May 5 2021 @ 15:48PM

మరో మలయాళ రీమేక్‌లో వెంకటేశ్‌..!

అగ్ర కథానాయకుడైన విక్టరీ వెంకటేశ్‌ మరో రీమేక్‌ సినిమాలో నటించబోతున్నారంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళ చిత్రం 'అసురన్‌' తెలుగు రీమేక్‌ 'నారప్ప'లో, మలయాళ చిత్రం 'దృశ్యం2' రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేశ్ నటించబోయే సినిమా ఏదో కాదు, 'డ్రైవింగ్ లైసెన్స్‌' అని టాక్. ఈ మలయాళ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ చేజిక్కించుకుంది. 'దృశ్యం2' షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసిన వెంకటేశ్‌.. 'ఎఫ్‌3' సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయగాగనే 'డ్రైవింగ్‌ లైసెన్స్‌' సినిమాను సెట్స్‌పైకి తీసుకెళతారట. మలయాళ 'డ్రైవింగ్‌ లైసెన్స్‌'లో ఇద్దరు కథానాయకులుంటారు. మరి తెలుగు రీమేక్ లో ఓ పాత్రను వెంకటేశ్ చేస్తే, మరో పాత్రలో ఏ హీరో నటిస్తాడనేది ఆసక్తిని కలిగించే విషయమే. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే మరి.