కరోనా సమయంలో జీవితం గురించి లోతైన ఆలోచనలు.. ఉపరాష్ట్రపతి మనోగతం

ABN , First Publish Date - 2020-07-12T18:35:12+05:30 IST

జీవితం అంటే అనుభవాల మార్గనిర్దేశకత్వంలో ముందుకు సాగే వివిధ దశల క్రమం. జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడం, తదనుగుణంగా అవసరమైన మార్పులతో లక్ష్యాలను ఏర్పరుచుకోవడం,

కరోనా సమయంలో జీవితం గురించి లోతైన ఆలోచనలు.. ఉపరాష్ట్రపతి మనోగతం

జీవితం అంటే అనుభవాల మార్గనిర్దేశకత్వంలో ముందుకు సాగే వివిధ దశల క్రమం. జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడం, తదనుగుణంగా అవసరమైన మార్పులతో లక్ష్యాలను ఏర్పరుచుకోవడం, తదనుగుణంగా జీవితాన్ని ముందుకు సాగించటం ప్రధానం. ఒక ఆంగ్లసామెత చెప్పినట్లు బి (బర్త్-జననం) నుంచి డి (డెత్-మరణం) వరకూ సాగే ప్రయాణమే జీవితం. మధ్యలో సి (చాయిసెస్-ఎంపికలు) జీవితాన్ని అర్థవంతగా మార్చటంలో సహాయపడుతుంది.


ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ చెప్పినట్లు, “పరీక్షలు ఎదుర్కోని జీవితం, విలువైన జీవితం కాదు”. నిజానికి అన్ని అంశాల్లో, అన్ని సందర్భాల్లో పరిపూర్ణమైన ఉన్నత జీవనం దిశగా మన పయనాన్ని నిరంతం బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ, దీని కోసం మనం మన జీవితాన్ని ఎంత మేర పరిశీలించామనే ప్రశ్నకు మాత్రం మన దగ్గర సమాధానం లేదు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో మనకు అలాంటి అవకాశం ఇప్పుడు దొరికింది.


ఆధునిక జీవితం నల్లేరు మీద నడకలా ఓ ఉన్నతమైన మార్గంలో వేగంగా ముందుకు దూసుకు వెళుతోంది అని భ్రమ పడుతున్న సమయంలో, మన జీవితంలోకి కనిపించకుండా కరోనా వైరస్ ప్రవేశించింది. నాలుగు నెలల క్రితం ఒక్క సారిగా జీవితాన్ని “పాజ్” (విరామం) బటన్ నొక్కి హఠాత్తుగా ఆపేసి, మనం అలవాటు పడిన జీవన వేగానికి “రీసెట్” బటన్ ద్వారా పునఃప్రారంభాన్ని చూపించి, మళ్ళీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత వెంటనే భవిష్యత్ దిశగా జీవితాన్ని సిద్ధం చేయాల్సిన అవసరాన్ని కల్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదో సంధి కాలం. ఒక్కసారిగా ఆగి జీవితాన్ని బేరీజు వేసుకుని మళ్లీ ముందు సాగబోతున్నాం. ఈ సమయంలో మనం ఏం నేర్చుకున్నాం? కరోనా సమయంలో జీవితం గురించి సాగిన లోతైన ఆలోచలు, అనుభవాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి.


కరోనా వ్యాప్తి అనేది విపత్తా? లేదంటే దిద్దుబాటా? లేదంటే ఇది చాలా కాలం పాటు మనం కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా చేస్తున్న పొరపాట్లకు ప్రతీకారమా? అయితే మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటి? వాటిని సరిదిద్దుకునేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లాక్ డౌన్ సమయంలో మన మదిలో ఉద్భవించటం ఎంత వాస్తవమో, భవిష్యత్తులో ఇలాంటి వాటికి మనం సిద్ధంగా ఉండాలనే అంశాన్ని తోసిపుచ్చలేమన్నది అంతే వాస్తవం.


