వెంకట్రామిరెడ్డి చిరస్మరనీయుడు

ABN , First Publish Date - 2021-12-03T05:21:57+05:30 IST

ఉన్నత విద్యాశాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన దివంగత బండ్ల వెంకట్రామిరెడ్డి వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రేమను సంపాదించుకుని చిరస్మరణీయులయ్యారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

వెంకట్రామిరెడ్డి చిరస్మరనీయుడు
వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌

(ఆంధ్రజ్యోతి,గద్వాల): ఉన్నత విద్యాశాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన దివంగత బండ్ల వెంకట్రామిరెడ్డి వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రేమను సంపాదించుకుని చిరస్మరణీయులయ్యారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇటీవల గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి బండ్ల వెంకట్రామిరెడ్డి పరమపదించగా.. గత నెల 22న దశదినకర్మ నిర్వహించారు. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.   ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి గురువారం హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గద్వాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాతృమూర్తి రేవతమ్మ, సతీమణి బండ్లజ్యోతిని, ఆయన సోదరులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేసి.. హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. సీఎం పర్యటన మొత్తం షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగానే సాగింది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరగా.. షెడ్యూల్‌ కంటే ఏడు నిమిషాల ముందుగానే 1.23 గంటలకు గద్వాలకు చేరుకున్నారు. సుమారు 1.19 గంటలు గద్వాలలో స్టే చేశారు. తర్వాత 2.42 గంటలకు హైదరాబాద్‌ వెళ్లారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌కర్నూలు ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ వీఎం అబ్రహం, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తదితరులు హాజరై.. వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సీఎం పర్యటనలో హైదరాబాద్‌ నుంచి గద్వాల వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్వర్టులు, క్రాసింగ్‌లు, ప్రధాన చౌరస్తాలు, వంతెనల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రోడ్డుమార్గం ద్వారా రావడంతో రెండు బస్సుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి.. మాట్లాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో మాట్లాడటం కోసమే రోడ్డుమార్గం ద్వారా వచ్చినట్లు చర్చ జరిగింది. పలుచోట్ల అధికారులు సీఎం కేసీఆర్‌ బస్సు ఎక్కడ నిలిపి కిందకు దిగుతాడో తెలియక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, రోడ్లు ఊడ్చడం, మొక్కలు నాటించడం, డివైడర్లకు రంగులు వేయడం వంటి పనులను చేపట్టారు. 

ధాన్యాన్ని పరిశీలించిన సీఎం

కొత్తకోట : సీఎం కేసీఆర్‌ గద్వాల నుంచి బస్సులో హైదారాబాద్‌ తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండల విలియంకొండ తండా స్టేజీ దగ్గర  ధాన్యపు రాశులను పరిశీలిస్తూ దగ్గరలో ఉన్న వేరుశనగ చేనులోకి వెళ్లారు.  చెట్ల నీడన కూర్చున్న రైతులు చేనులో తెల్లబట్టలొల్లు, పోలీసుల గుంపును చూసిన అక్కడికి వచ్చారు. సీఎం కేసీఆర్‌ దండం పెట్టి వారిని పలకరించారు. పంటల దిగుబడి వివరాలు తెలుసున్న తర్వాత తనతో గ్రూప్‌ ఫొటోకు ఆహ్వానించారు.  వేరుశనగ పంటను పరిశీలిస్తున్న సందర్భంగా కొత్తకోటకు చెందిన గాడీల ప్రశాంత్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎంకు పరిచయం చేశారు. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకున్నది ప్రశాంతేనని చెప్పడంతో ఓ సారి ఇటు తీసుకరండని ప్రశాంత్‌ భుజాన్ని తట్టారు. 




Updated Date - 2021-12-03T05:21:57+05:30 IST