ప్చ్‌.. ఏం చేద్దాం!

ABN , First Publish Date - 2021-04-28T06:28:59+05:30 IST

‘దుర్గమ్మ సాక్షిగా భారీ దోపిడీకి స్కెచ్‌’ శీర్షికతో..

ప్చ్‌.. ఏం చేద్దాం!

సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటరుకిచ్చే అంశంపై తర్జన భర్జనలు

ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ కథనం


ఆంధ్రజ్యోతి-విజయవాడ: ‘దుర్గమ్మ సాక్షిగా భారీ దోపిడీకి స్కెచ్‌’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టిస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక దుర్గగుడి ఉన్నతాధికారులు తలలు పట్టుకుని తర్జన భర్జనలు పడుతున్నారు. 


దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి కోసం నిర్మించిన సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను 2 నెలలపాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చేసి కరోనా బాధితులకు వైద్యసదుపాయాల పేరుతో రూ.కోట్లు దండుకునేందుకు పక్కా ప్రణాళికతో శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరిజైన్‌ స్వేతాంబర్‌ ట్రస్టు నిర్వాహకులు దుర్గగుడి ఈవోకు అర్జీ పెట్టుకోగానే ఈవో వెంటనే దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఈవో నుంచి లేఖ అందడమే ఆలస్యం.. ఆలయానికి చెందిన రూ.కోట్ల విలువైన సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను సదరు ప్రైవేటు ట్రస్టుకు ఉచితంగా ఇవ్వాలంటూ కమిషనర్‌ ఆగమేఘాలపై ఉత్తర్వులివ్వటం వెనుక మంత్రి నడిపిన గూడుపుఠాణి గురించి ‘ఆంధ్రజ్యోతి’ కథనం ద్వారా తెలుసుకున్న ఉద్యోగులు, సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి సిఫార్సు చేసినా ఈవో, దేవదాయశాఖ కమిషనర్‌ వెనకా ముందూ ఆలోచించకుండా చకచకా నిర్ణయాలు తీసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ట్రస్టు సేవాభావం ఇదేనా? 

విజయవాడ వన్‌టౌన్‌లోని శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరి జైన్‌ శ్వేతాంబర్‌ ట్రస్టు పూర్తి సేవా భావంతో పనిచేసే సంస్థ అని, 40 ఏళ్లుగా ప్రజలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న తమ సంస్థ ప్రస్తుతం కరోనా బాధితులకు స్వచ్ఛందంగా సేవలందించాలనే మంచి ఉద్దేశంతోనే సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్టు కార్యదర్శి కాంతిలాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సి.వి.రెడ్డి ఛారిటీస్‌ను ఉచితంగా తీసుకుని.. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఒక్కొక్క కరోనా బాధితుడి నుంచి రూ.3వేలు చొప్పున వసూలు చేయడాన్ని స్వచ్ఛంద సేవ అంటారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


విజయవాడలోని అనేక హోటళ్లలో బాధితులకు రోజుకు రూ. 3 వేలకు బెడ్‌, ఫుడ్‌, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని, శ్రీ సంభవ్‌నాథ్‌ రాజేంద్రసూరి జైన్‌ శ్వేతాంబర్‌ ట్రస్టు కూడా అంతే మొత్తాన్ని వసూలు చేస్తామని చెబుతున్నప్పుడు.. వారిది కూడా వ్యాపారమే అవుతుంది తప్ప.. సేవాభావం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే ట్రస్టు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ వద్దనున్న ఒక హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్వహించారు. సేవ పేరుతో 2నెలల కాలంలో రూ. 9కోట్లకు పైగా వసూలు చేసుకుంటామని ట్రస్టు నిర్వాహకులే చెబుతున్నపుడు స్వచ్ఛంద సేవ ఎలా అవుతుందనేది ఇంద్రకీలాద్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


ఉద్యోగుల ప్రాణాలు గాలికొదిలేస్తారా? 

ఇంద్రకీలాద్రిపై నెల రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఎంతోమంది ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడ్డారు. కొంతమంది ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. లక్షలు చెల్లిస్తూ చికిత్స పొందుతున్నారు. వీరికి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద బిల్లులు మంజూరు చేయడం లేదని, ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు రూ. 15వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో దేవస్థానం ఆధ్వర్యంలోనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలందించే చర్యలు తీసుకుంటే అందరూ ఎంతో సంతోషించేవారమని అభిప్రాయపడుతున్నారు.


కానీ తమ ఉద్యోగులు, సిబ్బందికి కేవలం 5బెడ్స్‌ మాత్రమే ఉచితంగా కేటాయిస్తామని షరతు విధించడం, ఉన్నతాధికారులు ఓకే చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, దేవదాయశాఖ కమిషనర్‌ పునరాలోచించి సి.వి.రెడ్డి ఛారిటీ్‌సలో దేవస్థానం తరపున కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి కరోనా బారినపడిన ఉద్యోగులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు, పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-04-28T06:28:59+05:30 IST