వెంకటాచలంలో సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2021-11-27T05:21:21+05:30 IST

సంయుక్త కిసాన్‌ మోర్చా, రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం వెంకటాచలంలో రైతుల ఆందోళనలకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

వెంకటాచలంలో సత్యాగ్రహ దీక్ష
సత్యాగ్రహ దీక్ష చేస్తున్న రైతు, కార్మిక సంఘాలు, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

వెంకటాచలం, నవంబరు 26 : సంయుక్త కిసాన్‌ మోర్చా, రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం వెంకటాచలంలో రైతుల ఆందోళనలకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఓడూరు వెంకట కృష్ణయ్య  మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించడం రైతు ఉద్యమ విజయమన్నారు. ఈ క్రమంలో  కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, విద్యుత్‌ సవరణ చట్టం వెనక్కు తీసుకోవాలని, కార్మిక చట్టాల్లో మార్పులను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్‌లో జరిగే పోరాటాలకు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పగిడిపోగు కిరణ్‌ కిషోర్‌, సీపీఎం నాయకులు టీ వెంకయ్య, అడపాల చిన్నయ్య, షేక్‌ నజీర్‌ బాష, ఏనుగంటి సుబ్బరామయ్య తదితరులున్నారు.  


మోదీ మెడలు వంచిన రైతులు 

తోటపల్లిగూడూరు: వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే విషయంలో రైతులు ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచారని సీపీఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ శుక్రవారం  మండలంలోని నరుకూరు కూడలిలో సీపీఎం, సీఐటీయూల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకయ్య పాల్గొని, మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పోరాటాలకు తలొగ్గి మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. అంతేకాకుండా విద్యుత్‌ సంస్కరణలు ఆపాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు కాల్తిరెడ్డి రమణమ్మ, గంథం వెంకటేశ్వర్లు, పేరం ఆదిశేషయ్య, పచ్చ మధు, నాసిన పరశురాం, మారుబోయిన రాజా, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-27T05:21:21+05:30 IST