మందిర పునర్నిర్మాణం- విలువలకు గుడి కట్టడం లాంటిది

ABN , First Publish Date - 2020-08-02T16:16:13+05:30 IST

మరో రెండు రోజుల్లో మన మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం కాబోతున్నది.

మందిర పునర్నిర్మాణం- విలువలకు గుడి కట్టడం లాంటిది

మరో రెండు రోజుల్లో మన మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం కాబోతున్నది. కనీసం 2వేల సంవత్సరాల క్రితం రచించిన, మన సామూహిక చేతనలో భాగమై అమర కావ్యంగా ప్రసిద్ది చెందిన  రామాయణంతో మనకున్న అనుబంధం ప్రతిఫలించబోతున్నది. శ్రీరాముడు మనకు ఒక ఆదర్శవంతమైన , అసాధారణమైన, కోట్లాది మంది దేవుడుగా ఆరాధించే ఒక మహాపురుషుడు. అంతేకాదు, ఒక న్యాయపూరితమైన, బాధ్యతాయుతమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు విలువలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు. ఆ రాముడికోసం మనం ఒక దేవాలయాన్ని నిర్మించడం రోమాంచితంగా, మన జీవితాలు ధన్యమైనట్లుగా అనిపించడంలో ఆశ్చర్యమేముంది?


ఇవాళ గత వైభవం మన కళ్లముందే ఒక మహాద్భుతంగా ప్రత్యక్షం కాబోతున్నది. మనం కలలు కంటున్న ఆకాంక్షలు సజీవం రూపం దాల్చబోతున్నాయి. నిజంగా ఈ ఘట్టం మనలో అప్రయత్నంగా  ఉత్సవ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.


మనం రామాయణ సారాన్ని సరైన దృక్పథంతో అవగాహన చేసుకుంటే, ధర్మం పట్ల, నైతిక వర్తన పట్ల  విశిష్టమైన భారతీయ దృక్పథాన్ని ఒడిసిపట్టుకున్న ఒక కావ్యంగా మనం అవలోకిస్తే, ఇదొక సాధారణ పరిణామంగా అనిపించదు. మొత్తం సమాజంలో ఒక నవనవోన్మేషమైన ఆధ్యాత్మిక ఉత్తేజానికి దారితీసే పరిణామమని మనకు అర్థం అవుతుంది. రామాయణం ఒక విశ్వజనీన దృష్టిని ప్రసరించే మహాకావ్యం కాబట్టే అది ఆగ్నేయాసియా లో అనేక దేశాల సంస్కృతిపై బలమైన ప్రభావాన్ని చూపింది.


వేద పారంగతుడు, సంస్కృత పండితుడు అయిన ఆర్థర్ ఆంథోనీ మెక్ డోనెల్ ప్రకారం భారతీయ ప్రతుల్లో వర్ణించిన శ్రీరాముడి ఆదర్శాలు మౌలికంగా లౌకికమైనవి. గత రెండున్నర సహస్రాలుగా ప్రజల జీవితాలు, ఆలోచనలపై అవి ప్రగాఢ ప్రభావాన్ని చూపుతున్నాయి.


భారత దేశంలోనే కాదు, ఆగ్నేయాసియాలో జావా, బాలి, మలయా, బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్  మొదలైన అనేక దేశాల్లో రామాయణం ఎందరో కవులు, నాటక రచయితలు, నృత్యకళాకారులు, సంగీతకారులు, జానపద కళాకారులను ఆకట్టుకుంది. థాయిలాండ్ వంటి దేశాల్లో రాజులకు రాముడి పేర్లను పెట్టుకున్నారు. 14వ శతాబ్దంలో థాయిలాండ్ లో ఒక రాజ్యం రాజధానినే ‘అయుథ్తయ’ అని అభివర్ణించారు. సంస్కృత రామాయణం ఆధారంగా థాయిలాండ్ లో రామకీన్, కంబోడియాలో రీంకర్ అని కావ్యాలు రాశారు. అంటే రామకీర్తి అని అర్థం. ఇండోనేషియాలో జావా భాషలో కకావిన్ రామాయణ (రామాయణ ద్విపద కావ్యం), బాలి భాషలో రామకవక, లావో భాషలో ఫ్రా లాక్ ఫ్రా రామ్, మలేషియాలో  హికాయత్ సెరి రామ, మయన్మార్ లో యమ జాట్ డావ్, ఫిలిప్పీన్స్ లో మహారాడియా లావణ, నేపాల్ భానుభక్త రామాయణ్ మొదలైనవి రామాయణం అనుసరణలే. రాముడికి సంబంధించి చైనాలో జాతక కథలు, జపాన్ లో హొబుట్సుషు, సంబో-ఎక్తోబా  కూడా రామాయణ మహాకావ్యం సార్వజనీనతకు నిదర్శనాలు.


