రామకృష్ణ మఠ్ ‘వేద వ్యవసాయం’ వెబినార్ విజయవంతం

ABN , First Publish Date - 2020-10-19T22:14:32+05:30 IST

రామకృష్ణ మఠ్‌కు చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నిర్వహించిన వెబినార్ విజయవంతం అయ్యింది.

రామకృష్ణ మఠ్ ‘వేద వ్యవసాయం’ వెబినార్ విజయవంతం

హైదరాబాద్: ‘వేద వ్యవసాయం - భారతదేశ పునరుజ్జీవం’ అనే అంశంపై నగరంలోని రామకృష్ణ మఠ్‌కు చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నిర్వహించిన వెబినార్ విజయవంతం అయ్యింది. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ‘కృషి భారతం’ ఫౌండర్ కౌటిల్య కృష్ణన్,  ఆర్గానిక్ వ్యవసాయంపై పరిశోధకులు బాలాజీ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


కౌటిల్య కృష్ణన్ మాట్లాడుతూ.. పరాశర మహర్షి రాసిన ‘కృషి పరాశరం’, ‘వృక్షాయుర్వేదం’ తదితర గ్రంథాల్లో  వ్యవసాయం గురించి సమగ్రంగా వివరించారన్నారు. ఎప్పుడు విత్తనాలు నాటాలి... ఏ ఏ జంతువులను వ్యవసాయానికి ఉపయోగించాలన్న అంశాలను ప్రస్తావించారన్నారు. మొక్కల భౌతిక, అంతరనిర్మాణాలను గురించి కూడా తెలియజేశారన్నారు. మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం గురించి కూడా రాశారన్నారు. అలాగే ‘భోజన కుతూహల’ అనే గ్రంథంలో ఆహారపు అలవాట్లను, వ్యవసాయ పద్ధతులను ‘శతపథ బ్రాహ్మణ’ తెలియజేశారన్నారు. మొక్కలు సంగీతాన్ని, ప్రశాంత వాతావరణాన్ని, ప్రేమను ఆస్వాదిస్తాయని కౌటిల్య కృష్ణన్ పేర్కొన్నారు. రామాయణ, మహాభారతాల్లోనూ వ్యవసాయ పద్ధతులను గురించి తెలిపాయన్నారు. యువత వేద సాహిత్యాన్ని చదవాలని, గుడ్డిగా పాశ్చాత్య సంస్కృతి పట్ల వ్యామోహితులు కారాదని సూచించారు. భారతీయ గ్రామాల గురించి యువత ఆలోచించాలన్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం గురించి బాలాజీ సుకుమార్ మాట్లాడారు.

ఇదిలా ఉంటే శారదా మాత ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే వీఐహెచ్ఈ వాలంటీర్లు తమ పాటలు, సంగీతంతో ఆకట్టుకున్నారు.  

Updated Date - 2020-10-19T22:14:32+05:30 IST