మొన్న నిధులు ఆపాలని.. నేడు అనుమతులులేవని..

ABN , First Publish Date - 2021-09-13T05:16:05+05:30 IST

కృష్ణా జలాల పంపిణీ..

మొన్న నిధులు ఆపాలని.. నేడు అనుమతులులేవని..
రెండో టన్నెల్‌ తవ్వక ప్రాంతం

వెలిగొండపై నీలినీడలు

కొనసాగుతున్న తెలంగాణ ఫిర్యాదులు

కేంద్ర గెజిట్‌ ప్రకటనలో లోపాల ఆసరాగా అడ్డంకులు

పాతికేళ్ల నాటి ప్రాజెక్టుకు ఇప్పుడు డీపీఆర్‌ కోరిన కేఆర్‌ఎంబీ

ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువు

ఆయకట్టుప్రాంత ప్రజల్లో ఆందోళన


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇతరత్రా అంశాలపై గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలతో జిల్లాకు ప్రాణప్రదమైన వెలిగొండపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు గెజిట్‌లో ప్రాజెక్టుకు చట్టబద్ధత కోసం టీడీపీ కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లి విజ్ఞప్తి చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. అదేసమయంలో కేంద్ర గెజిట్‌లో లోపాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఆసరా చేసుకొని తెలంగాణ సర్కారు వెలిగొండపై కేంద్రానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లోపాల సవరణ అటుంచి ఏకంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను నివేదించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రాజెక్టు భవిష్యత్‌పై వెలిగొండ ఆయకట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన, అలజడి నెలకొంది. 


జిల్లాలో కరువు పీడిత పశ్చిమప్రాంతానికి ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టుకు దశాబ్దాల పోరాటాల అనంతరం 1996లో అప్పటి సీఎం నారాచంద్రబాబు నాయుడు పునాది రాయి వేశారు. అది జరిగి పాతికేళ్లు పూర్తి కావస్తుండగా అనేక అవాంతరాలు, ఆటంకాలను అధిగమిస్తూ నిర్మాణం సాగుతోంది. దీంతో ప్రస్తుతం రాబోయే రెండు, మూడేళ్లలో అయినా వెలిగొండ నీటిని చూడాగలమన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో కీలకమైన తొలి టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యింది. హెడ్‌ రెగ్యులేటరీ, మూడు చోట్ల ట్యాంకుల నిర్మాణం, అధికభాగం ఫీడర్‌కెనాల్‌ తదితర అనేక పనులు పూర్తయ్యాయి. నిజానికి ఈ ఏడాదే తొలి టన్నెల్‌ నుంచి కృష్ణా నీటిని వెలిగొండకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ నిర్వాసితుల పునరావాసంలో నెలకొన్న జాప్యం, ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తీసుకోలేకపోయారు. 


లోపాల సవరణపై దృష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం 

కేంద్రం వెలిగొండను గెజిట్‌లో చేర్చనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదు. తక్షణం స్పందించి లోపాలు సవరించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టలేదు. దీనిని ఆసరాగా తీసుకొని నిత్యం కృష్ణా జలాల పంపిణీపై గిల్లిగజ్జాలు పెట్టుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం వెలిగొండను గెజిట్‌లో అన్‌ అప్రూవ్డ్‌గా పేర్కొన్నందున నిధులు ఇవ్వరాదంటూ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి రెండుసార్లు, తెలంగాణ సీఎంకు ఒకసారి బహిరంగ లేఖలు రాశారు. వారం క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖమంత్రి షెకావత్‌ను కలిసి టీడీపీ బృందం వెలిగొండకు న్యాయం చేయాలని కోరింది. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగుస్థాయిలో కేంద్రానికి వెలిగొండపై ప్రతిపాదనలు వెళ్లలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని మరింత అనుకూలంగా మలచుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వెలిగొండకు అసలు అనుమతులే లేవంటూ మెలిక పెట్టి కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. 


గెజిట్‌లో అన్‌అప్రూవ్డ్‌ ప్రాజెక్టుగా వెలిగొండ 

రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీపై తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తొలుత కృష్ణా జలాల పంపిణీకి కేఆర్‌ఎంబీని ఏర్పాటు చేసింది. రెండు మాసాల క్రితం కృష్ణా, గోదావరి నీటి యాజమాన్య బోర్టులకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్‌ను ప్రకటించింది. కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మితమైన 2014 రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నట్లు చూపి, వెలిగొండను అన్‌ అప్రూవ్డ్‌గా పేర్కొంది. అలాగే వెలిగొండ పేరులోనూ తప్పులు చోటుచేసుకున్నాయి. 


కేఆర్‌ఎంబీ లేఖతో వివాదాస్పదం

పాతికేళ్ల క్రితం నుంచి ఉండి, విభజన చట్టంలో పేర్కొన్న వెలిగొండ విషయంలో లోటుపాట్ల సవరణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాల్సింది పోయి తెలంగాణ ఫిర్యాదుకు ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. పాతికేళ్ల నుంచి పనులు జరుగుతున్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను నివేదించాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. తద్వారా వెలిగొండను కొత్త ప్రాజెక్టుగా తెలంగాణ చేస్తున్న ప్రచారం, ఫిర్యాదులకు అనుగుణంగా స్పందిస్తున్న విషయం బహిర్గతమవుతున్నది. ఈ పరిణామాలతో వెలిగొండ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళన, అలజడి ఆ ప్రాంత ప్రజల్లో, రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తగుస్థాయిలో స్పందించకపోతే వెలిగొండపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు మరింతగా పెంచడం, కేఆర్‌ఎంబీ మెతక వైఖరితో వివాదాస్పద ప్రాజెక్టుగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. తక్షణం ప్రభుత్వం వెలిగొండ భవిష్యత్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆప్రాంత ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతోంది. 


ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వెలిగొండ ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వ కాలంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. అలాంటి ప్రాజెక్టు కొత్తదా, పాతదా తెలియకపోవడం దౌర్భాగ్యం. ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. వెలిగొండ నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయాలకు అతీతంగా వెలిగొండ పూర్తికి సంకల్పం కావాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రవీడాలి.


Updated Date - 2021-09-13T05:16:05+05:30 IST