క్రీడాకారిణి భవీనాబెన్‌కు అభినందనలు తెలిపిన వెంకయ్య

ABN , First Publish Date - 2021-08-29T17:14:24+05:30 IST

టోక్యో పారా ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

క్రీడాకారిణి భవీనాబెన్‌కు అభినందనలు తెలిపిన వెంకయ్య

న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలంపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత  పతకం సాధించిన భవీనా పటేల్‌కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్​ ఝోతో పోటీపడ్డారు. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన భవీనాబెన్ తరువాత వెనుకంజ వేశారు. పసిడి పోరులో చైనా క్రీడాకారిణి యింగ్​ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు. దీంతో భవీనాబెన్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  అయితే టోక్యో పారాలింపిక్స్‌లో రజతాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా భవీనాబెన్‌ నిలిచారు.

Updated Date - 2021-08-29T17:14:24+05:30 IST