రామాయణ మహాకావ్యాన్ని రష్యన్ లో అలెగ్జాండర్ బరానికోవ్ లో అనవదిస్తే దానికి ప్రముఖ రష్యన్ రంగస్థల కళాకారుడు గెన్నడీ పెచ్నికోవ్ రంగస్థలీకరణ చేసి అమితంగా జనాదరణ పొందారు. కంబోడియా లోని అంకోర్ వాట్ ఆలయంపై రామాయణ దృశ్యాలు,ఇండోనేషియాలో పంబానన్ ఆలయంలో ప్రదర్శించే ప్రసిద్దమైన రామాయణ నృత్యరూపకం(బ్యాలెట్) భౌగోళిక, మత సరిహద్దులకు అతీతంగా సాంస్కృతిక యవనికపై రామాయణ ప్రభావాన్ని చాటి చెబుతాయి.


బుద్దిజం, జైనిజం, సిక్కిజం వంటి ఇతర మతాల్లో కూడా రామాయణాన్ని ఏదో రూపంలో అన్వయించుకోవడం ఆసక్తికరం. ఎన్నో భాషల్లో ఎన్నో రకాలుగా రామాయణ కావ్యాన్ని కథలు కథలుగా చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు.


ఈ మహాకావ్య ఇతివృత్తం,  వృత్తాంతం లోనే విభిన్నమైన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే శక్తి ఇమిడి ఉన్నది. ‘పర్వతాలు దృఢంగా ఉన్నతంగా నిలిచినంతవరకూ, నదుల్లో నీరు ప్రవహిస్తున్నంతవరకూ రామాయణ గాథ ప్రజలను  సమ్మోహనపరుస్తూనే ఉంటుంది’  అని నారద మహాముని ఆనాడే కాలజ్ఞానంతో  చేసిన వ్యాఖ్యలు సత్యవాక్కులుగా స్థిరపడిపోయాయి.  


సీత, లక్ష్మణులతో కలిసి ఉత్తరాదిన అయోధ్య నుంచి దక్షిణాదిన శ్రీలంక వరకూ శ్రీరాముడు  జరిపే సుదీర్ఘ యాత్రలో జరిగే అనేక ఘట్టాల చుట్టూ ఈ మహాకావ్యంలో అడుగడుగునా విలువలతో కూడిన వ్యవస్థ పెనవెసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అదే దాని విశిష్టత అని చెప్పక తప్పదు.


‘ సచ్ఛీలుడైన, నిష్కళంకుడైన, మచ్చలేని ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం కల, సకల విద్యలు నేర్చిన, సమర్థుడైన,  అన్ని  ప్రాణుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?’ అని కవి వాల్మీకి నారద మహామునిని ప్రశ్నించడంతో రామాయణ మహాకావ్యం ప్రారంభమవుతుంది. ఇలాంటి అన్ని ఆదర్శ లక్షణాలున్న వ్యక్తిని కనుగొనడం కష్టమేనని, అయితే ఈ లక్షణాలకు సరిపోయే ఒక వ్యక్తి ఉన్నారని నారదుడు వివరిస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాముడని వెల్లడిస్తాడు. ఆయనకున్న అనేక లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రతి ప్రాణిని రక్షించి, ధర్మాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉండడం (రక్షిత జీవ లోకస్య ధర్మస్య పరిరక్షిత) అని చెబుతాడు. నిజానికి ఆ తర్వాత రామాయణ మహాకావ్యంలో రాముడి గురించి అభివర్ణిస్తూ ‘రామో విగ్రహాన్ ధర్మ’ (రాముడంటే ధర్మావతారం, సత్ర్పవర్తన, సత్యం, న్యాయం మూర్తీభవించిన వ్యక్తి) అని ఒక పాత్ర విశ్లేషిస్తుంది.


రాముడు భారతీయ సంస్కృతి మూర్తీభవించిన వ్యక్తి.  ఆయన ఆదర్శవంతమైన రాజు మాత్రమే కాదు, ఆదర్శవంతమైన మానవుడు. ఒక మానవుడు తనలో ఉండాలని ఆకాంక్షించే గొప్ప లక్షణాలన్నీ ఆయనలో సమ్మిళితమయ్యాయి.


