కూర‌గాయలు... రూ. కోట్లు... ఆదర్శంగా హైదరాబాద్ జంట...

ABN , First Publish Date - 2021-03-07T21:49:33+05:30 IST

పూర్తి ఆటోమేటిక్ సాంకేతిక‌త‌తో రూపోందిన వ్య‌వ‌సాయ క్షేత్రమిది. దీనిద్వారా దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు త‌మకు న‌చ్చిన ప‌ని చేస్తూ వ్య‌వ‌సాయాన్ని వ్యాపారంగా మార్చుకుంది ఈ యువ జంట.

కూర‌గాయలు... రూ. కోట్లు... ఆదర్శంగా హైదరాబాద్ జంట...

 హైదరాబాద్ : పూర్తి ఆటోమేటిక్ సాంకేతిక‌త‌తో రూపోందిన వ్య‌వ‌సాయ క్షేత్రమిది. దీనిద్వారా దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు త‌మకు న‌చ్చిన ప‌ని చేస్తూ వ్య‌వ‌సాయాన్ని వ్యాపారంగా మార్చుకుంది ఈ యువ జంట.


సాధార‌ణంగా చ‌దువు పూర్త‌వ‌గానే యువ‌తీయువ‌కులకు... ‘ల‌క్ష‌ల్లో జీతముండాలి. విదేశాల్లో ఉద్యోగం కావాలి’ అని కోరుకుంటారు. హైద‌రాబాద్ కు చెందిన ఈ జంట మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. దాదాపు పద్ధెనిమిదేళ్ల‌పాటు వివిధ దేశాల్లో ఉన్న‌తోద్యోగాలు చేసిన‌ప్ప‌టికీ పుట్టి పెరిగిన నేల‌పై మ‌మ‌కారాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలోనే... లక్ష‌ల రూపాయల జీతాల‌ను, అత్యున్నత జీవ‌న ప్ర‌మాణాల‌ను వదులుకునిస్వ‌దేశానికొచ్చి... అత్యాధునికి ప‌ద్ద‌తిలో వ్య‌వ‌సాయాన్ని ప్రారంభించారు. వివరాలిలా ఉన్నాయి. 


సచిన్ దర్బార్వార్, శ్వేత హైదరాబాద్‌కు చెందిన జంట. సచిన్‌ది రైతు కుటుంబం కాన‌ప్ప‌టికీ వ్య‌వ‌సాయంపై చిన్న‌ప్ప‌టి నుంచి మ‌క్కువ. హైద‌రాబాద్ లో పుట్టిపెరిగిన ఈయ‌న త‌న చ‌దువు పూర్త‌వ‌గానే న్యూజిలాండ్ లో స్థిర‌ప‌డ్డారు. దాదాపు 18 ఏళ్లు పాటు వివిధ ప్ర‌ముఖ కంపెనీల్లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా ప‌నిచేశారు.


ఎప్ప‌టికైనా స్వదేశానికొచ్చి ఎదైనా చేయాల‌న్న త‌ప‌న అత‌నికి ఉండేది. ఈ క్రమంలోనే ‘సింప్లీ ప్రెష్’ పేరుతో ఓ వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి పలు రకాల కూర‌గాయాల‌ను ప్ర‌కృతిసిద్దంగా పండిస్తూ వాటిని న‌గ‌రంలో దాదాపు ప‌లు సూప‌ర్ మార్కెట్లు, హోట‌ళ్ళకు స‌రాఫ‌రా చేస్తోన్నారు స‌చిన్ ద‌ర్బార్వార్.


త‌న భార్య కూడా స‌హాయ స‌హకారాలు అందించ‌డంతో 2013 లో న్యూజిలాండ్ నుంచి స్వదేశానికొచ్చి షామీర్‌పేట్ లో దాదాపు 10 ఎక‌రాల్లో ఈ వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. విదేశాల్లో వాడుక‌లో ఉన్న అత్యాధునిక పద్ధతుల్లో ఇక్క‌డ కూర‌గాయల సాగు చేస్తున్నారు. ఎక్క‌డా ఎటువంటి ర‌సాయనాలు వాడ‌కుండా పూర్తి స్థాయిలో ప‌కృతిసిద్ధంగా కూర‌గాయల‌ను పండిస్తున్నారు.


