వేడుక వద్దనడం చరిత్రను కాదనడమే!

ABN , First Publish Date - 2021-09-16T06:22:11+05:30 IST

భారతీయులు 1947 ఆగస్టు 15న జాతీయ జెండాలను ఆవిష్కరించుకొంటూ, వందల సంవత్సరాల బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందామని స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటూ, సంబరాలు జరుపుకొంటున్న సమయంలో...

వేడుక వద్దనడం చరిత్రను కాదనడమే!

భారతీయులు 1947 ఆగస్టు 15న జాతీయ జెండాలను ఆవిష్కరించుకొంటూ, వందల సంవత్సరాల బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందామని స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటూ, సంబరాలు జరుపుకొంటున్న సమయంలో దేశం నడిబొడ్డున ఉన్న, హైదరాబాద్‌ రాజ్యంగా పేర్కొనే ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయారు. నాటి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్ భాయ్‌ పటేల్‌ చొరవతో దేశంలో 500కు పైగా సంస్థానాలు భారత్‌లో విలీనమైనప్పటికీ, నిజాం నవాబు ససేమిరా అంటూ భీష్మించుకూర్చున్నాడు. ఒక వంక పాకిస్థాన్‌లో విలీనం చేస్తాను అని బెదిరిస్తూ వచ్చాడు. మరోవంక కామన్‌వెల్త్‌లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని ఒక ఇస్లామిక్‌ దేశంగా కొనసాగించేందుకు నిజాం ప్రయత్నించారు. 


ఆ ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరవేసిన వరంగల్‌ జిల్లాకు చెందిన మొగులయ్య అనే దేశభక్తుడిని తుపాకీతో కాల్చి చంపడం ద్వారా ఎవరైనా జాతీయ జెండా పట్టుకున్నా, స్వతంత్రం అనే మాట పలికినా అదే గతి పడుతుందనే హెచ్చరికలు నిజాం పంపారు. భారత్‌లో విలీనం కావలసిందే అని పోరాడిన స్వాతంత్య్ర సమర యోధులను, తెలంగాణ ప్రజలను నిరంకుశంగా అణచివేసి, వారిని చిత్రహింసలకు గురిచేసి వందలాది పోరాట యోధులను పొట్టన పెట్టుకున్నాడు.


వందల సంవత్సరాల పోరాటం అనంతరం స్వాతం త్య్రం సాధించిన ‘భారతదేశం’ అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో భారత ప్రభుత్వం ఇప్పుడేమి చేయలేదని, పట్టుబడితే మనదే పైచేయి అవుతుందని రజాకార్లు చేస్తున్న వాదనలతో నిజాం ఏకీభవించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నిజాం ప్రభుత్వాన్ని రజాకార్లు తమ చెప్పుచేతలలోకి తీసుకుపోవడం ప్రారంభించారు. భారత్‌తో యుద్ధానికి సై అంటూ ప్రగల్భాలు పలికారు. 


ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు వంటి నేతలు నిజాం బెదిరింపుల పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్న సమయంలో దృఢ సంకల్పంతో హైదరాబాద్‌కు సేనలను పంపడం ద్వారా ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ ప్రదర్శించిన రాజనీతిజ్ఞత దేశం మధ్యలో మరో దేశం ఏర్పడకుండా పెను ప్రమాదాన్ని నివారించింది. 


‘ఈ దేశం అన్ని వ్యవస్థలతో సహా ఇక్కడ నివసించే ప్రజల సర్వోన్నత వారసత్వం. కొందరు సంస్థానాల్లో, కొందరు బ్రిటిష్‌ ఇండియాలో ఉండటం కేవలం యాదృచ్ఛికం. అందరూ ఒకే సంస్కృతిలో భాగం. మనమందరం మన ప్రయోజనాల వల్లనే గాక మన రక్తసంబంధం చేత, భావ సారూప్యత చేత అనుబంధితులం. మనలను ఎవ్వరూ ముక్కలుగా చేయలేరు’ అని సర్దార్‌ పటేల్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిజాం నవాబు కుతంత్రాలు, బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ 1948 సెప్టెంబర్‌ 13న జనరల్‌ జె ఎన్ చౌదరి నేతృత్వంలో భారత సేనలను నలువైపుల నుండి - ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో హైదరాబాద్ వైపునకు పంపారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన నిజాం నవాబు మూడు రోజులకే చేతులెత్తేశాడు. తుపాకులు కింద పడవేసి లొంగిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు. 


