Abn logo
Sep 25 2021 @ 03:12AM

అయ్యర్‌.. నయా సంచలనం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): వెంకటేశ్‌ అయ్యర్‌..ఐపీఎల్‌-2తో ఊహించని విధంగా వెలుగులోకి వచ్చిన నయా బ్యాటింగ్‌ సంచలనం. బోల్ట్‌, బుమ్రా, జేమిసన్‌, చాహల్‌ వంటి మేటి బౌలర్ల బౌలింగ్‌లో అలవోకగా షాట్లు కొట్టిన తీరు బెరుకులేని అతడి బ్యాటింగ్‌కు అద్దం పట్టింది. 26 ఏళ్ల ఈ మఽధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ క్రికెట్‌ ఎంట్రీ ఆసక్తికరం. తండ్రి రాజశేఖర్‌ అయ్యర్‌, తల్లి ఉషా అయ్యర్‌ సహా కుటుంబంలో అంతా ఉన్నత విద్యావంతులే. దాంతో వెంకటేశ్‌ కూడా అదే బాటలో పెద్ద చదువులు చదవాలని తండ్రి ఆకాంక్షించాడు. కానీ వెంకటేశ్‌కేమో క్రికెట్‌ పట్ల అమితాసక్తి. దాంతో తల్లి ప్రోద్బలంతో ఇండోర్‌లో మహారాజా యశ్వంత్‌రావ్‌ క్రికెట్‌ క్లబ్‌కు వెళ్లిన వెంకటేశ్‌..అక్కడ కోచ్‌ దినేశ్‌ శర్మ వద్ద చేరాడు.


సహజసిద్ధ ప్రతిభ, వేగంగా నేర్చుకొనే తత్వం, చేతికి, కంటికి మధ్య అద్భుత సమన్వయం కలిగిన అయ్యర్‌ అనతికాలంలోనే రాటుదేలాడు. తొలుత అండర్‌-16, అండర్‌-23లో అక్కడనుంచి 2018-19 సీజన్‌లో మధ్యప్రదేశ్‌ రంజీ జట్టులో అరంగేట్రం చే శాడు. ఈ సీజన్‌ విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో పంజాబ్‌పై 198 పరుగుల (146 బంతులు)తో సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. అదే మ్యాచ్‌లో తన మీడియం పేస్‌ బౌలింగ్‌తో రెండు వికెట్లు కూడా సాధించడంతో అతడి ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గుర్తించింది. క్రికెట్‌లో రాణిస్తూనే ఏంబీఏ చేయడం ద్వారా తండ్రి కోర్కెను కూడా అయ్యర్‌ నెరవేర్చడం విశేషం.  


దాదా ప్రభావం ఎంతో..:

సౌరవ్‌ గంగూలీకి పెద్ద ఫ్యాన్‌ అయిన తనపై అతడి ప్రభావం ఎంతో ఉందంటాడు వెంకటేశ్‌. క్రీజులోంచి బయటకు వచ్చి అలవోకగా సిక్సర్లు కొట్టడం దాదాను చూసే నేర్చుకున్నానంటాడు. తన కుడిచేతి వాటం బౌలింగ్‌ కూడా గంగూలీలాగానే ఉంటుందన్నాడు. 


రజనీకాంత్‌కు వీరాభిమాని:

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అయ్యర్‌ వీరాభిమాని. ఇప్పటివరకు విడుదలైన రజనీ సినిమాలన్నిటినీ అతడు చూసేశాడట. ఉండేది ఇండోర్‌లోనైనా తలైవా సినిమాలకోసం అప్పుడప్పుడు చెన్నై వెళ్లొస్తుంటాడు. సూపర్‌స్టార్‌ను కలుసుకోవడమే తన జీవితంలో అతిముఖ్యమైన విషయంగా వెంకటేశ్‌ చెబుతాడు.