ప్రకృతి మరియు సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో సాగే ఆటే జీవితం. జీవితాన్ని తప్పని సరిగా జీవించి తీరాల్సిన పరిస్థితుల్లో మనం అనేక పాత్రలు పోషించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులుగా, భవిష్యత్ జీవితానికి సిద్ధమౌతున్న యువతగా, కుటుంబానికి కేంద్ర బిందువుగా మరియు సామాజిక సంబంధాల అనుసంధానకర్తలుగా వ్యవహరించే వారి మీదే నాణ్యత మరియు మన్నిక ఆధారపడి ఉంటుంది. విస్తృత సామాజిక ఒప్పందాలు, యజమానులు, ఉద్యోగులు, ప్రపంచ పౌరులు అన్నింటికి మించి ప్రకృతిని, సంస్కృతిని కాపాడుకునే దిశగా ముందుకు సాగే జ్ఞానులు వారు.

గత కొన్ని నెలలుగా వైరస్ అదృశ్య హస్తం మన మీద రుద్దిన ఈ బలవంతపు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్న క్రమంలో ఈ పాత్రలకు సంబంధించిన నిబంధనలకు మనం ఏ విధంగా సంసిద్ధతను వ్యక్తం చేస్తామనే అంశాలను ఈ క్రింది ప్రశ్నలు, వివరణల ద్వారా పరీక్షించుకుందాం.


1. కోవిడ్-19 మహమ్మారి మూల కారణాలను మీరు గ్రహించారా?


అవసరమైతే, ఇకపై మార్పులతో కూడిన జీవనాన్ని గడిపేందుకు ఈ విషయాన్ని తెలుసుకోవటం అత్యంత ఆవశ్యకం. జీవితంలో భౌతిక అభివృద్ధి కోసం పరుగులు తీసే తపనలో ప్రకృతి, సంస్కృతి, సేవా విలువలు, నీతితో సమతుల్యంగా జీవించడం లాంటి కనీస జీవన సూత్రాలను గౌరవించటం మర్చిపోయాము. ధరిత్రిని మనం పట్టించుకోనప్పుడు, ధరిత్రి మనల్ని ఎందుకు పట్టించుకుంటుంది. ఈ ధరిత్రి కేవలం మనుషుల కోసమే ఉన్నట్లుగా, దీనికి మానవుడే సర్వం సహా అధిపతి అయినట్లుగా మనిషి ప్రవర్తన సహజ సమతుల్యతను కలవరపాటుకు గురిచేసింది. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా?


2. కరోనాకు ముందు గడిపిన జీవన విధానంలో మార్పులు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?


అధునిక జీవితం అన్ని సమయాల్లో ఉన్నతమైన మార్గంలో వేగంగా ముందుకు సాగే పరిస్థితి లేదు. దాని స్వభావం, మార్గం, గమనాన్ని తిరిగి సమీక్షించుకోవలసిన అవసరం వచ్చింది. ఆన్ లైన్ జీవితం మీద మాత్రమే ఆధారపడితే, మిగతా జీవితం ఆఫ్ లైన్ కాగలదు. మన జీవితానికి సంపదే సర్వస్వం కాదనే విషయమే కోవిడ్ మనకు నేర్పించిన పాఠం. మన ప్రాధాన్యత ఏమిటనే విషయాన్ని గుర్తించే క్రమంలో, సంపద కంటే ముందు ప్రాధాన్యత ఆరోగ్యానికే అనే విషయం తెరమీదకు వచ్చింది. ఉదాహరణకు మనం తీసుకునే ఆహారాన్ని ఆరోగ్యాన్ని నిలబెట్టే ఔషధంగా చూడాలే తప్ప కేవలం ఆనందాన్ని ఇచ్చే పదార్థంగా చూడకూడదు. చైతన్య రహితమైన జీవితం మనిషికి ప్రధాన శత్రువు. మీరు క్రమంగా దీన్ని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?


3. మీరు జీవితం యొక్క ఉద్దేశం, అర్థాన్ని పునర్నిర్వచిస్తారా?


మంచి చదువు, మంచి ఉద్యోగం, ఉద్యోగం చేసే జీవిత భాగస్వామి, కాన్వెంట్ కు వెళ్ళే పిల్లలు, సుఖవంతమైన జీవితం... ఇలాంటివే పూర్తిగా అర్థవంతమైన జీవితమని చెప్పలేము. జీవితం వీటన్నింటికీ మించినది. అందరితో పంచుకోవటం, అందరి పట్ల శ్రద్ధ వహించటం, ప్రేమాభిమానాలు అందరికి పంచడం, ఇతరుల జీవితాలను అదరించటం వంటి అనేక ఇతర సూత్రాల ఆధారంగా ఉన్నతమైన అనుభవాల సమ్మేళనంగా జీవితం ఉండాలి. సంఘ జీవిగా మన భవిష్యత్తు, మనతో కలిసి జీవించే వారందరి సమిష్టి పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. కరోనా కాలంలో ఈ విషయాన్ని మీరు గ్రహించారా?


