వేటకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలు కానున్నది. దాదాపు రెండు నెలల విరామం అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి మత్స్యకారులు చేపల వేటకు సన్నద్ధం అవుతున్నారు.

వేటకు సన్నద్ధం

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట పునఃప్రారంభం

బోట్లు, సామగ్రిని సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు

భారంగా మారిన డీజిల్‌ ఖర్చు... లీటరు రూ.99

ఎగుమతులపై కరోనా వైరస్‌,  కర్ఫ్యూ ప్రభావం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలు కానున్నది. దాదాపు రెండు నెలల విరామం అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి మత్స్యకారులు చేపల వేటకు సన్నద్ధం అవుతున్నారు. బోట్లకు మరమ్మతులు చేసుకుని, రంగులు వేస్తున్నారు. వలలు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే నానాటికీ పెరిగిపోతున్న డీజిల్‌ ధరలు మరబోట్ల యజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వల్ల ఎక్కువ సమయం కర్ఫ్యూ విధించడంతో ఎగుమతులు అంతంత మాత్రంగానే వుంటాయని, దీంతో ధరలు గిట్టుబాటు కావని అంటున్నారు.

సముద్రంలోని జీవరాశులు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి రెండు నెలలపాటు చేపటవేటకు కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. చేపల వేట నిషేధంపై విధించిన గడువు ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తుంది. 15వ తేదీ మంగళవారం గంగమ్మకు పూజలు చేసి మత్స్యకారులు వేటకు బయలుదేరతారు. అయితే ఇంతకు ముందులా వారిలో ఉత్సాహం కనిపించడం లేదు. నానాటికీ పెరిగిపోతున్న డీజిల్‌ ధరలు ఒక కారణమైతే, కరోనా ఇబ్బందులు మరో కారణం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డీజిల్‌ ధరలు పెట్రోల్‌తో సమానంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర 99 రూపాయలుగా వుంది. ఒక బోటుకు 1000 లీటర్ల డీజిల్‌ పోయిస్తే లక్ష రూపాయల వ్యయం అవుతుంది. ఐస్‌, వేటకు వెళ్లే సిబ్బందికి నిత్యావసరాల ఖర్చులు దీనికి అదనం. ఒక బోటు వారం రోజులు సముద్రంలో వేటకు వెళ్లి రావాలంటే... రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదే రెండు వారాలైతే పెట్టుబడి రూ.3 లక్షలు. ఈ మొత్తానికి మించిన రొయ్యలు, చేపలు లభ్యమైతేనే బోటు యజమానికి లాభం. లేదంటే నష్టమే. ఈసారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వేట ఎలా ఉంటుందోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం చల్లగా ఉండి, సముద్రంలో చిన్న అలజడి ఉంటే చేపలు పైకి వచ్చి, వలకు చిక్కుతాయి. కానీ  ఎండల తీవ్రత తగ్గినప్పటికీ వర్షాల జాడ లేదు. దీంతో చల్లదనం కోసం చేపలు సముద్రం అడుగుభాగానికి వెళ్లిపోతాయి. వలకు చిక్కవు.  

కరోనా కష్టాలు

చేపల వేటకు వెళ్లడానికి ముందే ట్రాలర్‌ బోట్లకు రిపేర్లు చేయిస్తారు. వేటకు వెళితే వారం పది రోజులు వెనక్కి రావడం ఉండదు కాబట్టి ఏ సమస్య లేకుండా ఇంజన్‌ ఎలా ఉందో చూసుకొని, అవసరమైతే స్పేర్‌పార్టులు వేసుకొని పక్కాగా వెళతారు. ఈ పనులన్నింటికీ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వెచ్చిస్తారు. ఇపుడు కరోనా కారణంగా అన్ని దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అన్ని బోట్లకు ఒకేసారి మరమ్మతులు చేయాల్సి రావడంతో హార్బర్‌ పరిసరాలు సందడిగా ఉన్నాయి. మెకానిక్‌లు త్వరగా పనులు చేయలేకపోతున్నారు. మరోవైపు ఐస్‌ కొరత తీవ్రంగా ఉంది. ఐస్‌ ఫ్యాక్టరీలలో పనిచేసేవారంతా బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు. కరోనా వల్ల వారు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. వారిని రప్పించడం ఆలస్యమైంది. ఐస్‌ ఫ్యాక్టరీలు 24 గంటలూ పనిచేస్తున్నా, తగిన సంఖ్యలో సిబ్బంది లేక డిమాండ్‌కు సరిపడ ఐస్‌ ఉత్పత్తి కావడం లేదు. మరమ్మతులు పూర్తయి, ఐస్‌ దొరికిన బోట్లు మాత్రమే వేటకు సన్నద్ధమవుతున్నాయి. విశాఖపట్నలో 700 మరపడవలు ఉన్నాయి. వీటిలో సగమే  వేటకు వెళ్లే అవకాశం ఉంది. మిగిలినవి వెసులుబాటును బట్టి బయలుదేరతాయి. 

ఇదిలా వుండగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా వుండడంతో రోజులో ఎక్కువ సమయం కర్ఫ్యూ అమల్లో వుంటున్నది. ఇతర ప్రాంతాలకు చేపలు, రొయ్యల ఎగుమతులపై ఈ ప్రభావం పడనున్నది. దీంతో ధరలు తగ్గిపోతాయని, వేట ఖర్చులు కూడా రావేమోనని మరబోట్ల నిర్వాహకులు గుబులు చెందుతున్నారు.


డీజిల్‌ రాయితీ పెంచాలి

పీసీ అప్పారావు, ఏపీ మరబోట్ల సంఘం అధ్యక్షుడు

డీజిల్‌ ధర విపరీతంగా పెరిగిపోతోంది. గతంలో లీటరు రూ.70 వున్నప్పుడు ప్రభుత్వం లీటరుకు రూ.9 రాయితీ ఇచ్చేది. ఇప్పుడు డీజిల్‌ ధర దాదాపు వంద రూపాయలకు చేరింది. అందువల్ల రాయితీని రూ.15లకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST