Aug 1 2021 @ 00:25AM

వెంకటేశ్‌ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు!

‘‘రుస యాక్షన్‌ సినిమాల మధ్యలో ‘చంటి’... ‘అబ్బాయిగారు’ లాంటి కుటుంబకథాచిత్రాల తర్వాత ‘గణేష్‌’ లాంటి సందేశాత్మక యాక్షన్‌ సినిమా... ఇలా వెంకటేశ్‌గారు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు. ప్రతి సినిమాతో నటుడిగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ, ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన చేయని పాత్ర లేదు. ‘నారప్ప’లో క్లోజప్‌ షాట్స్‌లో అద్భుతంగా చేశారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే... ఆయనొక క్లాస్‌ యాక్టర్‌’’ అని అనిల్‌ రావిపూడి ప్రశంసించారు. వెంకటేశ్‌, ప్రియమణి జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మించిన చిత్రం ‘నారప్ప’. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. సినిమాకు అద్భుత స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ‘నారప్ప’ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘ఓటీటీలో వచ్చినా చిత్రాన్ని ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు. కుటుంబంతో కలిసి చూస్తున్నారంతా. ఫోనులు చేసి మరీ అభినందిస్తున్నారు. 


నా కెరీర్‌లో ఎన్నో చిత్రాలు చేశా. ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించా. ‘నారప్ప’లాంటి ఛాలెంజింగ్‌ పాత్రలో సక్సెస్‌ కావడానికి కారణమైన నా టీమ్‌కు థ్యాంక్స్‌. మళ్లీ సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’తో మిమ్మల్ని నవ్విస్తా’’ అన్నారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌ అడ్డాల రష్‌ చూపించినప్పుడే సినిమా నచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌కు 4400 గ్రామాల్లో సబ్‌స్రైబర్లు ఉంటే 4100 గ్రామాల్లో సినిమా చూశారని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అలాగే, 240 దేశాల్లో సినిమాను విడుదల చేస్తే... 180కు పైగా దేశాల్లో చూశారన్నారు. సినిమాకు లభిస్తోన్న స్పందన పట్ల అమెజాన్‌ వాళ్లూ హ్యాపీగా ఉన్నారు’’ అని చెప్పారు. ‘‘ఓటీటీలో సినిమా విడుదలైనా... మారుమూల గ్రామాల్లో ప్రజలు చూడటం చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్‌గారితో పనిచేస్తే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. మా టీమ్‌ సమష్టి కృషి ‘నారప్ప’’ అని శ్రీకాంత్‌ అడ్డాల అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, కార్తీక్‌ రత్నం, ఇతర చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు.