సీఎం మార్పు కోసం సోనియాతో సిద్ధూ వర్గం త్వరలో భేటీ!

ABN , First Publish Date - 2021-08-24T23:48:09+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్లు

సీఎం మార్పు కోసం సోనియాతో  సిద్ధూ వర్గం త్వరలో భేటీ!

అమృత్‌సర్ : పంజాబ్ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, వేరొకరిని నియమించాలని నవజోత్ సింగ్ సిద్ధూ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో కెప్టెన్ పట్ల అసమ్మతి విస్తృతంగా ఉందని చెప్తోంది. ఈ వివరాలను పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలియజేయడానికి సమాయత్తమవుతోంది. 


పంజాబ్‌లో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గాన్ని కోరాలని 34 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీరిలో నలుగురు కేబినెట్ మంత్రులు) మంగళవారం నిర్ణయించుకున్నారు. తృప్త్ బజ్వా, ఎస్ఎస్ రణధవా, సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా, చరణ్‌జిత్ చన్నీ, పర్గత్ సింగ్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తొలగించాలని కోరాలని నిర్ణయించారు. 


సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెస్ అధిష్టానవర్గానికిగల ప్రత్యేక అధికారమని చెప్పారు. తమకు కెప్టెన్‌పై నమ్మకం పోయిందన్నారు.  కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. పార్టీ కేడర్‌కు తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈ వివరాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేయడం కోసం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఐదుగురు సభ్యుల బృందానికి బాధ్యతలను అప్పగించారని తెలిపారు. 


ముఖ్యమంత్రిని మార్చకపోతే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని రాష్ట్ర మంత్రి బజ్వా అన్నారు. ఈ విషయాన్ని వివరించేందుకు సోనియా గాంధీని కలిసేందుకు మంగళవారం బయల్దేరుతున్నట్లు తెలిపారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నవజోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా ఆ పార్టీ అధిష్ఠానం జూలైలో నియమించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-08-24T23:48:09+05:30 IST