4. జీవితంలో మీ పాత్రను పోషించటంలో అంతరాలను మీరు గుర్తించారా?


ఆధునిక జీవితం ఒక ఒంటరి ప్రయాణం లాంటిది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఒంటరితనం, స్వీయ నియంత్రణ తప్పనిసరి. లాక్ డౌన్ సమయంలో మీ తల్లిదండ్రులు, దూరంగా నివసిస్తున్న మీ తాతయ్య, బామ్మల కు మీరు ఎంత తరచుగా దగ్గరయ్యారు? మీ గ్రామంలోని మిత్రులు, పాఠశాలలోని మిత్రులు, అవసరమైన క్షణంలో మీకు అండగా నిలిచిన వారి గురించి మీరు ఆలోచించారా? మీ పిల్లల మనసుల గురించి, అదే విధంగా వారు పెరిగే కొద్దీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీకు ఎంత మేర తెలుసు? మీ పాత సహచరులను పలకరించారా? స్వీయ నిర్బంధ కాలంలో వారు మీతో ఎక్కువ కాలం గడిపిన సమయంలో మీరు ఏ సలహాలు అందించారు? ఈ విషయాలన్నీ బేరీజు వేసుకుని చూస్తే మీరు సంతృప్తిగా ఉన్నారా?


5. కరోనా అనుభవాల ద్వారా మరిన్ని సమస్యలను ఎదుర్కొనేందుకు కూడా మీరు సన్నద్ధమయ్యారా?


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎదురైన అనిశ్చిత పరిస్థితికి అవసరమైన ప్రవర్తనా మార్పులు, ఆలోచనల పరంపరలు చాలా మందిలో ఆందోళన మరియు నిరాశకు దారి తీశాయి. శరీరం, మనస్సు, డబ్బు మరియు వృత్తి నిర్వహణలో ఆందోళనల కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ధ్యానం, యోగ, శారీరక వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు, భౌతిక దూరం పాటిస్తూనే మానసికంగా దగ్గర కావడం లాంటి అనేక సద్గుణాలు తెర మీదకు వచ్చాయి. వర్షాకాలానికి ఎలా సన్నద్ధం అవుతామో, ఇలాంటి జీవితానికి కూడా అదే విధంగా సన్నద్ధం కావలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత అనుభవాల దృష్ట్యా ఈ మార్గంలో మిమ్మల్ని తగినంతగా మీరు సిద్ధం చేసుకోవటంతో పాటు తగినంత విశ్వాసం పొందారా?


6.మీరు జీవితంలో ధర్మానికి కట్టుబడ్డారా?


జీవన కొలమానానికి ప్రాథమిక సూత్రం యుక్తాయుక్త విచక్షణతో కూడిన ధర్మం యొక్క అవగాహన, అభ్యాసం మరియు ఆచరణ. ఇటువంటి జీవన సూత్రాలను జ్ఞానులు, రుషులు, సాధువులు, గురువులు క్రోడీకరించారు. వీటిని మన సమాజంలోని వివిధ సంస్కృతులు కాలక్రమేణా వారసత్వంగా స్వీకరించాయి. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా "జీవన పరమార్ధం సరైన, ధర్మబద్ధమైన మరియు అర్ధవంతమైన జీవితం గడపడం". గాంధీజీ మాటల్లో "సక్రమంగా నీతిగా ఆలోచించి నీతిబద్ధంగా, చిత్తశుద్ధితో ఆచరించి, రేపే ఈ జీవితానికి అంతం అనుకొని లేదా నువ్వు ఎంతో కాలం జీవించవు అనుకొని ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని నిర్వచించుకోవాలి". చట్టబద్ధమైన సమకాలీన మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ మూల సిద్ధాంతాల్లో మార్పు రాదు. ఈ సూత్రాలను రోజువారి జీవితంలో మన ఆలోచనలు మరియు చర్యలకు మార్గనిర్దేశం చేసే మన అసంకల్పిత చర్యలకు అన్వయించుకోవాలి. ఇలాంటి అన్వయాలు ప్రతికూల సమయాల్లో జీవించే దిశగా సందర్భోచితమైన మార్గనిర్దేశం చేస్తాయి. అవసరమైనప్పుడు మీరు వాటిని తిరిగి గుర్తుచేసుకున్నారా? మార్గదర్శకత్వం కోసం మీరు ఎవరైనా గురువులను, పెద్దలను సంప్రదించారా?


