హేమంతవేళ
సీమంతపు పడతి వోలె
ధాన్యరాశులను మోస్తున్న
నిండుగర్భాల లోగిళ్ళలో
రమణులంతా అలవోకగా
హరివిల్లును ఇలపై నిలపగా
పాత కష్టాలు బూడిదై
భవిత విరబూయాలని
చాటునున్న సామగ్రికి
రెక్కలు రాగా భోగిమంటలై
ఇలను అలరించెనుగా!
ఆశలవిహారం చేసినా
హద్దుల దారం వీడొద్దనే
పతంగాలు
బాలారిష్టాలు తొలగాలనే
భోగిపళ్ళు
తెలియని గాధలు తెలిపే
బొమ్మలకొలువులు
రేగిపండ్ల వడ్డాణం చుట్టుకొన్న
గొబ్బిదేవతలతో
అందరి లోగిళ్ళు
సరదాల సందళ్ళు కాగా
మకరరాశి ముదిత
భానునికి కన్ను గీటగా
సంబరాల సంక్రాంతి వచ్చింది
ఊరూవాడా పులకించింది...
వేమూరి శ్రీనివాస్