హంస వాహనంపై వీణాపాణి

ABN , First Publish Date - 2020-09-21T07:42:34+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం చిన్నశేష, రాత్రి హంస వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు.

హంస వాహనంపై వీణాపాణి

 ఉదయం చిన్నశేషుడిపై దర్శనం 


తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం చిన్నశేష, రాత్రి హంస వాహనాలపై శ్రీవారు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నిత్యపూజలు నిర్వహించిన తరువాత మలయప్పస్వామికి రంగనాయక మండపంలో విశేష అలంకరణ  చేశారు. 9 గంటలకు నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళీకృష్ణుడి అలంకారంలో మలయప్పను ఊరేగింపుగా తీసుకెళ్లి కల్యాణోత్సవ మండపంలో ఐదు తలల చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. వాహనసేవ పూర్తికాగానే ఉత్సవమూర్తిని తిరిగి ఊరేగింపుగా రంగనాయక మండపానికి తీసుకొచ్చారు.


 సాయంత్రం 7 గంటలకు సరస్వతీ దేవి రూపంలో వీణాపాణియైు హంసవాహనంపై మలయప్ప కటాక్షమిచ్చారు. కొవిడ్‌-19 నిబంధనలను అమలుచేస్తూ రెండు వాహనసేవలను ఆలయానికే పరిమితం చేసి ఏకాంతంగా నిర్వహించారు. కాగా, తిరుమల పుణ్యక్షేత్రంపై ఆదివారం ఓ విమానం దూసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ఆగమ నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ విమానం(గోపురం)పై విమానాలు తిరగడం నిషేధం. గర్భాలయం మీదుగా కాకపోయినప్పటికీ క్షేత్రం మీదనే ఆదివారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో విమానం వెళ్లింది. కాగా, విమానయాన శాఖకు చెందిన నావిగేషన్‌ సర్వే కోసం ఈ విమానం తిరుమల మీదుగా వెళ్లిందని, ఆలయంపై వెళ్లలేదని టీటీడీ అధికారులు వివరించారు. 


Updated Date - 2020-09-21T07:42:34+05:30 IST