పశువైద్యం.. గందరగోళం

ABN , First Publish Date - 2021-08-27T05:19:30+05:30 IST

ఒక్కో మండలంలో అవసరానికి మించి పశువైద్యశాలలు, మరో మండలంలో కొరత, సిబ్బంది విషయంలో కూడా అంతే... వీటన్నింటిని జిల్లావ్యాప్తంగా శాస్త్రీయంగా మదింపు చేసి అవసరానికి తగ్గట్లు వైద్యశాలలు, సిబ్బందిని సర్దుబాటు చేసి పశువైద్యంలో ప్రమాణాలు మెరుగుపరచడమే ధ్యేయంగా మొత్తం విధానాన్నే హేతుబద్ధంగా విభజిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ సిబ్బందితో పాటు గ్రామీణుల్లో కూడా దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సర్దుబాటు పేరిట కొంతమంది సిబ్బంది అధికారాలకు కత్తెర వేయడంతో పాటు అదనపు భారాన్ని మోపే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయనేది ఉద్యోగుల వాదనగా ఉంది.

పశువైద్యం.. గందరగోళం

పశువైద్యసిబ్బంది సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు

హేతుబద్ధీకరణ పేరిట వైద్యశాలల తగ్గింపుకు యత్నాలు

సచివాలయాల్లోని పశుసహాయకులకు బాధ్యతలు అప్పగించే యోచన

ప్రభుత్వ తీరుపై  సిబ్బంది ఆందోళన

ప్రస్తుతానికి వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం

ఒంగోలు(జడ్పీ), ఆగస్టు 26:

పశువైద్యం గగనంగా మారింది. అసలే పశువైద్య సిబ్బంది లేక సరైన సేవలు అందక వేలాది పశువులు మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం సర్దుబాటు పేరుతో సరికొత్త గందరగోళానికి తెరలేపింది. హేతుబద్ధీకరణ పేరిట గ్రామాల్లో అందుబాటులో ఉన్న వైద్యశాలలను మూసివేసి మూడు, నాలుగు గ్రామాలకు ఒకటే విధంగా ఉంచే యోచన చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామ సచివాలయాల్లో ఉండే పశుసహాయకుల సేవలను ఇకపై వైద్యసేవలలో పూర్తిగా వినియోగించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 300కుపైగా సచివాలయాల్లో ఈ విభాగంలో ఖాళీలున్నాయి. ఈ మొత్తం విధానంపై ప్రతిపాదనలు రెండుమూడు రకాలుగా పంపాలని జిల్లా పశువైద్యశాఖకు ప్రభుత్వం గతంలోనే  ఆదేశాలిచ్చింది. జిల్లాయంత్రాగం అందుకు సంబంధించి నివేదిక కూడా పంపించింది. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ హేతుబద్ధీకరణ అనే తేనెతుట్టెని కదపకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. అయితే దానిని ఎప్పుడైనా ప్రయోగించే ప్రమాదం ఉందని ఆ విభాగం సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

 ఒక్కో మండలంలో అవసరానికి మించి పశువైద్యశాలలు, మరో మండలంలో కొరత, సిబ్బంది విషయంలో కూడా అంతే... వీటన్నింటిని జిల్లావ్యాప్తంగా శాస్త్రీయంగా మదింపు చేసి అవసరానికి తగ్గట్లు వైద్యశాలలు, సిబ్బందిని సర్దుబాటు చేసి పశువైద్యంలో ప్రమాణాలు మెరుగుపరచడమే ధ్యేయంగా మొత్తం విధానాన్నే హేతుబద్ధంగా విభజిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ సిబ్బందితో పాటు గ్రామీణుల్లో కూడా దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సర్దుబాటు పేరిట కొంతమంది సిబ్బంది అధికారాలకు కత్తెర వేయడంతో పాటు అదనపు భారాన్ని మోపే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయనేది ఉద్యోగుల వాదనగా ఉంది. ఒక వేళ ఈ అంశంపై ప్రభుత్వం ముందుకు వెళ్లదలచుకుంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది సాధకబాధకాలతో పాటు అందుకు సంబంధించి ఉన్న అన్ని చిక్కుముడులను పరిష్కరించే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్న మూగజీవాలు