వీరు కూర‌గాయలు పండిస్తున్న వ్యవసాయ క్షేత్రానికి వెళితే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. అత్యాధునిక విధానాల‌తో ఇక్క‌డ కూర‌గాయాల‌ను పండిస్తున్న విధానం ముక్కుమీద వేలేసుకునేలా చేస్తుంది. దాదాపు పదెకరాల్లో ఉన్న ఈ వ్య‌వ‌సాయ క్షేత్రంలో 150 ర‌కాల కూర‌గాయాలు పండిస్తున్నారు.


‘మాది వ్య‌వ‌సాయాధారిత కుంటుంబం కాక‌పోయిన‌ప్ప‌టికి మాకు ఎక్కువ స్థ‌లాలుండేవి. మా తాత‌ వ్య‌వ‌సాయం చేసేవారు. కానీ మా నాన్న దానిని కొనసాగించలేదు. అయిన‌ప్ప‌టికీ చిన్న‌ప్ప‌టి నుంచి నాకు వ్య‌వ‌సాయం పై మ‌క్కువ. ఇక... 2013 లో న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వ‌చ్చేయాలనుకున్న‌ప్పుడు, వచ్చి... ఏం చేయాల‌న్న ప్ర‌శ్న త‌లెత్తింది. అప్పుడొచ్చిన ఆలోచ‌న ఫలితమే ఈ సింప్లీ ఫ్రెష్. ఎటువంటి ర‌సాయనాలనూ ఉప‌యోగించ‌కుండా నాణ్య‌మైన కూర‌గాయాల‌ను అందించాల‌న్నదే మా సింఫ్లీ ఫ్రెష్ ధ్యేయం. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సౌక‌ర్యాలు, యంత్రాల‌ను ఉప‌యోగించి ప్ర‌కృతిసిద్ధంగా కూర‌గాయాలు పండించవచ్చని వ్య‌క్తిగ‌త ప‌నుల‌కోసం వివిధ దేశాలు తిరిగిన‌ప్పుడు తెలుసుకున్నాను. అదే ఎందుకు మ‌న దేశంలో చేయ‌కూడ‌దన్న ఆలోచ‌న నుంచి వ‌చ్చిందే ఈ వ్య‌వ‌సాయ క్షేత్రం.’ అని చెప్పారాయన. 


ప్ర‌స్తుతం రోజుకు దాదాపు 8 వేల కిలోల వివిధ ర‌కాల కూర‌గాయలు పండిస్తున్నారు.. దాదాపు రూ. 2 కోట్ల పెట్టుబ‌డితో సిద్దిపేట‌కు స‌మీపంలో కూడా ఓ వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ‘2017-18 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఈ వ్య‌వ‌సాయ క్షేత్రం ద్వారా ఆశించిన ఫ‌లితాలు రావడంతో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో సిద్దిపేట స‌మీపంలో 150 ఎక‌రాల్లో వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో కూడా దాదాపు 150 రకాల కూర‌గాయ‌లను పండిస్తున్నారు.  మొత్తం రెండు క్షేత్రాల నుంచి రోజుకుదాదాపు 29 వేల కేజీల కూర‌గాయలను పండిస్తోన్నాం’ అని చెప్పారు స‌చిన్, శ్వేత‌.


పూర్తి స్థాయి ఆటోమేటిక్ సాంకేతిక‌త‌తో రూపోందిన ఈ వ్య‌వ‌సాయ క్షేత్రంలో దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. స్థానికంగా ఉన్న వారికే ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు త‌మ మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేస్తూ వ్య‌వ‌సాయాన్ని వ్యాపారంగా మార్చుకున్న ఈ యువ జంట నిజంగా ఇతరులకు స్ఫూర్తినిస్తోంది కదూ..!

Updated Date - 2021-03-07T21:49:33+05:30 IST