అతి తెలివి.. అబద్ధాలు!

ABN , First Publish Date - 2022-01-20T07:05:11+05:30 IST

అతి తెలివి.. అబద్ధాలు!

అతి తెలివి.. అబద్ధాలు!

దగా దాచేయడానికే తంటాలు

ఏడేళ్లనాటి విభజనపై ఇప్పుడు ఏడుపు

కష్టాలున్నా గతంలో 43శాతం ఫిట్‌మెంట్‌

తెలంగాణకంటే ఎక్కువే ఆదాయం

తగ్గింది రాష్ట్ర సొంత సంపాదనే

అది కరోనా లేనప్పుడూ తగ్గింది

అందుకు జగన్‌ విధానాలే కారణం

సలహాదారుల ఖర్చులూ మా ఖాతాలోనా?

ఫిట్‌మెంట్‌కూ, స్కేళ్లకూ తేడా తెలుసా?

అధికారులపై ఉద్యోగుల ధ్వజం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకున్నారు. ఉద్యోగుల కళ్లకు గంతలు కట్టాలనుకున్నారు. అది కుదరకపోయే సరికి... తమ నిర్ణయాలను సమర్థించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో అతితెలివి ప్రదర్శిస్తూ, అబద్ధాలు చెబుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ‘రివర్స్‌ పీఆర్సీ’ని సమర్థించుకుంటూ బుధవారం సీఎస్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినవన్నీ అబద్ధాలే అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆయా అంశాలపై సూటిగా, ఘాటుగా, వ్యంగ్యంగా ‘కౌంటర్లు’ ఇస్తున్నారు. ఇవీ ఆ వివరాలు...

అధికారులు: కొన్ని తగ్గుతాయి, కొన్ని పెరుగుతాయి. వాటిని విడివిడిగా చూడకూడదు. మొత్తంగా చూస్తే... ఎవరికీ అన్యా యం జరగదు.ఉద్యోగులకు జీతం పెరుగుతుందే తప్ప తగ్గదు.

ఉద్యోగులు: ఫిట్‌మెంట్‌ 4 శాతం, హెచ్‌ఆర్‌ఏ 4నుంచి 16 శాతం తగ్గించి... సీసీఏను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కూడా జీతాలు ఎలా పెరుగుతాయి? వేతనాలు పెరిగితే 13లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమిటి? సరే... జీతాలు పెరిగాయంటున్నారు కదా! మాకు ఈ కొత్త జీతాలు వద్దు. పాత జీతాలే ఇచ్చేయండి.

అధికారులు: రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పరిస్థితులు మారిపోయాయి. మనకు ఎంతో నష్టం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి.

ఉద్యోగులు: రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటిపోయింది. నాటి కష్టాలు, నష్టాలను చంద్రబాబు ప్రభుత్వమే ఎక్కువగా భరించింది, ఎదుర్కొంది. అయినప్పటికీ... గత ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పుడు... ఏడేళ్ల తర్వాత మళ్లీ విభజన పేరుతో ఏడుపు ఎందుకు?

అధికారులు: ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఉద్యోగుల వేతన ఖర్చు చాలా ఎక్కువ. ప్రభుత్వ ఆదాయం జీతభత్యాలు, పెన్షన్లకే పోతోంది.

ఉద్యోగులు: ఇదో తప్పుడు వాదన. ప్రభుత్వం తన విధానం, రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసుకుంది. వలంటీర్లను నియమించింది. దీనిని బూచిగా చూపించి... మొత్తం ఉద్యోగుల వేతనాలను తగ్గించాలనుకోవడం సమంజసం కాదు. ప్రభుత్వం ‘అస్మదీయుల’కు విచ్చలవిడిగా సలహాదారు పదవులు కట్టబెట్టింది. లక్షలకు లక్షలు ‘గౌరవ వేతనాలు’ చెల్లిస్తోంది. జగన్‌ సొంత మీడియా సిబ్బందికీ ప్రభుత్వంలో రకరకాల కొలువులు ఇచ్చింది. వీరందరి ఖర్చును ఉద్యోగుల జీతభత్యాల ఖాతాలో రాసేసి... ‘ఎక్కువ... ఎక్కువ’ అంటే ఎలా? 

అధికారులు: కేంద్రం ఎంతో పరిశోధించి,పరిశీలించి పీఆర్సీ నిర్ణయిస్తుంది. రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అమలు చేస్తాం.

ఉద్యోగులు: అసలు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎలాంటి పరిశోధన, పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారో... పీఆర్సీలోని అంశాలపై వారికి ఎలాంటి అవగాహన ఉందో అర్థం కావడంలేదు. వేతనస్కేళ్ల సవరణ, ఫిట్‌మెంట్‌ వేర్వేరు అంశాలు. ఏ రాష్ట్రం కూడా ఫిట్‌మెంట్‌ సంఖ్యతో స్కేళ్లు సవరించదు. ఇలాచేస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ.లక్ష దాటిపోయి ఉండేది. సీఎస్‌ కమిటీ గత పాతికేళ్ల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదా కనీసం తెలంగాణలో వేతన స్కేళ్ల సవరణ ఎలా జరిగిందో తెలుసుకోవాలి.

అధికారులు: ఆర్థిక నిర్వహణలో కుటుంబానికైనా, వ్యక్తికైనా, ప్రభుత్వానికైనా ఒకే విధమైన సవాళ్లు ఉంటాయి. 

