May 13 2021 @ 08:50AM

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ 75 ..?

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  వెంకీ నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కోవిడ్ పరిస్థితులు చక్కబడితే థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్ 3' చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 80 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం. ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. కాగా వెంకటేశ్ 75వ సినిమాకు సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల వెంకీ - త్రివిక్రమ్ మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ కోసమే వీరిద్దరు కలిసినట్టు సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత వెంకీ సినిమాకి సంబంధించి ప్రకటన రావచ్చు అంటున్నారు.