అలుగు.. మోక్షమెప్పుడు కలుగు!

ABN , First Publish Date - 2021-04-11T05:12:03+05:30 IST

అదో మధ్యతరహా ప్రాజెక్టు. ఆయకట్టు 2,200 ఎకరాలు ఉంటుంది. అనధికారికంగా ఎక్కువగానే ఉంటుంది. ప్రాజెక్టు నిండితే ముక్కారు పంటలు పండుతాయి. రైతులకు భరోసా.. కూలీలకు ఏడాదంతా ఉపాధి. ఇదీ స్థూలంగా వెంగళరావు సాగర్‌ ప్రాజెక్టు కథాకమామీసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జోరు వానలకు అలుగు ధ్వంసమైంది. వరద తీవ్రతకు నామరూపాల్లేకుండా పోయింది. ఫలితంగా ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. దీంతో వానాకాలం అంతంతమాత్రంగా పండిన వరి.. యాసంగికి సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది.

అలుగు.. మోక్షమెప్పుడు కలుగు!
వెంగళరావు సాగర్‌ ప్రాజెక్ట్‌ ఇదే

ప్రతిపాదనలకే పరిమితమైన వెంగళరావుసాగర్‌ అభివృద్ధి  

పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ విముఖత

ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించని సర్కారు

ప్రతిపాదనలతోనే అధికారుల కాలం వెల్లదీత

చివరి భూములకు అందని నీరు

యాసంగిలో సగానికి తగ్గిన ఆయకట్టు సాగు విస్తీర్ణం

 చంద్రుగొండ, ఏప్రిల్‌ 10: అదో మధ్యతరహా ప్రాజెక్టు. ఆయకట్టు 2,200 ఎకరాలు ఉంటుంది. అనధికారికంగా ఎక్కువగానే ఉంటుంది. ప్రాజెక్టు నిండితే ముక్కారు పంటలు పండుతాయి. రైతులకు భరోసా.. కూలీలకు ఏడాదంతా ఉపాధి. ఇదీ స్థూలంగా వెంగళరావు సాగర్‌ ప్రాజెక్టు కథాకమామీసు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జోరు వానలకు అలుగు ధ్వంసమైంది. వరద తీవ్రతకు నామరూపాల్లేకుండా పోయింది. ఫలితంగా ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. దీంతో వానాకాలం అంతంతమాత్రంగా పండిన వరి.. యాసంగికి సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. 

ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది

భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలంలోని వెంగళరావుసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. ఈ ప్రాజెక్ట్‌ అలుగు నిర్మాణానికి నిధుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వెంగళరావుసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో 2,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి రైతులు ప్రధానంగా వరిని సాగు చేస్తుంటారు. చంద్రుగొండ, దామరచర్ల, సీతాయిగూడెం, ఉమ్మడిరామయ్యబంజర, తిప్పనపల్లి, మహ్మద్‌నగర్‌, అయ్యన్నపాలెం గ్రామాల రైతులకు చెందిన భూములు ఉన్నాయి. మూడేళ్ల క్రితం మిషన్‌కాకతీయ పథకం ద్వారా రూ.5.40కోట్ల అంచనాలతో కట్ట మరమ్మతులు, తూములు, కాల్వల పనులు చేశారు. అలుగు తరుచూ కోతకు గురవుతుండడంతో డిజైన్‌ మార్చి నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. మొదటిగా రూ.12కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా రూ.17.90 కోట్ల అంచనాలతో మళ్లీ ప్రతిపాదనలు పంపారు. కానీ నేటికీ ఆ నిధులు మంజూరు కాలేదు. దాంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పట్టించుకోవట్లేదని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు. గత ఏడాది వర్షాకాలంలో వరద ఉధృతికి ప్రాజెక్టు అలుగు భారీగా కోతకు గురైంది. ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి సందర్శించి తాత్కా లికంగా మట్టి కట్టలు వేసి నీటి వృఽథాను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. వేసవి కాలంలో నిధులు మంజూరైతే వర్షాకాలం పంటలకు సాగు నీటి ఎద్దడి ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రేట్లు గిట్టుబాటు కాకపోవడం తో గతంలో మిషన్‌ కాకతీయ పనులు ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్‌ అలుగు పనులకు క్యాన్సిలేషన్‌ పెట్టుకు న్నట్లు సమాచారం. రబీలో సాగునీటి ఎద్దడి దృష్ట్యా 1000 ఎకరాలకు వరి విస్తర్ణం తగ్గింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రత్యేక చర్య తీసుకొని నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

నిధులు మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారు

చింతల భిక్షమయ్య, ఆయకట్టు రైతు 

 వెంగళరావు ప్రాజెక్ట్‌ అలుగు డిజైన్‌ మార్చి కోతకు గురికాకుండా ఉండేలా అంచనాలు వేసి పంపిన నిధుల ప్రతిపాదనలు  కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే నిధులు మంజూరు కావడం లేదు. వేస విలో  అలుగు నిర్మాణ పనులు చేస్తే వర్షాకాలంలో వేసే పంటలకు నీటి ఎద్దడి ఉండదు. 2,200 ఎకరాల ఆయక ట్టులో 1,200 ఎకరాలల్లో సేద్యం చేస్తున్నారు. ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను ప్రారంభించాలి. 

రూ.17.90 కోట్లతో ప్రతిపాదనలు పంపాం

కృష్ణశంకర్‌, ఐబీ డీఈ 

వెంగళరావుసాగర్‌ ప్రాజెక్ట్‌ అలుగు శాశ్వత నిర్మాణానికి ప్రభుత్వానికి రూ.17.90కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.

Updated Date - 2021-04-11T05:12:03+05:30 IST