ఈ లక్షణాలకు సంబంధించి అనేద ఉదాహరణలు మనకు రామాయణ గాథలో కనపడతాయి. ఈ గాథ  ముందుకు సాగుతూ రాముడు భారత దేశమంతా పర్యటిస్తున్నప్పుడు ఆయన అనేక విలువలకు కట్టుబడి ఉన్న తీరు మనకు అచ్చెరువు కలిగిస్తుంది.  సత్యం, శాంతి, కలిసి పనిచేయడం, దయార్ద్ర హృదయం, న్యాయం, అందర్నీ కలుపుకుపోవడం, అంకిత భావం, త్యాగ నిరతి, కరుణ వంటి ఈ విలువలు రాముడిలో ఎల్లెడలా కనిపిస్తాయి. ఈ విలువలే భారతీయ ప్రాపంచిక దృక్పథానికి మూలం. ఇవి విశ్వజనీనమైనవి, శాశ్వతమైనవి మాత్రమే కాదు, స్థలకాలాదుల సరిహద్దులకు  అతీతమైనవి. అందుకే ఇప్పటికీ రామాయణం ప్రతి సందర్భానికీ సరిపోయే మార్గదర్శినిగా మనకు వెలుగును ప్రసరిస్తుంది.  


‘ఒక మంచి సుపరిపాలనతో కూడిన రాజ్యం ఎలా ఉంటుంది? రామరాజ్యంలా ఉంటుంది..’ అని గాంధీజీ చెప్పేవారు. 1929లో యంగ్ ఇండియాలో ఆయన ఇలా రాశారు.


‘నా కలలో ఉన్న రాముడు ఈ భూమిపై ఎప్పుడైనా నివసించారో లేదో కాని రామరాజ్యం గురించి ప్రాచీన కాలంలో వ్యక్తీకరించిన ఆకాంక్ష నిస్సందేహంగా ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సూచిస్తుంది. ఈ వ్యవస్థలో అతి సామాన్య పౌరుడికైనా ఎటువంటి కాలయాపన, ఖర్చూ లేని వేగవంతమైన న్యాయం లభిస్తుంది. రామరాజ్యంలో ఒక శునకానికి కూడా సరైన న్యాయం లభించినట్లు కవి వర్ణించారు..’


జాలి, కరుణ, అందరికీ భాగస్వామ్యం కల్పించడం,  శాంతియుత సహజీవనం, పౌరులకు మెరుగైన నాణ్యత గల జీవనం కోసం నిరంతరం అన్వేషణ వంటి విలువలపై ఆధారపడిన ఇలాంటి ప్రజా కేంద్రీకృత ప్రజాస్వామ్య పాలన కావాలన్న ఆకాంక్షే మనకు ఒక గీటురాయి, ఒక దిక్సూచి, మన ప్రజాస్వామ్య మూలాలను మరింత విస్తరించాలనే మన జాతీయ లక్ష్యానికి  ప్రేరణ కలిగించే ఆలంబన. మన రాజకీయ, న్యాయ, పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ఇది ప్రోద్బలం కలిగిస్తుంది.  


ఆగస్టు 5, 2020న అయోధ్యలో  ప్రజలు ఆకాంక్షిస్తున్న  భవ్యమైన ప్రాచీన మందిర నిర్మాణాన్ని ప్రారంభించే ఈ పవిత్రమైన సందర్భంలో ఉత్కృష్టమైన రామాయణ మహాకావ్యాన్ని అర్థం చేసుకుని దాని సార్వత్రిక, విశ్వజనీనమైన సందేశాన్ని వ్యాప్తి చేయడం, అది చాటిచెప్పే ఉన్నతమైన మౌలిక విలువల ఆధారంగా మన జీవితాలను సుసంపన్నం చేసుకోవడం శ్రేయస్కరం. అందరం తొలి భారతీయ ఇతిహాసమైన శ్రీమద్రామాయణ మహా గ్రంథం చదివి, ఆకళింపు చేసుకుందాం. అందులోని భారతీయ తత్వాన్ని అర్థం చేసుకుని మన సంస్కృతి, సంప్రదాయాల్లోని గొప్పతనాన్ని అవగతం చేసుకుని, ఆచరిద్దాం. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.


-ముప్పవరపు వెంకయ్యనాయుడు(భారత ఉపరాష్ట్రపతి)

Updated Date - 2020-08-02T16:16:13+05:30 IST