7. జీవితం యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవటం నేర్చుకున్నారా?


స్వామి వివేకానంద చెప్పినట్లుగా "మన ఆలోచనలలే మనల్ని తయారు చేస్తాయి. కావున మీరు మీ ఆలోచనలను సక్రమంగా మలచుకోవాలి తద్వారా సరైన మార్గంలో పయనించాలి". ప్రస్తుతం మహమ్మారికి మూల కారణాన్ని ఎవరైనా గ్రహించగలిగితే, భౌతిక సుఖాల కంటే జీవితం మరింత గొప్పది అనే విషయం అవగతమౌతుంది. ఇది ఒకదానికొకటి మరో జీవన మార్గం దిశగా తీసుకువెళుతుంది. ఇది మరింత ముఖ్యమైనదే గాక, ఇది అంతరాళం నుంచి వికాసాన్ని కాంక్షిస్తుంది. అంతరాళంలో ఉన్న కాంతి రూపం ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. జీవితం యొక్క ఆధ్యాత్మిక కోణం ఇదే. ఆ అవసరాన్ని మీరు గ్రహించి, దాన్ని హృదయాంతరాళాల నుంచి మీరు ఆస్వాదించారా?


8. స్వీయ నియంత్రణ సందర్భంగా గడిపిన జీవితంలో మీరు కోల్పోయిందేమిటో గుర్తించారా?


ఇక్కణ్నుంచి జీవితాన్ని నిర్వచించేందుకు ఇది అత్యంత కీలకం. ప్రతి ప్రతికూలత మనలో ప్రతిబింబించాల్సిన మరియు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరాన్ని తెలియజేసే అద్దం వంటిది. ప్రతికూలతలోనే మన బాధ్యత ఎంత, సమస్యాత్మక సమయాల్లో ఏం కోల్పోయామో గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇది స్వేచ్ఛా ఉద్యమం, సామాజిక లోటు, సరిపోని భావోద్వేగ సాధన, కీలకమైన సందర్భంలో ఒకరి పాత్రను పోషించటంలో లోపాలు, అవసరమైన మద్ధతు లభించకపోవటం లాంటివి ఏవైనా కావచ్చు. ఈ కారణాలతో పాటు మనం కోల్పోయిన వాటిని గుర్తించటం భవిష్యత్తుకు సహాయపడుతుంది. కరోనా కాలంలో మీరు దీనికి సంబంధించిన కసరత్తు చేశారా?


9. మనం సమానంగాను, అసమానంగాను ఉన్నామని మీరు గ్రహించారా?


మనం సమానంగానే పుట్టాము. కానీ కాలగమనంలో అసమానం చోటు చేసుకుంటుంది. కరోనా అన్నింటి మీద ప్రభావం చూపింది. ఇది స్పష్టమైన కారణాల వల్ల సమాజంలోని కొన్ని వర్గాల బలహీనతలను బహిర్గతం చేసింది. ఈ వైవిధ్యమైన దుర్బలత్వం ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఇవి అందరికీ వర్తించేవి. వీటిని తగినంత మేర పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మీ జీవన విధానం ఇతరుల దుర్బలత్వానికి కారణం కావచ్చు. ఈ కారణాలతో పాటు ఈ సమస్య ప్రభావాలను మీరు గ్రహించటంతో పాటు వారికి సహాయం అందించి వారితో సహానుభూతి పొందారా?


10. ఈ మహమ్మారిని విపత్తుగా పరిగణించాలా? లేదంటే దిద్దుబాటుగా చూడాలా?


