వల్లూరు రైతు భరోసా కేంద్రం

ABN , First Publish Date - 2020-05-30T11:22:56+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుభరోసా కేంద్రాలు శనివారం నుంచి

వల్లూరు రైతు భరోసా కేంద్రం

నేటి నుంచి రైతు భరోసా కేంద్రాలు

రిమోట్‌ ద్వారా వల్లూరులో 

ప్రారంభించనున్న సీఎం

జిల్లాలో 620 కేంద్రాలు ఏర్పాటు


కడప, మే 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుభరోసా కేంద్రాలు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. జిల్లాకు ఒక కేంద్రాన్ని సీఎం జగన్‌ రాజధాని నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభించనున్నారు. జిల్లాలో వల్లూరు రైతు భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రాంరభించేందుకు జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొంత మంది రైతులతో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి కలెక్టరు, ఎమ్మెల్యేలు, వ్యవసాయాశాఖాధికారులు హాజరు కానున్నారు. వ్యవసాయాన్ని లాభపాటిగా మార్చేందుకే రైతు భరోసా కేంద్రాల ముఖ్య ఉద్ధేశ్యమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 620 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 194 చోట్ల ప్రభుత్వ భవనాలు, 426 చోట్ల అద్దె భవనాల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. 


రైతులకు అన్ని సేవలూ ఇక్కడే..

ఈ కేంద్రాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. రైతులకవసరమైన పనిముట్లు, విత్తనాలు, ఎరువులు తదితరాలు కిమాస్క్‌ ద్వారా నమోదు చేసుకుంటే 48 గంటల్లోనే అందిస్తారు. రైతుల వివరాలు, వ్యవసాయ భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటల వివరాలు, పాడి పశువుల వివరాలను నమోదు చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాగు చేసిన విత్తన నమూనాలను పంటల వివరాలను పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. పంట సాగు, మెళకువల గురించి రైతులకు తెలుసుకునేందుకు గాను దినపత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్‌ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తారు.


ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, పశు సంవర్ధక సహాయకులు అందుబాటులో ఉంటారు. విత్తనశుద్ధి, భూసార పరీక్షలు తదితర వాటిపై వ్యవసాయ ప్రదర్శన చేస్తారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు తెప్పిస్తారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంఽధించిన కషాయం తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. విత్తనపు గొర్రులు, కలుపు తీసే పరికరాలు రైతులకు అద్దెకిచ్చేందుకు అందుబాటులో ఉంచుతారు. రైతుకు అవసరమైన అన్ని సేవలు ఇక్కడే అందుతాయని ప్రభుత్వం చెబుతోంది.

Updated Date - 2020-05-30T11:22:56+05:30 IST