ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ కిశోర్ భీమణి ఇకలేరు

ABN , First Publish Date - 2020-10-16T01:16:47+05:30 IST

ప్రముఖ స్పోర్ట్ జర్నలిస్టు, క్రికెట్ కామెంటేటర్ కిశోర్ భీమణి కన్నుమూశారు. 80 ఏళ్ల ఆయన కొద్ది రోజుల...

ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ కిశోర్ భీమణి ఇకలేరు

కోల్‌కతా: ప్రముఖ స్పోర్ట్ జర్నలిస్టు, క్రికెట్ కామెంటేటర్ కిశోర్ భీమణి కన్నుమూశారు. 80 ఏళ్ల ఆయన కొద్ది రోజుల క్రితం మస్తిష్కఘాతానికి (సెరిబ్రల్ ఎటాక్) గురయ్యారనీ.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. భీమణికి ఒక కుమారుడు, భార్య ఉన్నారు. బుల్లితెరకు అత్యంత సుపరిచితులైన ఆయన... 1980ల్లో ప్రఖ్యాత ఆంగ్ల వక్తగా గుర్తింపు పొందారు. భీమణి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్తంగా క్రీడాలోకం నివాళులు అర్పిస్తోంది. ‘‘కిశోర్ భీమణి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. పాత కాలపు రచనా మాధుర్యంతో ఆయన రాసే క్రికెట్ వార్తలు.. ఓ క్రీడాకారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగానే ఉండేవి. ఆయన సతీమణి రీటా, కుమారుడు గౌతమ్‌కు నా ప్రగాఢ సానుభూతి. భగవంతుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ తోడైయుండాలి..’’ అని ప్రముఖ భారత స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ ట్వీట్ చేశారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓ బ్రియన్ స్పందిస్తూ.. ‘‘కిశోర్ భీమణికి వీడ్కోలు. ఆయన క్రికెట్ జర్నలిస్టు మాత్రమే కాదు.. కోల్‌కతాను మనసారా ప్రేమించే వ్యక్తి కూడా..’’ అని పేర్కొన్నారు.


1987లో పాకిస్తాన్‌పై అహ్మదాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డు నెలకొల్పినప్పడు భీమణి కామెంటేటర్‌గా వ్యవహరించారు. ఇమ్రాన్‌ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోల్‌కతా వచ్చినప్పుడల్లా భీమణి ఇంట్లోనే మకాం వేసేవారని చెబుతారు. కోల్‌కతా డైలీ ‘‘ది స్టేట్స్‌మెన్’’లో పని చేసిన భీమణి... మంచి కాలమిస్టుగా గుర్తింపు పొందారు. ఆయన రాసిన ‘‘ది యాక్సిడెంటల్ గాడ్‌మెన్‌’’ పుస్తకం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1978 నుంచి 1980 వరకు కిశోర్ భీమణి కలకత్తా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 

Updated Date - 2020-10-16T01:16:47+05:30 IST