైదరాబాద్, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, నాగపూర్, పుదుచ్చేరి, చెన్నైలలో వైరస్ సంక్రమణ ధోరణి గురించి తెలుసుకునేందుకు చేపట్టిన మురుగు నీటి నిఘా వివరాలను తెలియజేసిన డైరక్టర్ జనరల్, ఇది ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్యను అంచనా వేస్తుందని, అదే సమయంలో పరీక్షలు చేయించుకునే పద్ధతిలో పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య మీద, వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆధారపడి ఉంటుందని తెలిపారు. కోవిడ్-19 మురుగు నీటి నిఘా ద్వారా వ్యాధి యొక్క ప్రస్తుత ఎపిడెమియాలజీని అర్థం చేసుకోవడమే గాక, భవిష్యత్తులో కోవిడ్ -19 వ్యాప్తిని త్వరగా మరియు సులభంగా గుర్తించేందుకు ఒక ఉపయోగకరమైన సాధనంగా పని చేస్తుందని డాక్టర్ మాండే తెలిపారు.


వైరల్ కణాలు, వ్యాప్తి ముప్పును పర్యవేక్షించడానికి గాలి నమూనా వ్యవస్థ ఏర్పాటు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎస్ఐఆర్ దేశంలో వివిధ రంగాల్లో చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాలను డా. మండే బృందం సవివరంగా ఉపరాష్ట్రపతికి తెలిపారు. సీఎస్ఐఆర్ చేస్తున్న కృషిని, పరిశోధనలను ఉపరాష్ట్రపతి అభినందించారు. శాస్త్రవేత్తల కృషిని ప్రత్యేకంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయం గురించి చర్చించనున్నట్లు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-30T21:28:09+05:30 IST