రావి కొండలరావు పెన్ను మూశారు!

ABN , First Publish Date - 2020-07-29T08:04:48+05:30 IST

తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖ నటుడు, రచయిత, జర్నలిస్టు, కాలమిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. రావికొండలరావు (88) ఇక లేరు!

రావి కొండలరావు పెన్ను మూశారు!

  • అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత
  • 6 దశాబ్దాలకుపైబడి సినీ ప్రస్థానం... నటుడు, రచయిత, జర్నలిస్టు, 
  • కాలమిస్టు, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా బహుముఖ ప్రతిభ
  • పలువురు ప్రముఖుల సంతాపం.. నేడు జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు

ఎర్రగడ్డ/హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖ నటుడు, రచయిత, జర్నలిస్టు, కాలమిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. రావికొండలరావు (88) ఇక లేరు! అలనాటి మేటి నటుల సినిమాల నుంచి.. నేటి యువ నటుల చిత్రాల దాకా ఆరు దశాబ్దాలపాటు వెండితెరపై తనదైన నటనతో అలరించిన విలక్షణ నటుడు మరలిరాని లోకాలకు తరలిపోయారు. బృందావనం, భైరవద్వీపం చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు.. పెళ్లిపుస్తకం లాంటి సూపర్‌హిట్‌ సినిమాకు కథ అందించిన రావి కొండలరావు.. శాశ్వతంగా పెన్ను మూసేశారు!! తెలుగు సినిమా పుట్టిన సంవత్సరం (1932)లో పుట్టి.. తెలుగు సినీ రంగానికి స్వర్ణయుగంగా భావించే సమయంలో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తరానికీ.. ఈ తరానికీ అనుసంధానంగా నిలిచిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు శశికుమార్‌, కోడలు లత, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. కుమారుడు చెన్నైలో నివాసముంటూ ఈమధ్యే హైదరాబాద్‌కు వచ్చారు. రావి కొండలరావు భార్య, ప్రముఖ నటి రాధాకుమారి ఎనిమిదేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. రావి కొండలరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల లోపు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 


శ్రీకాకుళం నుంచి..

1932 ఫిబ్రవరి 11న జన్మించిన రావి కొండలరావు ప్రాథమిక విద్యాభ్యాసమంతా శ్రీకాకుళంలో జరిగింది. చిన్నప్పటి నుంచి ఆయనకు కథారచన, నాటకాలపై ఆసక్తి. చిన్నవయసులోనే ‘బంగారు పాప’ అనే బాలల పక్ష పత్రిక నడిపారు. ఆయన రచనలు ‘బాల’, ‘ఆనందవాణి’ పత్రికల్లో పడ్డాయి. అలాగే యుక్తవయసులో ఆయన కొంతకాలం ఆరెస్సె్‌సలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. 1956లో మద్రాసుకు చేరుకుని ‘ఆనందవాణి’ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. అక్కడ కొంతకాలం పనిచేశాక.. డీవీ నరసరాజు ద్వారా పొన్నలూరి బ్రదర్స్‌ సంస్థవారి కథా విభాగంలో చేరారు. అంతకుముందే ఒక మలయాళ చిత్రానికి డబ్బింగ్‌ కూడా రాశారు. 1958లో ‘శోభ’ సినిమాలో కమలాకర కామేశ్వరరావుకు సహాయకునిగా పనిచేస్తూ.. ఆ సినిమాలో వైద్యుడి పాత్ర పోషించారు. తర్వాత మరికొన్ని సినిమాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు. నర్తనశాల చిత్రానికి కామెడీ ట్రాక్‌ రాశారు. తర్వాత కీలుబొమ్మలు, ప్రేమలో ప్రమాదం, ముగ్గురు వీరులు, గూఢచారి 116, పంతులమ్మ, ఆలీబాబా నలభై దొంగలు, వీరాభిమన్యు.. ఇలా దాదాపు 600 చిత్రాల్లో నటించారు. బంగారు పంజరం సినిమాలో ఆయన నటనకు ఉత్తమ సహాయనటుడుగా నంది పురస్కారం లభించింది. ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి ఉత్త మ కథారచయితగా నంది అవార్డు వచ్చింది. కాలమిస్టుగా ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ పేరుతో వ్యాసాలు రాశారాయన. ఆ వ్యాసాలతో వచ్చిన గ్రంథాన్ని ఉత్తమ సినీ రచన కేటగిరీలో ఆయనకు నంది అవార్డు రావడం విశేషం.  రావి కొండలరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సీపీఐ నేత నారాయణ తదితరులు సంతాపం తెలిపారు. 


బాపు రమణలతో అనుబంధం

సినీ రంగంలో కొన్ని బంధాలు, కొందరి మధ్య అనుబంధాలు అపురూపంగా అనిపిస్తాయి. రావి కొండల రావుకు బాపు, రమణలతో అలాంటి అపురూపమైన అనుబంధమే ఉండేది. ఆ కథేంటంటే.. ‘బాల’ పత్రికలో రావి కొండలరావు రచనలు రెండు ప్రచురితం కావడంతో.. ఆయన ఆ పత్రిక నడిపే రేడియో అన్నయ్య, అక్కయ్య వద్దకు వెళ్లారు. నిక్కరు, చొక్కా వేసుకున్న ఓ కురాడ్రు అదే సమయానికి అక్కడికి వచ్చి.. తాను వేసిన కార్టూన్లు రేడియో అన్నయ్యకు ఇచ్చాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు.. కొంటెబొమ్మల బాపు! అప్పటికే ఆయన కార్టూన్లను చూసి ఉన్న రావి కొండల రావు.. ‘మీరేనా బాపు’ అని అడిగితే.. అవునని చెప్పారాయన. బాపు ద్వారా ముళ్లపూడి వెంకటరమణతో పరిచయమైంది.  అలా అల్లుకున్న బంధం కొన్ని దశాబ్దాల పాటు సాగింది. అయితే.. ఆ బృందంలో తొలుత ముళ్లపూడి, ఆ తర్వాత బాపు వెళ్లిపోయారు! ఇప్పుడు రావి కొండలరావు కూడా తన నేస్తాలను వెతుక్కుంటూ అనంతలోకాలకు తరలిపోయారు!!


విజయచిత్రలో..

ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు వంటి పెద్దల ప్రోత్సాహంతో ‘నాగిరెడ్డి-చక్రపాణి’ జంట దగ్గర ‘విజయచిత్ర’ సినీ మాసపత్రికలో చేరిన ఆయన.. ఆ సంస్థలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. 1966 నుంచి 1992 దాకా ‘విజయచిత్ర’కు సహాయసంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.  కొన్నితరాల పిల్లలకు, పెద్దలకు కథల అమృతాన్ని పంచిన ‘చందమామ’ పత్రిక నిర్వహణలో, కథల ఎంపికలో కీలకపాత్ర పోషించారు. అలా విజయా సంస్థకు అత్యంత అప్తుడుగా, నమ్మకస్తుడిగా ఉన్నందునే.. చందమామ-విజయా కంబైన్స్‌ నిర్మించిన బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి చిత్రాల రచన, నిర్వహణ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పాల్సిందిగా నాగిరెడ్డి సూచించారు. రావి కొండలరావు ఆ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. 


భార్యాభర్తలుగా సినిమాల్లో సెంచరీ

రావి కొండలరావుది ప్రేమవివాహం. ఆయన భార్య రాధాకుమారి విజయనగరంలో నాటకాల్లో నటించేవారు. ఈయన శ్రీకాకుళం నుంచి ట్రూప్‌తో విజయనగరానికి నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఇద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. తర్వాతకాలంలో రాధాకుమారి.. డబ్బింగ్‌ అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా రావి కొండలరావు ఇంట్లోనే అద్దెకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే, అప్పట్లో నాటకాల్లో ఆడవేషాలు ఎక్కువగా మగవారే వేసేవారని.. రాధాకుమారిని పెళ్లి చేసుకుంటే ఆ కొరత తీరుతుందని భావించానని రావి కొండలరావు చెప్పేవారు. వారిద్దరూ.. దాదాపు 112 సినిమాల్లో భార్యాభర్తలుగా పాత్రలు పోషించారు. ‘భార్యాభర్తలుగా ఉంటూ సినిమాల్లో సెంచరీ కొట్టిన జంట మాది’ అని ఆయన చెప్పేవారు. 2012లో ఆమె కన్నుమూశాక ఆయన బాగా కుంగిపోయారు.

Updated Date - 2020-07-29T08:04:48+05:30 IST