ఆ దేశాలకు మన క్షిపణులు

ABN , First Publish Date - 2021-01-26T09:11:31+05:30 IST

క్షిపణి సాంకేతికత రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇతర దేశాలు భారత్‌పై ఆధారపడే స్థాయికి ఎదిగామన్నా రు. ఆయుధాల దిగుమతి నుంచి ఎగుమతి

ఆ దేశాలకు మన క్షిపణులు

డీఆర్‌డీఓ కృషి భేష్‌: వెంకయ్యనాయుడు


హైదరాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): క్షిపణి సాంకేతికత రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇతర దేశాలు భారత్‌పై ఆధారపడే స్థాయికి ఎదిగామన్నా రు. ఆయుధాల దిగుమతి నుంచి ఎగుమతి వైపు పయనంలో డీఆర్డీవో కృషికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ డీఆర్డీఎల్‌లోని అబ్దుల్‌ కలాం క్షిపణి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సోమవారం సందర్శించారు. ఆ ప్రాంగణం లో రెండు నూతన భవనాలను ప్రారంభించి, సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భవిష్యత్తు రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాలన్నారు. కరోనాపై పోరాటంలో భారత్‌ విజయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మహమ్మారికి రికార్డు సమయంలో టీకా తయారు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో ప్రతీ భారతీయుడికి టీకా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. మాతృభాషలో ప్రజలకు విజ్ఞానాన్ని మరింత చేరువ చేయాలని సూచించారు. 

 

వాతావరణ మార్పులపై పరిశోధనలు

పరిశోధనలు, ప్రయోగాల తుది లక్ష్యం ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా మార్చడమే అని ఉపరాష్ట్రపతి అన్నారు. వాతావర ణ మార్పులపై మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. విజ్ఞాన శాస్త్రం మాతృభాషలో ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఢిల్లీలో కరోనా బాధితుల కోసం డీఆర్డీవో 12 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ క్షిపణి రంగ ప్రగతిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం పాత్ర చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్‌ అలీ, డీఆర్డీవో చైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-26T09:11:31+05:30 IST