అధికార పార్టీలో ప్రకంపనలు

ABN , First Publish Date - 2020-04-03T16:41:07+05:30 IST

ఎలమంచిలి నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారం అధికార పార్టీలో..

అధికార పార్టీలో ప్రకంపనలు

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఎలమంచిలి అన‘కొండ’లు ఉలికిపాటు

సమాచారాన్ని ఎవరు బయటపెట్టారంటూ వైసీపీ నేతల ఆరా

రెవెన్యూ, మైనింగ్‌ అధికారులపై ఆగ్రహం

సమాచారం ఎందుకిచ్చారంటూ ఫోన్‌లోనే శివాలు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాల వ్యవహారం  అధికార పార్టీలో కలకలం రేపింది. ‘అధికార పార్టీలో అనకొండలు’ శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఎలమంచిలి నేతలు రంగంలోకి దిగారు. మారుమూల ప్రాంతం నడింపల్లిలో గ్రావెల్‌ తవ్వుతున్న వ్యవహారం బయటకు ఎలా తెలిసింది? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. గ్రామస్థులకు కొందరు నేతలు ఫోన్లు చేసి గ్రావెల్‌ తవ్వకాల వివరాల కోసం వచ్చిన వారెవరని ఆరా తీశారు. పంచాయతీ అధికారులతోపాటు తహసీల్దారు కార్యాలయానికి పార్టీ ముఖ్యులు ఫోన్‌చేసి, వివరాలు ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది.


ముఖ్యనేత ఒకరు ఫోన్‌లోనే అధికారులపై చిందులు వేయడంతో వారంతా కంగారుపడ్డారు. కాగా నడింపల్లి గ్రామంలో గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన వ్యక్తులు, మైనింగ్‌ అధికారుల నుంచి తప్పించుకునేందుకు అక్కడ మట్టి కప్పేసిన విషయాన్ని గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఎంత గ్రావెల్‌ తవ్వారు అనే విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొన్నిచోట్ల మట్టితో కప్పేశారని చెబుతున్నారు. 


గ్రామాల్లో విపక్షం లేకుండానే..

అచ్యుతాపురం మండలం నునపర్తి పంచాయతీనడింపల్లిలో గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డుచెప్పకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. కొద్ది నెలల క్రితమే విపక్షానికి చెందిన నాయకులను ప్రలోభపెట్టి, బెదిరించి అధికార పార్టీలో చేర్చుకున్నారు. స్థానిక సంస్థల పదవులు ఇస్తామని చెప్పారు. వెరసి తవ్వకాలకు ఇబ్బంది లేకుండా డి.పట్టా రైతులను ఒప్పించే బాధ్యత విపక్షానికి చెందిన నేతలకు అప్పగించారు. దీంతో గ్రావెల్‌ తవ్వకాలకు అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు.


అధికార పార్టీ దోపిడీ అరికట్టాలి: ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ నేత, ఎలమంచిలి

ఎలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేదు. దొరికిన చోట దొరికినంత యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలే కాకుండా కొండలను కొల్లగొడుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో అధికార పార్టీ నేతలు చేపట్టిన క్వారీలపై ఏసీబీ విచారణ చేపట్టాలి. 


క్వారీ చేస్తున్న భూమి రైతులకు ఇవ్వాలి: సుందరపు విజయకుమార్‌, జనసేన

నడింపల్లిలో గ్రావెల్‌ తవ్వకాల కోసం రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి వారికి ఇచ్చే యాలి. రెండు నెలల నుంచి తవ్విన గ్రావెల్‌ వివరాలను మైనింగ్‌ విభాగం బయటపెట్టాలి. ఎలమంచిలి నియోజక వర్గంలో పలుచోట్ల అధికార పార్టీ నేతలు చేపడుతున్న గ్రావెల్‌ క్వారీలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ జరిపించాలి.

Updated Date - 2020-04-03T16:41:07+05:30 IST