కూరగాయల మంట!

ABN , First Publish Date - 2021-10-13T09:20:08+05:30 IST

మార్కెట్లో కూరగాయ ధరల మంటతో ఇటు కొనుగోలుదారులు, అటు విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కూరగాయల మంట!

కిలో టమాట 40పైనే..  చిక్కుడు 65

అకాల వర్షాలతో అమాంతం పెరిగిన రేట్లు

2, 3 రకాలతోనే నెట్టుకొస్తున్న సామాన్యులు

గిరాకీ లేక అల్లాడిపోతున్న రిటైల్‌ వ్యాపారులు


విజయనగర్‌ కాలనీకి చెందిన రవికుమార్‌ అమీర్‌పేటలోని ఓ షాపింగ్‌ మాల్‌లో నెలకు రూ.15 వేల వేతనంతో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వారానికోసారి మార్కెట్‌కు వెళ్లి రూ.200 వెచ్చించి వివిధ రకాల కూరగాయలు తెచ్చుకునేవారు. మంగళవారం ఉదయం మార్కెట్‌కు వెళ్లిన రవికుమార్‌ అక్కడ రేట్లను చూసి హడలిపోయారు. కిలో టమాట రూ.40, పచ్చిమిర్చి రూ.45, కాప్సికమ్‌ రూ.65, కిలో క్యారట్‌  రూ.37 ఉండడంతో తలపట్టుకున్నారు. పది రోజుల క్రితం రూ.20కి కిలో టమాట, రూ. 20కి కిలో బెండకాయ తీసుకున్నానని, ఇప్పుడు వాటిని కొనే పరిస్థితిలేదని వాపోయారు. చేసేదేమీ లేక కిలో రూ.5-10 ధర కలిగిన క్యాబేజీ, రూ.18 ఉన్న బీట్‌రూట్‌, అరకిలో టమాట, పచ్చిమిర్చి తీసుకెళ్లినట్లు చెప్పారు.


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో కూరగాయ ధరల మంటతో ఇటు కొనుగోలుదారులు, అటు విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంద రూపాయలు పట్టుకెళితే గట్టిగా రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. ఐదారువందలు పెట్టినా సంచీ నిండడం లేదు. గతంలో కిలో చొప్పున కొనేవారంతా ఇప్పుడు అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. వారం క్రితం ధరలతో పోల్చితే వివిధ కూరగాయల్లో ఎక్కువకు ఎక్కువ కిలోకు రూ20-25 చొప్పున పెరిగాయి. రూ.15-20 పెట్టందే పావు కిలో కూరగాయలు రావడం లేదు. నెలక్రితం ఉల్లిగడ్డ రూ.100 పెడితే 4-6 కిలోలు వచ్చేది. ఇప్పుడు మూడు కిలోలే ఇస్తున్నారు. తోటకూర, పాలకూర, మెంతికూర వంటివి రూ.20 పెడితే నాలుగు చిన్న కట్టలు చేతిలో పెడుతున్నారు. పండ్ల ధరలూ మండుతున్నాయి. రెండు కిలోల సీతాఫలాల బుట్ట హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.200 వరకు ఉండగా  ప్రస్తుతం రూ.350 పలుకుతోంది.


అదే తోపుడు బండ్లపై ఒక్కో సీతాఫలం (సైజును బట్టి) రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. కాగా, బండ్లపై కిలో రూ.200 అమ్ముతున్నారు. గతంలో సూపర్‌మార్కెట్లలో ఒక దానిమ్మ రూ.30  ఉండగా, ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. తోపుడు బండ్లపై కిలోకు రూ.80 తీసుకోగా, ప్రస్తుతం రూ.100కు ఆరు ఇస్తున్నారు. ఇటీవల వరుసగా భారీ వర్షాలు పడటం, ఇంధన ధరలు, రవాణా చార్జీలు పెరగడంతోనే కూరగాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరో పది రోజుల వరకు కూరగాయల రేట్లు తగ్గే పరిస్థితి ఉండదని మెహిదీపట్నం రైతు బజార్‌కు చెందిన వ్యాపారి సలీం తెలిపారు. లీటర్‌ డీజిల్‌ ధర రూ.108 ఉండటంతో డీసీఎం, మినీ ట్యాక్సీ డ్రైవర్లు ఏపీలోని మదనపల్లి నుంచి టమాట లోడు తీసుకొస్తే రూ.5 నుంచి రూ.8వేలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.


వారం రోజుల్లో టమాట దిగొస్తుంది 

ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నీటమునగడంతో కావాల్సినంత టమాట మార్కెట్‌కు రావడం లేదు. దీంతో ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చే టమాటపైనే ఆధారపడాల్సి వస్తోంది. రవాణా చార్జీలతో కలుపుకొని అధిక ధరకు విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో ధర దిగి వస్తుంది.

-స్రవంతి, సరూర్‌నగర్‌ రైతుబజార్‌ అధికారి


లోకల్‌ దిగుమతి తగ్గింది

గతంలో బోయినపల్లి మార్కెట్‌కు లోకల్‌ కూరగాయలు 22 క్వింటాళ్ల వరకు రాగా.. ప్రస్తుతం 14 క్వింటాళ్లే వస్తున్నాయి. కాకరకాయ, క్యారట్‌ కర్ణాటక నుంచి, ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచి, ఆలుగడ్డ యూపీ నుంచి వస్తుండటంతో రవాణా చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాలతో టమాట రైతులు నష్టపోయారు. దీంతో దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కూరగాయలకు రేటు ఎక్కువగా ఉంది. 

-టీఎన్‌.శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌, బోయినపల్లి


Updated Date - 2021-10-13T09:20:08+05:30 IST