గత ఐదు నెలల వ్యవధిలో అధికారిక లెక్కల ప్రకారమే 750దాకా గేదెలు, ఆవులు వివిధ కారణాలతో మృతిచెందాయి. వీటికి గొర్రెలు, మేకల సంఖ్య అదనం. వీటి సంఖ్య దాదాపుగా 300దాకా ఉండొచ్చని అంచనా. వైద్యుల కొరతతో పాటు క్షేత్రస్థాయిలో పశువైద్యంపై యంత్రాంగం దృష్టిపెట్టకపోవడంతో పశువుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా కాంపౌండర్‌ విభాగంలో 40 ఖాళీలు ఉండగా, ఇతర విభాగాలు అన్ని కలిపి 600పైచిలుకు దాకా పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఖాళీలను భర్తీచేయకుండా ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరిట సిబ్బందిని కుదించడానికి చర్యలు చేపట్టడం పట్ల పశుపోషకులు తప్పుపడుతున్నారు


పశువైద్యం.. ఇదీ విషయం

జిల్లాలో పశువైద్యశాలలు 126 ఉన్నాయి. ఇవి కాక గ్రామీణ ప్రాంతాల్లో 79 ఉండగా ప్రాంతీయ వైద్యశాలలు 27 సేవలందిస్తున్నాయి. ఇప్పుడు హేతుబద్ధీకరణ అమలు జరిగితే వీటిలో దాదాపుగా 50 వైద్యశాలలు కనుమరుగు కానున్నాయి. ఇలా అయ్యేవాటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేవే ఉంటాయి. ఒకవేళ అదే జరిగితే అక్కడ పనిచేసే సిబ్బందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. డిస్పెన్సరీలను కూడా తీసివేసి వాటి స్థానంలో సంచార అంబులెన్సులను ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ ప్రయత్నంగా ఉంది.


ప్రభుత్వ ప్రణాళికలు ఇలా.....

ప్రతి మండలంలో రెండు పశువైద్యశాలలు, రెండు మండలాలకు ఒక ప్రాంతీయ పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేయడం తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని అవసరాన్ని బట్టి ఉంచి మిగతా వాటిని తొలగించడం ఒక ప్రతిపాదనగా ఉంది. సహాయ సంచాలకులున్న మండలంలో అదనంగా పశువైద్య ఆసుపత్రులను ఏర్పాటు చేయడం వారు లేని మండలంలో మూడు వైద్యశాలలు ఉండేలా చర్యలు తీసుకోవడం లాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి.


సిబ్బంది సర్దుబాటే కీలకం

హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ముందుకెళ్లే పక్షంలో సిబ్బంది సర్దుబాటే క్లిష్టతరంగా మారనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పశువైద్యశాలలు చాలా వరకు మూతపడే ప్రమాదం ఉంది. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఏ ఊరిలో వైద్యశాల ఉంచాలి తీసేయాలి అనేది పారదర్శకంగా జరిగితే ఫర్వాలేదు కానీ రాజకీయ సిఫార్సులతో అవి జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. విస్తీర్ణం పరంగానే కాకుండా గతంలో అక్కడ పశువులకు వైద్యాన్ని అందించిన గణాంకాలను కూడా ప్రామాణికంగా తీసుకుని వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానితో పాటు ఆయా మండలాల్లో పశుపోషణపై ఆధారపడిన వారు సంఖ్యను బట్టి కూడా ఈ హేతుబద్ధీకరణ చేపట్టాల్సి ఉంటుంది. మండలంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ పశుపోషకులు సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే అక్కడ తగ్గించినా ఫర్వాలేదు. మండలంలో తక్కువ జనాభా ఉన్నప్పటికీ పాడిపరిశ్రమపై ఆధారపడినవారు అధికంగా ఉంటే అక్కడ సిబ్బందితో పాటు వైద్యశాలలను కూడా అధికంగా కొనసాగించాల్సి ఉంటుంది. సిబ్బంది దగ్గర నుంచి వైద్యశాలల సర్దుబాటు వరకు అన్నీ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం హేతుబద్ధీకరణపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం


మూడురకాల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచాం:

హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం అడిగిన విధంగా మూడు రకాల ప్రతిపాదనలను పంపాం. వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్‌. పశువైద్య సేవల్లో ఇంతకు ముందున్న ప్రమాణాలను మెరుగుపరచడమే దీని ఉద్దేశం. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవు. ఈ విధానం మొత్తాన్ని అధ్యయనం చేసిన ప్రభుత్వం మేలు ఉంటేనే ముందుకెళ్లాలని లేనిపక్షంలో కొంత వ్యవధి తీసుకుని అయినా సరే శాస్త్రీయంగా పరిశీలన చేసిన తర్వాతనే తుదినిర్ణయం తీసుకునే ఆలోచనలో  ఉంది

-బేబీరాణి, పశుసంవర్థకశాఖ జేడీ

Updated Date - 2021-08-27T05:19:30+05:30 IST