సరిగ్గా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబు నిరంకుశ పాలన నుంచి విమోచన పొంది తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. భారత దేశంలో విలీనమైనది. ఎన్నో దురాగతాలకు కారకుడైన నిజాం లొంగిపోయిన రోజును, ఆ తర్వాత మహారాష్ట్రలో, కర్ణాటకలో కలిసిన ప్రాంతాలలో ‘విమోచన దినం’గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి నుండి అధికారికంగా జరుపుతున్నాయి. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఆవిష్కరించి, విమోచన కోసం అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. 


తెలంగాణ ప్రాంతంలో మాత్రం అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తిరస్కరిస్తూ వచ్చాయి. నిజాం రాజకీయ వారసులుగా పాతబస్తీలో మకాం వేసిన మజ్లీస్‌ పార్టీకి భయపడి వెనుకడుగు వేశాయి. 


మలిదశ తెలంగాణ ఉద్యమకాలంలో, సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊరూ వాడా ఘోషించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కావొస్తుంది. మరి ఈ ఏడు సంవత్సరాల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే సోయే వారికి లేదు. మజ్లిస్‌ పార్టీ నేతలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి పాలక్ష పక్షం వారు ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా చేయడం లేదు. ఓట్ల రాజకీయాల కోసం దేశ సమైక్యతకు అసువులు బాసిన వీరులను అవమానపరిచే విధంగానే తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 


విమోచన దినం అనగానే కొందరు చేసిన విద్రోహం ప్రజలకు స్మరణకు వస్తుందనే భయంతో చరిత్రను జనం మరచిపోయేటట్లు చేయాలని మరి కొందరు తంటాలు పడుతున్నారు. నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణ విమోచన పొందడంలో ఎందరో ఎన్నో వీరోచిత పోరాటాలు జరిపారు. హైదరాబాద్‌ సంస్థానంలోని హిందువులు, ముస్లింలు మూకుమ్మడిగా నిజాం అకృత్యాలపై తిరగబడిన అద్వితీయమైన చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారు. 


ఎందరో యోధులు, రచయితలు, పాత్రికేయులు, కళాకారులు సహితం నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు తెలిపిన చరిత్ర ఉంది. అటువంటి చరిత్రను ఎందుకు మరుగున పడవేసే ప్రయత్నం చేస్తున్నారో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.


నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం హిందువులు - ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్న కొందరు సంకుచిత రాజకీయ నేతలు విమోచన దినం అంటే ముస్లింలకు వ్యతిరేకంగా జరపడంగా చిత్రీకరిస్తున్నారు. 17 సెప్టెంబర్‌- తెలంగాణ విమోచన దినం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పర్వదినమైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరం. అత్యంత ప్రాధాన్యత గల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రస్తుతం పరిపాలిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టించుకోకపోవడంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలు గాయపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కనీసం ఇప్పటికైనా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్‌ చేస్తోంది. 


భారతీయ జనతాపార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా సెప్టెంబర్‌ 17న అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. అనేక పోరాటాలు చేసింది. లాఠీ దెబ్బలు తిన్నది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ తెలంగాణ శాఖ పోరాటం చేస్తూనే ఉంటుంది.


అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా, తెలంగాణ విమోచన కోసం పోరాడిన వెయ్యి మందిని ఉరితీసిన నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి బీజేపీ తెలంగాణ శాఖ సమాయత్తమవుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 


తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ప్రధానమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ఉంచుతున్నాం. అవి: సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలి; తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి, కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయంతో దాని నిర్మాణం చేపట్టి, 2022 నాటికి పూర్తి చేయాలి; తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి; ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని సత్కరించాలి; తెలంగాణ విమోచన ఉద్యమం సందర్భంగా రజాకార్ల చేతిలో బలైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి; రజాకార్లను తరిమి కొట్టిన వీరబైరాన్‌పల్లి, వరంగల్‌ కోట, రేణికుంట, కడవెండి, కామారెడ్డిగూడెం, పర్కాల, సూర్యాపేట, బీబీ నగర్‌, బాలెంల - పెరుమాండ్ల సంకీస తదితర ప్రాంతాలలో అప్పటి ఉద్యమ ఘట్టాలను పరిరక్షించాలి. 


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17న వాడ వాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సకల జనులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 

బండి సంజయ్‌ కుమార్‌

అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ

Updated Date - 2021-09-16T06:22:11+05:30 IST