ఉద్యోగులు: ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఈ మాటలు చక్కగా చెప్పారు. ఒక శాఖ సారథిగా ఆయన ఈ సూత్రాన్ని నిజంగా పాటిస్తున్నారా? రావత్‌కు జీతభత్యాలు నెలకు రూ.2లక్షలు వచ్చాయనుకుందాం. ఆయన రూ.10 లక్షలు ఖర్చు చేయలేరు కదా!  మీ కుటుంబ ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తున్నారు కదా! మరి... రాష్ట్రం విషయం వచ్చే సరికి ఈ క్రమశిక్షణ ఎందుకు పాటించడంలేదు. దుబారా ఎందుకు అరికట్టడంలేదు? ఒకవైపు సచివాలయం ఉండగానే... విజయవాడలో, గుంటూరులో క్యాంపు కార్యాలయాలు ఎందుకు పెట్టుకున్నారు? ఆర్థిక శాఖకు సచివాలయంలో ఉన్న కార్యాలయం కాకుండా... ఇబ్రహీంపట్నంలో ఒకటి, విజయవాడలో మరొకటి క్యాంప్‌ ఆఫీసులు ఉన్నాయి. మరో గెస్ట్‌హౌ్‌సకూ అద్దె కడుతున్నారు. ఇలా ప్రతి శాఖకు, ప్రతి కార్పొరేషన్‌కు రెండేసి కార్యాలయాలు ఉన్నాయి. ఆయా అధికారులు 2నుంచి 5కార్లు వాడుకుంటున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి కష్టాల కథలు చెప్పిన అధికారులకు ఈ విషయాలు తెలియదా? తప్పుడు లెక్కలు, దొడ్డిదారిలో వేల కోట్ల అప్పులు ఎందుకు తెస్తున్నారు? ఉద్యోగుల వేతన ప్రయోజనాల దగ్గరే ‘పద్ధతి’ కనిపిస్తోందా? ఆర్థిక నిర్వహణ గురించి అంత చక్కటి మాట చెప్పిన రావత్‌... ఆయన సారథ్యంలో తెచ్చిన అప్పులతో రాష్ట్రానికి జరిగిన మేలేమిటో చెప్పగలరా?

అధికారులు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. తెలంగాణతో పోల్చితే మన ఆదాయం తక్కువ.

ఉద్యోగులు: ఇదో తప్పుడు వాదన. అసలు, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏ సంవత్సరంలో తెలంగాణకంటే ఏపీ ఆదాయం తగ్గిందో చెప్పగలరా? గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయం రూ.99,000కోట్లు. ఏపీ ఆదాయం రూ1.17,000కోట్లు. అంటే తెలంగాణ కంటే ఏపీకి రూ.18,000 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. ఈ లెక్కలన్నీ కాగ్‌ చెప్పినవే. అయినా... బీద అరుపులు ఎందుకు? సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలోనే తెలంగాణకంటే ఏపీ వెనుకబడింది. దీనికి కారణం పాలకులు తీసుకునే నిర్ణయాలే. చంద్రబాబు దిగిపోయే నాటికి తెలంగాణ కంటే పన్ను ఆదాయంలో ఏపీ రూ.3,000కోట్ల ముందంజలో ఉంది. ఇప్పుడు... తెలంగాణకంటే రూ.6,000కోట్లు వెనుకబడి ఉంది. దీనికి జగన్‌ సర్కార్‌ వివాదాస్పద నిర్ణయాలే కారణం. జగన్‌ అధికారంలోకి వచ్చీరాగానే లిక్కర్‌ అమ్మకాలపై మాత్రమే దృష్టి పెట్టి మొత్తం రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. ఇసుక దొరక్కుండా చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగానికి కోలుకోలేని దెబ్బతీశారు. ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. అమరావతిని అటకెక్కించడంతో రాజధాని చుట్టూ అల్లుకున్న వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ కొత్త పరిశ్రమలు రాకుండా చేశారు. ఉన్నవాటిని తరిమేశారు. దీంతో రాష్ట్రానికి పన్ను ఆదాయం పడిపోయింది. రాష్ట్ర సంపద పెంచడంలేదు. ఆదాయ మార్గాలు సృష్టించుకోవడంలేదు. చెత్త పన్నులు వేసి, ఆస్తి పన్నులు పెంచి, కరెంటు చార్జీలు బాది, ఓటీఎస్‌ పేరుతో సొమ్ములు ఎంత పిండితే ఖజానా నిండుతుంది? పాపాలు పాలకులవి... శాపాలు మాత్రం ఉద్యోగులు, ప్రజలకా?

అధికారులు: కరోనాతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గింది. ఇప్పుడు ఒమైక్రాన్‌ అంటున్నారు. ఇంకా కష్టాలు వస్తాయి.

ఉద్యోగులు: ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను ఎగ్గొట్టడానికి... కరోనాను సాకుగా వాడుకుంటున్నారు. 2019-20లో కరోనా లేదు. అప్పుడు కూడా ఆదాయం తగ్గింది కదా! ఆర్థిక కష్టాలకు జగన్‌ సర్కారు అవలంబిస్తున్న విధానాలే కారణం. 


Updated Date - 2022-01-20T07:05:11+05:30 IST