రోడ్డెక్కిన రైతుబజార్‌

ABN , First Publish Date - 2021-02-04T06:02:10+05:30 IST

పట్టాభిపురం రైతుబజార్‌ పరిస్థితి దయనీయంగా మారింది. బంతిని విసిరేసినట్లుగా ప్రభుత్వశాఖలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి విసిరేస్తున్నాయి.

రోడ్డెక్కిన రైతుబజార్‌
ఎన్‌టీఆర్‌ స్టేడియం బయట కూరగాయలు విక్రయిస్తున్న రైతుబజార్‌ వ్యాపారస్థులు

గుంటూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పట్టాభిపురం రైతుబజార్‌ పరిస్థితి దయనీయంగా మారింది. బంతిని విసిరేసినట్లుగా ప్రభుత్వశాఖలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి విసిరేస్తున్నాయి. మొదట్లో స్వామి థియేటర్‌ వద్ద మెయిన్‌ రోడ్డు పక్కన ఉండగా కోర్టు ఆదేశాలతో ఖాళీ చేయించారు. ఆ తర్వాత తాత్కాలికంగా కృష్ణనగర్‌లోని కృష్ణాశ్రమం స్థలంలో ఏర్పాటుచేశారు. గుజ్జనగుండ్ల సెంటర్‌లో నూతన రైతుబజార్‌ని నిర్మిస్తామని అప్పట్లో వాగ్దానం చేసి కొంత నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే అది కూడా రోడ్డు మార్జిన్‌ స్థలం కావడంతో దానిపైనా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో అక్కడ నిర్మాణ పనులను అర్ధంతరంగా నిలిపేశారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విశాలమైన ప్రదేశంలోకి రైతుబజార్‌ని మార్చే క్రమంలో బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలోకి మార్చారు. అక్కడ వాకర్స్‌కు ఇబ్బంది కలుగుతుందని స్టేడియంలోనే స్కేటింగ్‌ రింగు వద్దకు మార్చారు. ఇప్పుడు ఏకంగా మరో స్థలంలోకి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారమే స్టేడియంని ఖాళీచేయాలని నగరపాలకసంస్థ అధికారులు ఆదేశించారు. దాంతో రైతుబజార్‌ వ్యాపారస్థులంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన కూరగాయలను స్టేడియం బయట మెయిన్‌రోడ్డుపై కుప్పలు పోసుకొని విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా పట్టాభిపురం పోలీసుస్టేషన్‌ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. స్టేడియం ఎదురుగా ఉన్న టెన్నిస్‌ కోర్టు పక్కన ఉన్న ఖాళీస్థలాన్ని చదునుచేసి ఇస్తామని, అందులో కూరగాయలు విక్రయించుకోవాలని నగరపాలక సంస్థ అధికారులు చెప్పారని రైతులు వాపోయారు. ఎంతో జనాదరణ కలిగిన పట్టాభిపురం రైతుబజార్‌ని ఒక శాశ్వత ప్రదేశంలో ఏర్పాటు చేయకుండా ఇలా తరచుగా మారుస్తుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్థులు తెలిపారు. 



Updated Date - 2021-02-04T06:02:10+05:30 IST