జగన్‌ గ్రహించాల్సిన వాస్తవాలు

ABN , First Publish Date - 2021-04-10T06:11:18+05:30 IST

నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంతో పాటు తమ వర్తమానాన్ని, తమ బిడ్డల భవిష్యత్తును అధికారం రూపంలో తనకు అందించారనే సూక్ష్మాన్ని ముఖ్యమంత్రి జగన్‌ అర్థం చేసుకున్నారా? అసలు ఇప్పటివరకు...

జగన్‌ గ్రహించాల్సిన వాస్తవాలు

నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంతో పాటు తమ వర్తమానాన్ని, తమ బిడ్డల భవిష్యత్తును అధికారం రూపంలో తనకు అందించారనే సూక్ష్మాన్ని ముఖ్యమంత్రి జగన్‌ అర్థం చేసుకున్నారా? అసలు ఇప్పటివరకు తన పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమైనా ఉందా అనే విషయాన్ని ఆయన కనీసం సమీక్షించుకుంటున్నారా?


వాపును చూసి బలమనుకునేవాడు మూర్ఖుడు అన్నారు కానీ, నిజమైన బలాన్ని కూడా వాపు లాగా మార్చుకునేవాడిని ఏమనాలో పెద్దలు చెప్పలేదు. ముఖ్యంగా నాయకుడనే వాడు బలాన్ని పెంచుకుంటూ సైన్యాన్ని పరుగులు పెట్టించాలి. కానీ రాజ్యం ద్వారా, సైన్యం ద్వారా వచ్చిన బలాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటూ, వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అనూహ్యమైన, అద్భుతమైన తీర్పునిచ్చారు. ఆ తీర్పునివ్వడానికి కారణాలు చాలా ఉండవచ్చు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండో- అయిదు సంవత్సరాల కాలానికి మార్పు కోరుకుని ఉండవచ్చు. అప్పటివరకు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరిగి ఉండవచ్చు. అన్నిటికీ మించి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండన్న జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థన కూడా ప్రజల మనసుల్ని బలంగానే తాకింది. వీటన్నిటికీ మించి ప్రశాంత్‌కిశోర్‌ అనే బీహారీ రగిల్చిన కుల, మత విద్వేషాలు రాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేశాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.


కారణాలేవైనా, ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పును, అందించిన అబేధ్యమైన బలాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమాజంలో జరగాల్సిన చర్చ. నిజానికి ఈ చర్చ ఇప్పటికే మొదలైంది. కానీ రచ్చబండల వరకూ ఇంకా వెళ్లలేదు. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజలు తనకు అందించిన మెజారిటీలో వారి ఆకాంక్షల్ని చూడటం లేదు. వారి ఆర్తిని అర్థం చేసుకోవడం లేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంతో పాటు తమ వర్తమానాన్ని, తమ బిడ్డల భవిష్యత్తును అధికారం రూపంలో తనకు అందించారనే సూక్ష్మాన్ని గ్రహించలేకపోయారు జగన్. అసలు ఇప్పటివరకు తన పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమైనా ఉందా అనే విషయాన్ని ఆయన కనీసం సమీక్షించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను లక్షలమందికి అందిస్తుంటే, ప్రజలకేమీ చేయడం లేదంటారేంటి? అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఆ ప్రశ్న వేయడంలో తప్పు కూడా లేదు. కానీ ఇక్కడ ప్రజలు అంటే వ్యక్తులు కాదు. సమూహం, సమాజం, ఒక రాష్ట్రం. అందరూ అడుగుతున్నది జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని ఏం చేశారని, రాష్ట్రానికి ఏం సాధించారని, ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయిన వాటిని తిరిగి సాధించారా అని.


తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు, విశ్లేషణలు అవసరం కూడా. ‘నాకు కావాల్సిన బలాన్ని ఇవ్వండి, నేను పోరాడి మనకు కావాల్సినవి సాధించుకొస్తా’ అని పాదయాత్రలో పదేపదే చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజలు తప్పకుండా గుర్తుచేసుకుంటారు. అదే సమయంలో ప్రశ్నిస్తారు కూడా. ప్రత్యేక హోదా వస్తే ఒక్కో జిల్లా కేంద్రం ఒక్కో హైదరాబాద్‌ అవుతుందని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎందుకు మర్చిపోయారన్నది కీలకం. కేంద్రం మెడలు వంచుతానన్న ఆయన ఇప్పుడు కేంద్రం ముందు ఎందుకు సాగిలపడ్డారన్నది మరింతగా ఎదురవుతున్న ప్రశ్న. దాంతోపాటు విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌, రామాయపట్నం పోర్టు వంటి కీలక విషయాల్లో జగన్‌ వేస్తున్న పిల్లిమొగ్గలు ప్రతిరోజూ చర్చకొస్తూనే ఉన్నాయి. నిజానికి పైన చెప్పిన అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ ఆయాచితంగా ఇచ్చేవి కావని, అవన్నీ ఆ రాష్ట్ర ప్రజలకు విభజన చట్టం ద్వారా సంక్రమించిన హక్కులని తెలిసి కూడా విస్మరించడం జగన్‌రెడ్డికి ఏ మాత్రం శోభనివ్వకపోగా, ఆయన నాయకత్వంపై మచ్చల సంఖ్యను పెంచుతుంది. వీటికితోడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో జగన్‌ కేంద్రంతో కుమ్మక్కయ్యారనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది.


మరోవైపు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పిన కేంద్రం.. పుదుచ్చేరిలో అధికారంలోకి రాగానే హోదా ఇస్తామని నిన్నగాక మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అయినా జగన్‌ వైపు నుంచి కానీ, ఆయన ప్రభుత్వం వైపు నుంచి కానీ కనీస స్పందన లేకపోవడం, పుదుచ్చేరిలో బీజేపీకి మద్దతుగా వైసీపీ నేతలు ప్రచారం చేయడం ఇప్పుడు జగన్‌ నిజాయితీ, నిబద్ధతలను ప్రశ్నిస్తున్నాయి. ప్రజలు అందించిన బలాన్ని ఆయన వాపుగా మార్చేసుకున్నారు. ఆ బలాన్ని, శక్తిని ప్రజల కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం, పీకలపై వేలాడుతున్న కేసుల నుంచి బయటపడటం కోసం దుర్వినియోగం చేసేస్తున్నారన్నది విస్పష్టంగా వినిపిస్తున్న ఆరోపణ.


తాను విసురుతున్న సంక్షేమ పథకాలు తన వైఫల్యాలను, తప్పుడు విధానాలను కప్పిపుచ్చుతాయని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. అందులో సందేహం లేదు. అయితే ముఖ్యమంత్రి అనే వాడు ప్రజలను పిల్లలుగా భావించాలి. తండ్రిగా పిల్లలకు మూడు పూటలా తిండి పెట్టడం, మంచి బట్టలివ్వడం అనేది సంక్షేమం మాత్రమే. కానీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం, అందుకు అవసరమైన ప్రణాళికలు రచించి, తాను అమలు చేస్తూ, పిల్లల్ని అందులో భాగస్వాముల్ని చేయడం అసలైన, తెలివైన తండ్రి బాధ్యత. అలాంటిది అసలు పిల్లల్లాంటి ప్రజల భవిష్యత్తునే అంధకారంగా మార్చేస్తున్న తీరు ఏ మాత్రం సహించరానిది.


తాజా ఎన్నికల్లో గెలుపును తన విధానాలకు ఆమోదముద్రగా జగన్‌ భావిస్తున్నారు. కానీ ఆ ఎన్నికలు జరిగిన తీరు ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా లేదు. జగన్‌పై ప్రజలకు ఇంకా తగ్గని అభిమానం, ప్రేమ కూడా ఆయన విజయాలకు కారణమే. కాదనలేం. ఆ ప్రేమాభిమానాలు ఇంకా కొంతకాలం ఉండొచ్చు కూడా. ప్రేమ పుట్టడానికి చాలా సమయం పట్టొచ్చు కానీ అది చావడానికి ఒక్క క్షణం చాలు. వ్యక్తి మీదనైనా, వ్యవస్థ మీదనైనా విరక్తి మొదలైతే దాన్ని నిలువరించడం చాలా కష్టం. ఆ విరక్తి బయటికి కనిపించకపోవచ్చు కానీ, జనంలో మొదలైందనే వాస్తవాన్ని జగన్‌ గ్రహించాల్సిన అవసరం ఉంది.



వెంకటకృష్ణ పర్వతనేని

(సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-04-10T06:11:18+05:30 IST