శివపార్వతుల కట్టడి ఎలా..?

ABN , First Publish Date - 2021-04-19T05:55:56+05:30 IST

సీతారాముల కల్యాణం వేళ పెళ్లి తంతు నిర్వహించుకోవడానికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి శివపార్వతులు, భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. గతేడాది లాక్‌డౌన్‌తో దేవస్థా నంలో అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. భక్తులను అనుమతించలేదు. లాక్‌డౌన్‌, రవాణా సౌకర్యం లేకపోవడంతో శివపార్వతులు రాలేకపోయారు. ఈసారి కూడా ఈ నెల 22 వరకు వేములవాడ దేవస్థానంలోకి భక్తులకు అనుమతిని నిలిపివేశారు. 21న శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారామచంద్రస్వామి భక్తోత్సవ కల్యాణం, రథోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయంలో శాస్త్ర్తోక్తంగా అంతరంగికంగా కల్యాణాన్ని నిర్వహించనున్నారు. భక్తులను అనుమ తించరు. అనుమతి లేదని చెబుతున్నా శివపార్వతులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

శివపార్వతుల కట్టడి ఎలా..?

- వేములవాడ దేవస్థానంలో దర్శనాల రద్దు 

- 22 వరకు భక్తుల ప్రవేశం నిలిపివేత 

-  శివపార్వతులు తరలివచ్చే అవకాశం 

- గతేడాది లాక్‌డౌన్‌తో దూరం 

-  మహాశివరాత్రి, శివకల్యాణంతో కరోనా ఉధృతి

- నిరాడంబరంగా సీతారాముల కల్యాణం..


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సీతారాముల కల్యాణం వేళ పెళ్లి తంతు నిర్వహించుకోవడానికి  వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి శివపార్వతులు, భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. గతేడాది లాక్‌డౌన్‌తో దేవస్థా నంలో  అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. భక్తులను అనుమతించలేదు. లాక్‌డౌన్‌, రవాణా సౌకర్యం లేకపోవడంతో శివపార్వతులు రాలేకపోయారు. ఈసారి కూడా ఈ నెల 22 వరకు వేములవాడ దేవస్థానంలోకి భక్తులకు అనుమతిని నిలిపివేశారు. 21న శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారామచంద్రస్వామి భక్తోత్సవ కల్యాణం, రథోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయంలో శాస్త్ర్తోక్తంగా అంతరంగికంగా కల్యాణాన్ని నిర్వహించనున్నారు. భక్తులను అనుమ తించరు.  అనుమతి లేదని చెబుతున్నా శివపార్వతులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం వేములవాడకు భక్తుల తాకిడి పెరిగింది. గత నెల 11న నిర్వహించిన మహాశివరాత్రి జాతరకు 3 లక్షల మంది భక్తులు వచ్చారు. 31 వతేదీన  పార్వతిరాజేశ్వరస్వామి కల్యాణానికి భక్తులను అనుమతిం చకపోయినా 50వేలమందికి పైగా భక్తులు ఆలయం బయట ఉన్నారు. శివరాత్రి, శివకల్యాణాలకు భక్తులు తరలిరావడంతో కరోనా వ్యాప్తి పెరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహించిన ఆలయ ఉద్యోగులు, పోలీసులు మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఏఎస్సై కరోనాతో మృతిచెందారు. వ్యాపారస్థులకు కూడా కరోనా పాజిటివ్‌  వచ్చింది. ఒక మహిళ మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఆలయంలో పనిచేసే స్వీపర్‌ మృతిచెందారు. వేములవాడ శివారులోని జయవరం గ్రామంలో నాలుగు రోజుల క్రితమే వంద మందికిపైగా కొవిడ్‌ వచ్చింది. ఇద్దరు మృత్యువాత   పడ్డారు. చుట్టు పక్కల గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీతా రాముల కల్యాణం అంతరంగికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించినా శ్రీరామనవమిరోజున శివపార్వతులు తరలి వచ్చే అవకాశం ఉంది. శివపార్వతులను కట్టడి చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. గతేడాది లాక్‌డౌన్‌, రవాణా సౌకర్యం లేకపోవడంతో శివపార్వతులు తరలిరాలేదు.  ప్రస్తుతం రవాణా సౌకర్యం ఉండడంతో శివపార్వతులు వేములవాడకు తరలివచ్చి సంప్రదాయంగా వస్తున్న పెళ్లి తంతును పూర్తి చేసుకొని వెళ్లే అవకాశం ఉంది. దీంతో కరోనా మరింత విజృంభిస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

 

సాధారణ జీవితం గడుపుతూ....

 ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో  ఉండి వివాహాలు చేసుకొని సాధరణ జీవితం గడుపుతూనే శివపార్వతులుగా కొనసాగు తున్న వారు ఉన్నారు.  వివిధ ఉన్నత స్థాయి  ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వీరు కూడా ఏటా శ్రీరామనవమికి వేములవాడ రాజన్న వద్దకు వచ్చి పెళ్లిని  పునరుద్ధరించుకుంటారు. ఎన్నో ఏళ్లుగా కొనసా గుతోంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని దేవదాసీలు, కర్నూలు జిల్లాలోని బసివీనులు, నిజామాబాద్‌ జిల్లాలోని జోగినిల ఆచారాలకు దగ్గరగా ఉన్నా అందులో మహిళలకే పరిమితం.  శివపార్వతుల ఆచారం మాత్రం స్త్రీ , పురుషులకు సంబంధించినది. జోగిని, దేవదాసి, బసివినిల్లో లైంగిక దోపిడీ వంటివి కనిపిస్తాయి. శివపార్వతుల్లో కేవలం భిక్షాటనే ప్రధానంగా ఉంటుంది. శివపార్వతులు పెళ్లిల్లు చేసుకొని పిల్లాపాపలతో కుటుంబ జీవనం గడుపుతూనే శివుడిని పెళ్లాడుతూ ఉంటారు. శివపార్వతులు వేములవాడ ఆలయ ప్రత్యేకతను చాటుతూ ఽధార్మిక ప్రచారకులుగా  ఎనలేని సేవలను అందిస్తున్నారు. ఈ సారి ధారణ కోసం శివపార్వతులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భక్తులకు అనుమతి లేకపోయినా దేవస్థానం బయట నుంచే మొక్కులు ల్లించుకుంటూ వెళ్తున్నారు. 


 అపూర్వ ఘట్టం 

పురోహితులు వేద మంత్రాలు పఠిస్తుండగా భక్త కోటి జగదానందంగా  సీతారాముల కల్యాణ వేడుకను వీక్షిస్తారు. ఇది అన్ని దేవాలయాల్లోనూ జరుగుతోంది.  వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే రాములోరి పెళ్లిలో మాత్రం  ధర్మ ప్రచారకులుగా ఉన్న శివపార్వతులు శివుడే పెనిమిటిగా వివాహాలను పునరుద్ధరించుకునే వేడుక  ఆనవాయితీగా వస్తోంది. సీతారాముల కల్యాణ వేడుకల్లో  వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సన్నిధిలో త్రిశూలం గంటల మోత, వర్షపు జల్లుగా కురిసే తలంబ్రాలు, శివసత్తుల పూనకాలతో దద్దరిల్లిపోయే   సన్నివేశాలు మహా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి తంతును జంగాలుగా పరిగణించే వీరశైవులు నిర్వహిస్తారు. రుద్రాక్షను మంగళసూత్రంగా, కాళ్లకు రాగి మట్టెలు, చేతికి త్రిశూలం ఇవ్వడం వంటివాటితో పెళ్లి తంతు కొనసాగుతుంది. ఇందులో లోకజ్ఞానం తెలియని ఆడ పిల్లలను సైతం శివ పార్వతులుగా శివుడితో పెళ్లి చేసే తంతు ఉంటుంది. ఇది  ‘ధారణ’ పేరుతో  తరతరాలుగా సాగిపోతోంది. దీనిని నివారించడానికి  స్వచ్ఛంద సంస్థలు, పోలీస్‌ యంత్రాంగం    కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఆచారం మాత్రం ఆగడంలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, కోమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్‌, జనగామ, వరంగల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌ జిల్లాలతోపాటు తెలంగాణ జిల్లాల్లోని ప్రతి ప్రాంతంలోనూ శివపార్వతులుగా మారి తరలివస్తారు. 

Updated Date - 2021-04-19T05:55:56+05:30 IST