కోవిడ్ -19 మహమ్మారి గురించి ఆయా వ్యక్తుల వ్యక్తిగత అవగాహన వారి వ్యక్తిత్వం, విలువల వ్యవస్థ, దృక్పథం, మనస్సు యొక్క స్థితి, అలాగే ఈ దశలో జీవితం ఉన్న స్థాయికి అద్దం పడతాయి. అంతే కాకుండా ఈ మహమ్మారి కాలంలో సాగిన జీవనం ఆయా వ్యక్తులు గతం నుంచి ఎంత మేర నేర్చుకున్నారనే అంశానికి అద్దం పడుతుంది. ఆయా వ్యక్తుల తప్పిదాల కారణంగా దీన్ని ఓ విపత్తుగా పరిగణించటం సరైనది కాకపోవచ్చు. దీన్ని ఓ దిద్దుబాటుగా చూడాల్సి ఉంది. ఈ తరహా ఆలోచన భవిష్యత్తు సవాళ్ళ దిశగా మనల్ని సిద్ధం చేస్తుంది. మన జీవితాలను మార్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను నిరోధించవచ్చు కూడా. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు?


పైన 10 అంశాల్లో లేవనెత్తిన సమస్యలు, వివరణలు అందరికీ వర్తిస్తాయి. అయితే స్వీయ అంచనా కోసం కొందరికి ఇవి మరికొంత ఎక్కువ ఉండవచ్చు. ఒకరి జీవితాన్ని తిరిగి సంసిద్ధత దిశగా తీసుకువెళ్ళడానికి, అదే విధంగా ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అలాంటి మరో ప్రతికూలతను ఎదుర్కోవటానికి, ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడో, ఎంత సంసిద్ధతతో ఉన్నాడో తెలుసుకోవడానికి ఇలాంటి అంచనా విస్తృతంగా సహాయపడుతుంది.


తరచి చూస్తే ఇందులోని సానుకూల కోణం కూడా మనకు అవగతమౌతుంది. ఏకాంతంలోనే మన ఆలోచనలకు పదును పెట్టి మంచి ఉత్తమమైన వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చే విధంగా సిద్ధం కాగలం. ప్రపంచాన్ని దూరం నుంచి చూసినప్పుడే సరైన విధానంలో గమనించి, సంపూర్ణంగా ఆర్థం చేసుకోవడం సాధ్యమౌతుంది.

సి.ఎస్. లూయిస్ చెప్పినట్లు ఒకరు గతంలోకి వెళ్ళి ప్రారంభాన్ని మార్చడం సాధ్యం కాదు గానీ, మీరు ఉన్న చోటనే నిలబడి ముగింపును మాత్రం మార్చగలరు. ఐన్ స్టీన్ చెప్పినట్లు జీవితం ఒక సైకిల్ లాంటిది. మీరు మీ సమతుల్యతను కాపాడుకోవడానికి, మీరు కదులుతూనే ఉండాలి. జీవితంతో కలిసి కదులుతూనే ఉండాలి. భవిష్యత్తును భద్రపరచుకునే దిశగా గత కొన్ని నెలల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా జీవన ఆకృతిని పునర్నిర్వచించుకొనే సమయం ఇది.

అమెరికన్ రచయిత రిచర్జ్ బాచ్ చెప్పినట్లు, “ప్రపంచమంతా గొంగళి పురుగును మాత్రమే (పరిణామం చెందడానికి ముందు) చూస్తుంది. కానీ గొప్పవారు మాత్రం సీతాకోక చిలుకనే చూస్తారు. అదే విధంగా కరోనా కాలంలో మన జీవితం గురించి సాగించిన లోతైన ఆలోచనలను పునఃసమీక్షించటం ద్వారా మనం సీతాకోక చిలుకలుగా ఎదగాలి. అదే మనం ముందుకు వెళ్ళే ఉత్తమ మార్గం.

ఈ ఫేస్ బుక్ పోస్ట్ రాయటం వెనుక నా ఉద్దేశం కరోనా కాలంలో జీవితం గురించి సాగిన లోతైన ఆలోచనలను, అనుభవాలను నా ప్రియమైన దేశ ప్రజలతో పంచుకోవాలనే ఈ చిరు ప్రయత్నం.


ఆలోచనలు పంచుకుందాం,

అనుభవాలను తెలుసుకుందాం,

ఆనందమయమైన జీవితాన్ని గడుపుదాం.  


- ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతి

Updated Date - 2020-07-12T18:35:12+05:30 IST