వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-06T06:35:13+05:30 IST

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అధ్యనోత్సవాలలో భాగంగా పరమపదోత్సవంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌

- వైభవంగా అధ్యయనోత్సవం 

- ఉత్సవ శోభను సంతరించుకున్న వెంకన్న ఆలయం

- స్వామివారిని దర్శించుకున్న మంత్రి గంగుల, మేయర్‌ దంపతులు

 కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 5: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఆలయ పరిధిలోనే ఉత్సవాలు జరుపుతుం డగా తొలిరోజు శుక్రవారం వైభవంగా అధ్యయనోత్సవాలు ఆరంభించి రాత్రి ముగించారు. వేదపండితులు సేనాపతి శేషాచార్యులు, దెబ్బట శ్రీధరాచార్యులు, నమిలకొండ రఘురామాచార్యులు, దెబ్బట రాజారాంమోహన్‌, చెన్నోజ్వల నాగరా జాచార్యుల ద్రవిడప్రబంధపారాయణం మధ్య తొళ్ళక్కము, పారాయణాలు జరిపారు. రాత్రి నమ్మాళ్వార్‌ పరమపదోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబసభ్యులు, మేయర్‌ సునీల్‌రావు దంపతులు అధ్యయనోత్సవంలో పాల్గొని శ్రీవారికి శంగోలం సమర్పించారు. తొలి రోజు ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకుడు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, ఆనువంశిక అర్చకుడు చెన్నోజ్వల నాగరాజాచార్యులు, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవో పీచర కిషన్‌రావు, తాత్కాలిక ఉత్సవకమిటీ బాధ్యులు పాల్గొన్నారు.


 మంత్రి గంగుల ప్రత్యేక పూజలు 


అధ్యయనోత్సవ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఆలయ ఈవో పీచెర కిషన్‌రావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి పూజలు జరిపించారు. మంత్రి, కుటుంబ సభ్యులు శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించగా ఆలయ బాధ్యులు మంత్రితోపాటు కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం అధ్యయనోత్సవ వేదిక వద్ద స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు.  గోగుల ప్రసాద్‌, కేబీశర్మ బృందం ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి అలరించగా బృందాన్ని మంత్రి కండువాలతో సన్మానించి అభినందించారు. మంత్రి రాత్రి ఆలయంలోనే ఉండి ఉత్సవ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించి అక్కడే నిద్రించారు. 


బ్రహ్మోత్సవాల్లో నేడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణము, అంకురార్పణ, అగ్రిప్రతిష్ట, ధ్వజారోహణ, శేషవాహనసేవ, సాయంత్రం దేవతాహ్వానం, హవనాలు, రాత్రి చంద్రప్రభవాహన సేవ జరుగనున్నాయి.





Updated Date - 2021-03-06T06:35:13+05:30 IST